మొన్న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ యాత్ర చాలా కూల్‌గా గడిచినట్టున్నది. ఎప్పుడూ ఏదో గాంభీర్యం ప్రదర్శించే ఆయన చాలా రిలాక్స్‌గా కనబడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానందం ఆయనలో తొణకిసలాడింది.
అదే రోజు ఉదయం బెంగళూరులో రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో కొన్ని విశేష సమావేశాల్లో పాల్గొని, అక్కడ బహిరంగ సభ తర్వాత మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. స్థానిక బీజేపీ వర్గాలు ప్రధాని సందర్శనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా మోదీ మాత్రం ఆరేడు గంటల పర్యటనలో బంధువుల ఇంటికి వచ్చిన పెద్దమనిషిలా వ్యవహరించారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఇండ్లకు వెళ్లి దగ్గరి బంధువులా మెలిగారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలోనూ విపక్షాలపై దాడిని తొందరలోనే ముగించి, ప్రజలకు పొదుపు మంత్రాన్ని ఉపదేశించారు. ప్రధాని ప్రసంగమంతా మన్ కీ బాత్ తరహాలోనే సాగింది.
ప్రభుత్వ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని బహిరంగంగా రేవంత్‌రెడ్డిని మాతో కలిసి పని చేయండి. అప్పుడే మీ కలలు నెరవేరుతాయి అని అఫర్ ఇవ్వడం టీ కప్పులో తుపాను మాదిరి ఓ సంచలనాన్ని పుట్టించింది. మోదీ మాటలకు రేవంత్‌రెడ్డి చిరునవ్వులు చిందించటం ఎన్నో అర్థాలకు తావిస్తున్నది. ఇప్పుడే ఇవన్నీ బహిరంగంగా మాట్లాడుకోవడమెందుకు బడేభాయ్ అన్నట్టుగా రేవంత్ ధోరణి కనబడింది. ఒక విపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అంత ఓపెన్‌గా ప్రధాన మంత్రి తమ పార్టీలోకి వచ్చేయ్ అని సరాసరి అనడం ఊహించగలమా? దానికి సదరు సీఎం చేతులు పిసుక్కుంటూ మురిసిపోవడం భావ్యమేనా? అది ప్రభుత్వ కార్యక్రమం అనే స్పృహ ఎవరికీ లేకపోవడం విడ్డూరం. ఇదే ప్రశ్నను మరో రాష్ట్రంలో ఉన్న విపక్ష ముఖ్యమంత్రితో ప్రధాని అనగలరా? రేవంత్‌తో ప్రధానికి ఇంత చొరవ దేనికి?
నవ్వుతూ అన్న మాటే అయినా రేవంత్‌ను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని మరో రూపంలో మోదీ ఎద్దేవా చేసినట్టే. ప్రధాని మాట్లాడే తీరు ఇదేనా అని కాంగ్రెస్ పెద్దలు నోరు విప్పలేదు. నాది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీయే నన్ను ముఖ్యమంత్రిని చేసింది. సర్వదా దానికి రుణపడి, అదే పార్టీలో కొనసాగుతాను అని మన సీఎం మాట్లాడి ఉండాల్సింది కదా! ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. మోడీకి చంద్రబాబు జీ హుజూర్, చంద్రబాబుకు రేవంత్ నమ్మినబంటు. ఈ చుట్టరికం చాలు కదా రేవంత్‌పై విసుర్లు విసరడానికి.
అన్నవారు, అనిపించినవారు, విన్నవారు.. అందరూ బాగానే ఉంటారు కానీ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి కాంగ్రెస్‌ది. కిచిడి ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ మావాడా కాదా అనే అనుమానం ఇప్పటికే అధిష్ఠానానికి ఉన్నది. ఇక రేవంత్ ముసిముసి నవ్వులు హైకమాండ్ పెద్దల్లో మరింత ఆందోళనను పెంచుతాయి. రేవంత్ మౌనం పరోక్షంగా బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. అదే మౌనం తాను కాంగ్రెస్‌కు దూరమవుతున్నాననే సంకేతాన్ని కూడా ఇస్తున్నది. పదేండ్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొనే రేవంత్ మాటకు ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ల దగ్గర జవాబు లేదు. కాంగ్రెస్ ఐదేండ్లు, నేను పదేండ్లు అనే గూడార్థం రేవంత్ మాటల్లో ఉన్నది. మాతో కల్సి పనిచేయి అంటూ రా.. రమ్మంటున్న ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను తుద ముట్టించాలనే అనుకుంటారు. కాంగ్రెస్ పాలన పోవాలి.. రేవంత్ మాత్రం మాతో రావాలి అనే దిశగా కేంద్రం, మోదీ అడుగులు కనిపిస్తున్నాయి. ఇందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. చివరికి దెబ్బ తినేది తెలంగాణ రాష్ట్రం, ప్రజల భవిష్యత్తు.
పోరాడి నిలబెట్టుకున్న అస్తిత్వం, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇంటి పార్టీని పక్కన బెట్టిన ప్రజలు మళ్లీ ఆంధ్ర పెత్తనానికి బలి కావొద్దు. రాష్ర్టాన్ని ఎండగట్టే పనిలో బీజేపీ ఉంటుంది. నోరు విప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి కాలం గడుపుతారు. దీనంతటి వెనుక ఉన్న కుట్రను తెలంగాణ ప్రజలు ఇప్పుడే గ్రహించకపోతే చాలా నష్టపోతారు. తెలంగాణ కోసం సర్వం ఒడ్డి పోరాడిన ఇంటి పార్టీకి తిరిగి పట్టం కట్టేందుకు ఇప్పటి నుంచే ప్రజలు సంసిద్ధం కావాలి. మరోమారు మాయ మాటలకు బోల్తా పడొద్దు. జై తెలంగాణ అని నినదించి, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గులాబీ పార్టీయే తెలంగాణకు రక్ష.
– బద్రి నర్సన్