ఓటు చేజారింది. బతుకు దిగజారింది. మాయమాటలతో గద్దెనెక్కిన రాజకీయం చుక్క లు చూపిస్తున్నది. దిక్కుతోచక ప్రజలు దిక్కులు చూస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న సంక్షుభిత వాతావరణంలో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటలు ప్రజలను కొంతలో కొంత ఊరడిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజలకు, తికమక పడుతున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. అదొక ఆత్మీయ ఆలింగనం. భయపడొద్దు నేనున్నాననే భరోసా. రేపటి మీద నమ్మకం కలిగించే ఆశ. ఇదీ నిజం అనే కనువిప్పు. పార్టీ రజతోత్సవ సన్నాహాల్లో భాగంగా కేటీఆర్ జిల్లా యాత్రలు చేపట్టినప్పటికీ, అవి రోజురోజుకూ ప్రజలతో ఆయన అనుబంధాన్ని మరింత పటిష్ఠపరిచే అభిమాన యాత్రలుగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమర శంఖారావాలు పూరిస్తున్నాయి. సభలు సాగుతున్న తీరు ఉద్యమ కాలంలో పార్టీ అధినేత కేసీఆర్ జరిపిన పర్యటనలు, సభలను స్ఫురణకు తెస్తున్నవి.
ఉద్యమం బలహీనపడినప్పుడల్లా, కార్యకర్త ల్లో నైరాశ్యం పొడసూపినప్పుడల్లా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తన వ్యూహ చతురతతో, వాక్పటిమతో కొత్త ఉత్సాహాన్ని నింపేవా రు. ఇప్పుడూ తెలంగాణ సమాజంలో తీవ్ర నిరా శా నిస్పృహలు ఆవరించి ఉన్నాయి. ప్రజల్లో దుఃఖమున్నది. అది ఆత్మీయ నేత పలకరింపు తో కట్టలు తెంచుకుంటున్నది. కేటీఆర్ వస్తున్నారనే మాట చాలు. మండే ఎండల్లోనూ తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన చెప్పే మాటలను చెవిపెట్టి వింటున్నారు.
సూర్యాపేట సభలో అయితే మాజీ సర్పంచ్ రాధ చివరిదా కా కన్నీరు కారుస్తూ కూర్చోవడం అందరినీ కదిలించింది. ‘రామన్నా సేవ్ తెలంగాణ’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు సభల్లో కనిపించడం విశేషం. ఆత్మీయులకు బాధలు చెప్పుకొంటే సగం భారం దిగిపోతుందన్న పెద్దల మాట ఇక్క డ గుర్తుకువస్తున్నది. ప్రజలు కష్టనష్టాలు చెప్పుకొంటుంటే కేటీఆర్ ఓపికగా వింటున్నారు. తానూ అనునయ వాక్యాలు చెప్తున్నారు. అవు ను పొరపాటు జరిగింది. అరచేతిలో స్వర్గాన్ని చూపితే ఆదమరచి ఓటు వేసిన పాపానికి ఐదేం డ్ల శిక్ష మనకు మనమే వేసుకున్నామనే భావన ప్రజల్లో ఉన్నది. దాన్ని కేటీఆర్ అరటి పండు వలిచి పెట్టినట్టు వివరంగా చెప్తుంటే ప్రజలు ఇది మా మనసులోని మాటే అని ఆసక్తితో విం టున్నారు. ఆమోదంతో తలలూపుతున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే పరమావధిగా ఉంటుంది. ప్రస్తుత సీఎం రేవంత్ అయితే ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేశానని పలు సందర్భా ల్లో చెప్పుకొన్నారు. కానీ, బీఆర్ఎస్కు అధికా రం, కేసీఆర్‌కు సీఎం పదవి అంతిమ లక్ష్యాలు కావు. ఎన్నోసార్లు పదవులను తృణప్రాయంగా వదిలేసుకున్న చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్రం బాగోగులు, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే ఆయన అసలైన లక్ష్యం. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రజల కోసమే పనిచేస్తామన్న కేటీఆర్ మాటలు కార్యకర్తలకు కర్తవ్యబో ధ చేస్తున్నాయి.
రెండు విడుతలుగా ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ర్టాన్ని అంగరంగ వైభోగంగా వెలిగేలా చేసిన కేసీఆర్‌కు మరో విడత సీఎం పదవితో కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికిప్పుడు అధికారం కావాలని బీఆర్ఎస్ వెంపర్లాడటం లేదు కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జై భీమ్’ చెప్తారని కేసీఆర్ చెప్పిన మాటను ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పట్ల కేసీఆర్ అంచనాలు ఎంత ఖచ్చితమైనవో కేటీఆర్ వివరిస్తుంటే ప్రజలు నిజమే కదా అని విస్తుపోతున్నారు. కేటీఆర్ ఆప్తవాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. అందులోని సారాన్ని మనసులో నింపుకొంటున్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ఎంతగా ఉన్నా మనది ఓటు తో తీర్పు చెప్పే ప్రజాస్వామ్యమని, శాసనపరమైన, రాజ్యాంగ పరమైన పరిమితులు ఎన్నో ఉంటాయని కేటీఆర్ వివరించిన తీరు రాజకీయాల్లో బీఆర్ఎస్ నిజాయితీకి, రాజకీయ పరిణతికి నిలువెత్తు అద్దం పడుతున్నది. జరిగిన తప్పు సరిదిద్దుకునేందుకు ఇంకా మూడున్నరేం డ్ల సమయం పడుతుందన్న కేటీఆర్ మాట బీఆర్ఎస్ చిత్తశుద్ధిని చాటిచెప్తున్నది. అవకాశవాదా న్ని, అధికార దాహాన్ని ఎన్నడూ దరిచేరనీయని, ప్రజలతో విడదీయరాని అనుబంధం కలిగిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఇది పాతికేండ్ల చరిత్ర నిరూపించిన నిజం.