రెండురెళ్లు నాల్గన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అన్నందుకు జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి స్వాతంత్య్రాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్ర వడ్డీ తిప్పే కామందులకు క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగా అర్థం చేసుకున్న వాళ్లంతా పేదల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది.
-శ్రీశ్రీ
Telangana | ఎప్పుడో గత శతాబ్ది పూర్వార్ధంలో మహాకవి చెప్పిన ఈ మాటలు నేటికీ నిత్య సత్యాలుగా ముందు నిలుస్తున్నాయంటే రాజకీయ విలువలు, పరిపాలన ప్రమాణాలు ఎంతగా పతనం అవుతున్నాయో ఊహించవచ్చు. పాలకుల్లో విష సంస్కృతి పడగలెత్తిన వైనాన్ని గమనించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు గుర్తుచేసినా, ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసినా క్షమించరాని నేరం అవుతున్నది. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాలలో ఎత్తిచూపినవారిపై, ఏకరువు పెట్టినవారిపై అధికార గణం ఒంటికాలు మీద లేస్తున్నది. 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ నీలి నీడలు తెలంగాణ అంతట పరుచుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నది. ఇంతవరకు పరిపాలన పట్టాలెక్కలేదు. వాగ్దానాలు నెరవేరలేదు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను రకరకాల కేసుల్లో ఇరికిస్తూ అరెస్టుల బూచిని చూపిస్తూ సంచలనాలు సృష్టించడం తప్ప.. ‘ఎన్నికల్లో ప్రజలకేం చెప్పాం, ఇప్పుడేం చేస్తున్నాం’ అనే ఆత్మవిమర్శ పాలకుల్లో పూర్తిగా లోపించింది. అమాయకంగా మాయమాటలు నమ్మి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి అందలమెక్కించిన ప్రజలు దారుణంగా మోసపోయాం, వంచించబడ్డాం అంటూ వాపోతున్న దృశ్యాలు ఆగ్రహావేశాలు ఇవాళ రాష్ట్రంలో అడుగడుగునా ఆవిష్కృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఉద్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అది చట్ట ప్రకారం నేరం కానప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధమే అయినప్పటికీ ప్రభుత్వం సహించలేక ఉక్కుపాదం మోపుతున్నది.
విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, అమీతుమీ తేల్చుకోవడాలు, సాధింపులు, పగలు ప్రతీకారాలు రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి కొత్తేమీ కాదు. కానీ, అత్త మీది కోపం దుత్త మీద తీర్చుకున్నట్టు సాధారణ ప్రజలను, బుద్ధిజీవులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధించడం సమంజసం కాదు. కానీ, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వం పిచ్చుకలపై బ్రహ్మాస్ర్తాలను ప్రయోగిస్తున్నదని స్పష్టమవుతున్నది. సంఘ విద్రోహ శక్తులపై, కరుడుగట్టిన నేరస్థులపై ప్రయోగించవలసిన భారత శిక్షాస్మృతి చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇది ఇవాళ కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమే. ఆ క్రమంలో ఎన్నెన్నో నిర్బంధ చట్టాలను కాంగ్రెస్ రూపొందించింది. ఆ చరిత్రలోకి వెళితే ఓ మచ్చుతునక…
1971 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని ఇందిరాగాంధీకి ఎదురే లేకుండా పోయింది. సీనియర్ నేతలు కనుమరుగైపోయారు. ఇందిరమ్మ ఏం చేసినా చెల్లుతుందన్న అభిప్రాయం బలపడింది. పరిపాలనలో ప్రజాస్వామ్యం మసకబారి నియంతృత్వం తలెత్తింది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. వాటిని అణచివేసేందుకు 1975 జూన్ 25న ప్రధాని ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించారు.
దేశవ్యాప్తంగా పత్రికలపై సెన్సార్షిప్, ప్రతిపక్ష నేతల అరెస్టులు, పౌరహక్కులపై ఆంక్షలు, ప్రజల నిర్బంధాలు ఏకంగా 20 నెలల పాటు దేశమే ఒక జైలుగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వం పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజలు తొలిసారిగా ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. తుదకు ప్రధాని హోదాలో ఉన్న ఇందిరమ్మ కూడా రాయబరేలి నియోజకవర్గంలో ఓడిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆనాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకుతెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ తీర్పును ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలను, అభిప్రాయాలను సైతం సహించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నది. ప్రజల కష్టాలు నష్టాలు, సద్విమర్శలు, హామీలు నెరవేర్చాలన్న అభ్యర్థనలు కూడా నేరాలేనా? సంబంధిత వ్యక్తులు నేరస్థులేనా? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం అవునేనని దబాయిస్తున్నది. అందుకు దృష్టాంతాలు కోకొల్లలు. కొణతం దిలీప్ ఐటీ రంగ నిపుణుడు, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఐటీ డైరెక్టర్గా ఆయన విశేష సేవలందించారు. మన్నె క్రిశాంక్ విద్యాధికుడు, తెలంగాణ ఉద్యమ నేత, జాతీయ మీడియా చర్చల్లో ప్రముఖంగా పాల్గొనే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి. ఇంకా ఎందరో జర్నలిస్టులు, ఉద్యమకారులు, యువకులు పెట్టిన పోస్టులు అభ్యంతరకరమైనవి కాకపోయినా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెడుతున్నది. పద్ధతిగల సోషల్ మీడియా వారియర్లపై కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేతలపై అవాంఛనీయమైన పోస్టులతో విషం చిమ్ముతున్న వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్నది.
వాస్తవానికి, సోషల్ మీడియా వికృత పోకడలకు మూలాలు ఆధిపత్య జాతీయ పార్టీలలోనే ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి వదంతులు, మార్ఫింగ్లు, అపోహలు, భయాలు, నిందలను సోషల్ మీడియా వేదికలపైకి రప్పించి, పెంచి పోషించిన ఘనత ఆధిపత్య జాతీయ పార్టీలదే. కేసీఆర్ పాలనపై, ఆయన కుటుంబంపై ఈ రెండు పార్టీలు ఏ స్థాయిలో బురదజల్లాయో సెల్ఫోన్ చేతిలో ఉన్న వారందరికీ తెలుసు. బీఆర్ఎస్ శ్రేణులు గాని, అభిమానులు గాని సోషల్ మీడియాను అలా దుర్వినియోగం చేయడం లేదు. సమంజసమైన, హేతుబద్ధమైన, ప్రజాస్వామికమైన తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంటున్నారు. ఆ తేడా తెలియకుండా చావుకు, పెళ్లికి ఓకే మంత్రం అంటే ఎట్లా?
ప్రజల హక్కులకు, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడం వల్ల వెలువడే ఆగ్రహజ్వాలలను చల్లార్చే శక్తి ఇంకా ఈ భూమ్మీద పుట్టలేదు. ప్రజాభిప్రాయం విత్తనం లాంటిది. భూమి పొరలను, రాళ్లను సైతం చీల్చుకుని అంకురించే శక్తి దానికి ఉంది. దానిని ఆంక్షలు అస్సలు ఆపలేవు.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238