గగనంలో నుంచి గద్దల్లా
భూమి మాంసాన్ని వెతుకుతున్నరు
మందుల కంపెనీల పేరుచెప్పి
గిరిజనుల గుండెలను పీక్కుతింటున్నరు
వారి జీవనమెట్లా
పిల్లాపాపల చదువులెట్లా
ప్రజా భవిష్యత్తు చాటున పెట్టుబడులు
డబ్బున్న మేకవన్నె పులులు
కంపెనీ సాకుతో ధరణిపై మాటేసిండ్రు
భూమి నుండి గెదుముతున్నరు
కాదంటే లాఠీలతో తరుముతున్నరు
చెరబట్టడానికి రైతులేమన్న హంతకులా?
బిడ్డల గోస
తండ్రుల నీడ
భర్త ఎక్కడున్నడో తెల్వదు
ఏ బందీఖానల్లో ఉంచిండ్రో చెప్పరు
భర్త జాడకై నిండు గర్భిణి పరుగులు
సీతమ్మకు కూడా ఇన్ని సెరలు లేవేమో
ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యమా?
మా భూముల్లో
మా ముత్తాతల తాతల తండ్రుల ఆనవాళ్లు
వారి పాదముద్రలను అరకలు చేసి దున్నినం
పంటలెండిపోతే గడ్డికాల్చీ మళ్లీ పొలం చేసినం
మాకు కుట్రలు కుతంత్రాలు తెలువవు
ఫార్మా సర్పాలై పడగెత్తి వెంటబడిండ్రు
మా శవాల మీదనా మీ నయా నగరాలు?
చెమట తల్లులు
గింజల తండ్రులు
కర్షకులు ఎదురు తిరుగలే
మా భూములు మాకేనని మర్లబడ్డరు
న్యాయం కోసం నిలబడ్డరు
ఇనుప పాదాలకు భూములెన్నైనా సరిపోవు
తరతరాలుగా అంబలి గంజినీళ్లకేడ్చినం
వలసపక్షులై గోసపడ్డం
దేశానికి ఆనకట్టలు పాలమూరు కూలీల చేతులే
సోరసోర బిడ్డలను నాయనలను పోగొట్టుకున్నం
తెలంగాణ స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నం
మా భూముల్లో నీళ్లు పంటలు కళ్ల చూసుకుంటున్నం
ఇంతలోనే మా భూమిలో మేము పరాయివాళ్లమా?
– వనపట్ల సుబ్బయ్య 94927 65358