‘మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్’. ముచ్చట్లకు ముసుగు తొడిగి కృత్రిమ ప్రజా సమ్మతిని సృష్టించటం.. మూకుమ్మడిగా జనంలోకి జొప్పించడం. అందులో చంద్రబాబు దిట్ట. ఉనికి కోసం సత్యాన్ని బలిపెట్టడం దీని అంతిమలక్ష్యం. గురుబోధ శిష్యుని పుర్రెలకు జొరబడ్డది.
గడ్డిపరక ఒకటి బ్రహ్మాస్త్రంగా తెలంగాణలో ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమా తారలు.. అక్రమ సంబంధాలు అంటూ జుగుప్సాకరమైన ఊహలను ఎగదోస్తూ ఫోన్ ట్యాపింగ్ జనం మధ్యకొచ్చింది. లేని రంకులు అంటగట్టి ఆడబిడ్డల ఉసురు పోసుకుంటూ పచార్లు కొట్టింది. ఇది తనంతట తానుగా ప్రాచుర్యం పొందలేదు. చంద్రబాబు రాడార్ టవర్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలు రూపొందిస్తే పొందిన ‘కూటకార్యం’. ఫోన్ ట్యాపింగ్ తంతు ఒక స్పాంటేనియస్ వ్యవహారం కాదు. ఓటుకు నోటు పెట్టి పట్టపగలే ప్రజల రాజ్యాన్ని కూల్చచూసిన శుక్ర శిష్యుల సంవేదనం నుంచి ఉద్భవించిన ఎత్తుగడ.
పరిపాలనలో గూఢచర్యం ఉంటుంది. ఇందుకోసం ఓ పోలీసు విభాగమే ఉన్నది. సంఘ విద్రోహులు, దేశ ద్రోహులు, రాజద్రోహులు, తీవ్రవాద కార్యకలాపాలు, మాదకద్రవ్యాల ముఠాలు గూఢచర్యంతోనే బయటికి వస్తాయి. సమాజహితం కోరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ పనిచేస్తుంది. అరాచకశక్తుల అణచివేతకు, విద్రోహుల ఏరివేతకు అదొక్కటే మార్గం. ఆ సమాచారం ఎలా తీసుకుంటారనేది సంబంధిత అధికారుల వెసులుబాటు. దీనితో పాలకునికి ఏం పని? వారి ఉద్యోగ విధుల్లోకి పాలక నేత ఎందుకు తొంగిచూస్తారు. అసలీ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి ఎందుకు వచ్చింది? తెచ్చిందెవరు? కేసీఆర్ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశం నుంచి పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా తెప్పించిందా? రేవంత్ ప్రభుత్వం వేసిన సిట్ అటువంటి పరికరాలు గుర్తించిందా? అతి సున్నితమైన ఈ విషయం ఎందుకు వివాదాస్పదమైంది? బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగట్టి కేసీఆర్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? దీని మూలాలు దొరకాలంటే ఒకసారి చరిత్ర మూలాలను పెకిలించాలి.
‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అని అవతలి స్వరం ఫోన్లో చెప్తుంటే.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సూటుకేసుల్లోంచి రూ.50 లక్షల నోట్ల కట్టలు బయటకు తీసి సర్దుతున్న పాపిష్టి పనిని గుర్తుచేసుకోవాలి. తెలంగాణ వచ్చిన మలి ఏడాదే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినయి. అదే అదనుగా తెలంగాణ అస్తిత్వాన్ని బహిరంగ మార్కెట్లో పెట్టే కుట్రలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయమని రూ.5 కోట్లు ఆఫర్ చేశారు. అడ్వాన్స్ కింద రూ.50 లక్షలతో సూట్‌కేసులు నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినయి. ఈ సూట్‌కేసులు మోసుకు పోయింది ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి చంద్రబాబు బంటు రేవంత్ రెడ్డి. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇస్తూ కెమెరాకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వీడియోలు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటి తలుపులు తట్టి చైతన్యపరిచాయి. ఆ సందర్భంలో ‘నీకు ఏసీబీ ఉంటే, నాక్కూడా ఏసీబీ ఉంది’ అని మేకపోతు గాంభీర్యం, బీరాలతో కరకట్టకు నివాసం మార్చారు. కొంతకాలం జైలు జీవితం తర్వాత రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయటకు రావటం, అనంతర పరిణామాలతో కేసు మరుగున పడిపోయింది.
ఆ కడుపుమంట నుంచి పుట్టిందే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ వాదులు పెద్దగా పట్టించుకోలేదు కానీ, గత 2024 మార్చి 31 రోజున ఆంధ్రజ్యోతి కొత్త పలుకులోని ఓ పేరా.. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌ను అప్పట్లో ట్యాప్ చేయడం వల్లనే ఓటుకు నోటు కేసులో ఆయనను ఇరికించి జైలుకు పంపారు. ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నాటి సంఘటనకు ప్రతీకారంగా విచారణకు ఆదేశించారు’ అని రాసుకున్నారు. రాజద్రోహం తప్పు కాదు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే తప్పు అని నూరిపోయటం వారి ఉద్దేశం కావొచ్చు. ఇక్కడో సందర్భం గుర్తుచేయాలి. కేసీఆర్‌కు తెలంగాణ పిత అని సర్వనామం ఉంటే.. బాబుకు ఫోన్‌ట్యాపింగ్ పితామహునిగా గుర్తింపు ఉన్నది. 1995లో సాంకేతిక నైపుణ్యం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఆ రాష్ర్టానికి సీఎం చంద్రబాబు. 2014 నుంచి 2019 వరకు విభజిత ఏపీలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్, వ్యక్తిగత డేటా చౌర్యం జరిగిందని ఆ రాష్ట్ర శాసనసభ ఉప సంఘం కూడా తేల్చింది. ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ వెళ్లి మరీ పెగాసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని, ఇందుకోసం రూ.25 కోట్లు ఖర్చు చేశారని ఉపసంఘం నిర్ధారించింది. ఇదే అంశాన్ని బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర శాసనసభలో స్వయంగా వెల్లడించారు.
‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ స్వర పలుకులు చంద్రబాబువే కానీ, ఆయన ఫోన్ ట్యాపింగ్‌కు గురికాలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇది రాజనీతిజ్ఞునిగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని విశదపరిచే అంశం. వెన్నుపోటుదార్లనే చట్టబద్ధంగా ఎదుర్కొన్న విజ్ఞత కేసీఆర్‌ది. అర్భక అంటుముచ్చట్లు ఆయనకేల?
అవిభక్త శిఖామణులు కొందరు మీడియా ముందుకువచ్చి తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని బడాయికి పోతున్నరు. తుచ్ఛ ఆరోపణలు మినహా వారి వద్ద ఒక్క ఆధారం లేదు. ఉన్నట్టు సిట్ గుర్తించలేదు. అయినా 18 నెలల నుంచి దుష్ట చతుష్టయం చేయని చేతబడుల్లేవు. కేసీఆర్ మీద పఠించని క్షుద్ర మంత్ర పఠనాల్లేవు. తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలమే రక్షణ కవచమై కేసీఆర్‌ను కాపాడుతున్నది. భవిష్యత్తులోనూ కాపాడుకుంటుంది.