ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ హామీపై యూటర్న్ తీసుకోవడం.. భస్మాసుర హస్తంగా మారనున్నదా? కులగణన కాకి లెక్కలే.. ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేయనున్నాయా? రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను విశ్లేషిస్తే… అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.
14 నెలల రేవంత్ పాలనపై తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించడం అటుంచితే.. కూల్చివేతలు, కబ్జాలు, రైతులు, సామాన్యుల ఆక్రందనలతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ కుటుంబసభ్యులపై స్కామ్‌ల పేరిట అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తన ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీ సందర్భంలోనూ డైవర్షన్ పాలిటిక్స్‌తోనే నెగ్గుకొచ్చారు.
ఇవన్నీ పసిగట్టిన తెలంగాణ బిడ్డలు.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎట్లుండె? ఇప్పుడెట్లయ్యిందంటూ పోల్చి చూసుకోవడం ప్రారంభించారు. అందుకే, కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించిన పోల్‌లో ‘మాకు కేసీఆర్ పాలనే నచ్చిందం’టూ పల్లె నుంచి పట్నం వరకూ.. నాగలి పట్టిన రైతన్న నుంచి ల్యాప్‌టాప్ పట్టిన టెకీ వరకూ ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఇది కాంగ్రెస్ నాయకులకు ఎంతమాత్రం రుచించలేదు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని మాత్రం వాళ్లు విస్మరించే స్థితిలోనూ లేరు. ప్రజల అసమ్మతి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గట్టెక్కడం కష్టమని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. ఎన్నికల్లో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే బహుజనుల ఆదరణను చూరగొనడమే ఏకైక మార్గమని భావించింది. ఈ క్రమంలోనే గత నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేను తెరమీదకు తీసుకొచ్చింది. బీసీల జనాభాపై అసెంబ్లీ సాక్షిగా కాకి లెక్కలను వల్లె వేసింది. ఇప్పుడు అదే ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా పరిణమించింది.
తప్పుడు సర్వే టు యూటర్న్: ‘మేమెంతో మాకంత వాటా’.. ఇదీ బీసీల చిరకాల స్వప్నం. అయితే, కాంగ్రెస్ సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన కులగణన లెక్కలు బీసీల ఆశలను చిదిమేశాయి. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమేనని, ముస్లిం బీసీలు 10.08 శాతంతో కలుపుకొంటే బీసీల మొత్తం జనాభా 56.33 శాతం కూడా దాటడం లేదని రేవంత్ ప్రభుత్వం కాకి లెక్కలను వల్లె వేసింది. కులగణన పేరిట బీసీలను తక్కువ చేసి చూపించిన ఈ నివేదికపై బీఆర్ఎస్ సహా బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. వెనుకబడిన వర్గాలను నమ్మిం చి గొంతు కోయడమేంటని నిలదీశాయి. ఈ లెక్కలపై సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొదలు సీనియర్ నేతలు కూడా భిన్నస్వరా లు వినిపించారు. ముప్పేట దాడి పెరిగిన నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమయ్యేనా? అనే ప్రశ్న లు వెల్లువెత్తాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ తన అసలు బుద్ధిని బయటపెట్టుకొన్నది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని.. ఒప్పుకొంటేనే అమలుచేస్తామని యూటర్న్ తీసుకొన్నది. లేదంటే పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చేతులు దులుపుకొన్నది. కాంగ్రెస్ ప్రకటనపై బహుజనులు ధ్వజమెత్తారు. అసెం బ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని బీసీ నేతలు అల్టిమేటం జారీచేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టేందుకు తెరమీదికి తెచ్చిన ‘బీసీ కులగణన’ అంశం భస్మాసుర హస్తంగా మారిందంటూ కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ఉసూరుమనడం గమనార్హం.
సందేహాల పుట్ట: కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కులగణన సర్వేపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25 శాతం మాత్రమే ఉన్నదంటూ నివేదిక వెల్లడించడాన్ని తప్పుబడుతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం తప్పులతడకగా కొనసాగిందని మండిపడుతున్నారు. 2023లో బీహార్‌లో చేపట్టిన కులగణన సర్వేలో బీసీల వాటా ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 63.14 శాతంగా ఉన్నదని గుర్తుచేస్తున్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ఇది 46.25 శాతానికి (ముస్లిం బీసీలతో కలిపి 56.33 శాతం) పరిమితం కావడమేమిటని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు అరకొర సమాచారాన్నే సేకరించారని, శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ఈ సర్వేతో తెలంగాణలోని బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2023 జనవరిలో బీహార్‌లోని నితీశ్ సర్కారు కులగణన సర్వేను చేపట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బీహార్ మొత్తం జనాభా 13,07,25,310గా తేలింది. దీంట్లో ఓబీసీల జనాభా 3,54,63,936 (27.12 శాతం) కాగా ఈబీసీల జనాభా 4,70,80,514 (36.01 శాతం)గా లెక్కగట్టారు. మొత్తంగా రాష్ట్రంలో బీసీల జనాభా 8,25,44,450 (63.14 శాతంగా తేల్చారు. అంటే బీహార్ రాష్ట్రంలోని ప్రతీ 100 మందిలో 63 మంది బీసీలేనని అర్థమవుతున్నది. అయితే, తెలంగాణలోని కులగణన నివేదిక ప్రకారం… రాష్ట్రంలోని ప్రతీ 100 మందిలో 46 మంది మాత్రమే బీసీలుగా తేల్చారు. ఇదే బీసీ సంఘాల నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ప్రతీ రాష్ట్రంలో బీసీల జనాభా శాతాల్లో ఒకట్రెండు అంకెలు తేడాలుండవచ్చేమో గానీ.. బీహార్ బీసీలతో పోలిస్తే, తెలంగాణ బీసీ జనాభా ఏకంగా 17 శాతం వరకూ తేడా ఉండటమేమిటని నిలదీస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కులగణన సర్వే తప్పుల తడకగా సాగిందని మండిపడుతున్నారు.
రాహుల్ అందుకనే అలా అన్నారా?: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం పార్లమెంట్లో మాట్లాడుతూ… తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల జనాభా దాదాపు 90 శాతం వరకూ ఉన్నదని వెల్లడిం చారు. ఇది తనకు ఒకింత షాక్‌కు గురిచేసినట్టు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని పనిలో పనిగా ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే, తెలంగాణలో జనరల్ క్యాట గిరీ కాకుండా మిగిలిన వర్గాలవారి సంఖ్యను 90 శాతానికి పెంచిన రాహుల్.. బీసీల జనాభా ఎంత ఉన్నదన్న విషయాన్ని ప్రత్యేకంగా ఎం దుకు ప్రస్తావించలేదని బీసీ నాయకులు ప్రశ్ని స్తున్నారు. కులగణన పేరిట బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిన రేవంత్ ప్రభుత్వ నిర్వాకం బయటపడొద్దన్న ఉద్దేశంతోనే మైనార్టీ లు, ఎస్సీ, ఎస్టీల జనాభాను బీసీలతో కలిపి మొత్తంగా 90 శాతంగా ఏమార్చే ప్రయత్నా లకు రాహుల్ తెగబడ్డారని విమర్శిస్తున్నారు.
కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెల ల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థాని క సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23 శాతం రిజ ర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేష న్ల ఉప వర్గీకరణను అమలుచేస్తాం.
– కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తాం. ఒప్పుకొంటే అమలుచేస్తాం. లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం.
– అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ మాటమార్పు
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఏడేండ్ల కిందట సిద్ధమైన కులగణన నివేదిక లెక్కలు ఇప్పటికీ బయటకు రాలేదు. వెరసి అటు కర్ణాటకలో అయినా, ఇటు తెలంగాణలో అయినా.. దేశం మొత్తంగా చూసినా.. బీసీలపై కాంగ్రెస్ ఒలకబోస్తున్న ఆప్యాయత సవతి తల్లి ప్రేమేనని విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీసీ కుల గణనను తెరమీదికి తీసుకొచ్చి ప్రయోజనాలు పొందాలనుకొన్న తెలంగాణ కాంగ్రెస్ పాచిక.. భస్మాసుర హస్తంగానే మారిపోయిందని అభి ప్రాయపడుతున్నారు.
– ఎడిటోరియల్ డెస్క్