టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న బీజేపీ కుట్రను మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య హననానికి బీజేపీ పాల్పడుతున్నదని, సకల విలువలనూ తుంగలో తొక్కుతున్నదని దుయ్యబట్టారు. దీనిని అడ్డుకోకపోతే దేశంలో ప్రజాస్వామ్యానికి, సమాఖ్యతత్వానికి విఘాతం కలుగుతుందని అంతిమంగా భారతదేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
కొనుగోళ్లలో బీజేపీ ఆరితేరింది
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ చేసిన బేరసారాలపై నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. కారణం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ ఆరితేరింది. ఇప్పటికే గోవా, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఇదే పని చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, చట్ట విరుద్ధంగా డబ్బును వినియోగిస్తున్నది. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. అయితే ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే… దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించకపోవడం, ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బీజేపీ తన దుష్ట ప్రణాళికల ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలని తహతహలాడుతున్నట్లు స్పష్టమవుతున్నది.
– యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా సభ్యుడు
గెలవకుంటే.. ఎమ్మెల్యేలను కొంటారు
బీజేపీ తనకు అలవాటైన ఎమ్మెల్యేల కొనుగోళ్లను మళ్లీ చేసింది. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో డబ్బు ఎర చూపడం దారుణం. పోలీసులు భారీగా డబ్బులు సీజ్ చేశారు. బీజేపీది ఒకటే విధానం… ఎన్నికల్లో గెలవలేదా? అయితే గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి.
– ప్రశాంత్ భూషణ్, ప్రముఖ న్యాయవాది
బీజేపీ పాలనలో ఈ ధోరణి పెరిగింది
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఇప్పటికే బీజేపీ చాలా రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టిన ఘటనలను మనం చూశాం. బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నది. ఇది ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. అయితే ఇక్కడ ఓ అంశాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రలోభాలను తట్టుకొని ఎమ్మెల్యేలు తిరిగి రావడం, ఆ విషయాన్ని పార్టీకి చెప్పడం హర్షించదగ్గ విషయం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. తెలంగాణ అస్తిత్వం, టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం ఇందుకు కారణాలు. అంత పెద్ద మొత్తం డబ్బులు ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు సులభంగా అమ్ముడుపోతారు. అయినప్పటికీ వాళ్లు వెనక్కి వచ్చారంటే తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతి ఉందని చెప్పుకోవాలి.
– ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త
ఇది ప్రజలను మోసం చేయడమే
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఏ పార్టీ కూడా ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేయకూడదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం అంటే ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని గౌరవించి, సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు బీజేపీ ప్రయత్నించాలి.
– డాక్టర్ మునీశ్వర్ గుప్తా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆగ్రా
పడగొట్టాలనుకోవడం దారుణం
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం లాంటి చర్యలు దారుణమైనవి. ప్రజాస్వామ్యంలో ఇది సరైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావు. ఇప్పటికే ఇలాంటివి బీజేపీ ఎన్నో చేసింది. ఈ అప్రజాస్వామిక పద్ధతులకు పరిష్కారం చూడాలి. లేదంటే దేశం మొత్తం గందరగోళంలో పడుతుంది.
– వినోద్ అగ్నిహోత్రి, సీనియర్ హిందీ జర్నలిస్టు,
అమర్ ఉజాలా ఎడిటోరియల్ కన్సల్టెంట్
ఇలాంటివి బీజేపీకి అలవాటుగా మారాయి
కపటత్వానికి బీజేపీ పర్యాయ పదంగా మారింది. ఓ వైపు ఆ పార్టీ నేతలు ప్రతి సభలోనూ అవినీతిపై ప్రతిపక్షాలను నిందిస్తుంటారు. మరోవైపు వాళ్లే వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తుంటారు. ఇలాంటివి బీజేపీకి పరిపాటిగా మారాయి. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
– వినీత్ నారాయణ్, ప్రముఖ పరిశోధక పాత్రికేయుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే కుట్ర
బీజేపీ సర్కారు ప్రజల అభివృద్ధి కాంక్షను కాలరాసి రాజకీయ రాక్షస క్రీడను అడుతున్నది. కేంద్రం కన్నా మిన్నగా అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, నచ్చని ప్రభుత్వాలను కూల్చడం వారికి అలవాటే. అదే విద్యను ఇప్పుడు తెలంగాణపై ప్రయోగించింది. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చుతూ బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యానికి పాడె కడుతున్నది. ఇప్పటికైనా దేశ ప్రజలు ఆలోచించాలి.. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
– జూలూరు గౌరీశంకర్, చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
పూర్తిగా అప్రజాస్వామికం
ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్న బీజేపీ చర్య పూర్తిగా అప్రజాస్వామికం. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తాయి. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజాతంత్ర సంస్థలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. లేదంటే దేశం ఉనికే ప్రమాదంలో పడుతుంది.
– ఊర్మిళేష్, సీనియర్ జర్నలిస్టు, రచయిత