తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి, కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై నమోదైన ఫిరాయింపు కేసుల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన క్లీన్చిట్ ఇప్పుడు తీవ్ర రాజకీయ, రాజ్యాంగపరమైన చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ దృష్టిలో ఇది కేవలం ఒక న్యాయపరమైన నిర్ణయం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు రూపొందించిన రాజ్యాంగ నిబంధనలనే బలహీనపరిచే చర్యగా వారు భావిస్తున్నారు. ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతం, విధానాలను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు పదవిలో ఉండగానే మరో పార్టీలో చేరితే అది ప్రజల తీర్పును అవమానించినట్టే అవుతుందని పార్టీ నాయకత్వం పేర్కొంటున్నది.
భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు ఎన్నో దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్నాయి. ఎన్నికైన ప్రతినిధులు అధికారానికి దగ్గరగా ఉండటానికి పార్టీలు మార్చడం ఒక రాజకీయ వ్యాపారంలా మారింది. ఈ పరిస్థితిని అరికట్టడానికి 1985లో కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్పింది. ఈ చట్టం ప్రకారం ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ప్రజాప్రతినిధి స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదిలినా, లేదా మరో పార్టీకి మద్దతుగా వ్యవహరించినా అనర్హతకు గురవుతారు. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ప్రజల ఓటు విలువను కాపాడటం. ప్రజలు ఎంచుకున్న పార్టీకి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించకుండా నిరోధించడం. తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజల ముందే చాలా స్పష్టంగా ఉన్నాయి.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొన్నారు. ఆ జాబితాలో ముఖ్యంగా ప్రస్తావనలో ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎం సంజయ్‌కుమార్. ప్రజల ముందు కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు కావడం, ఆ పార్టీ కండువాలు ధరించడం, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొన్నది. ప్రజల తీర్పును అపహాస్యం చేసే రాజకీయాలుగా అభివర్ణిస్తున్నది.
పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు గతంలో కీలక తీర్పులు ఇచ్చింది. కిహోటో హోలోహన్ వర్సెస్ జచిల్హూ కేసులో స్పీకర్ నిర్ణయాలు న్యాయపరిశీలనకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. కేశం మేఘచంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో ఫిరాయింపు కేసులను ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంచకూడదని, సాధారణంగా మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఈ కేసులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండి చివరకు క్లీన్‌చిట్‌తో ముగియడం అనేక అనుమానాలకు దారితీసింది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమైనది. ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఓటు వేస్తే ఆ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీలో చేరడం రాజకీయ నైతికతకు విరుద్ధం. ఇలాంటి పరిణామాలు కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది అని వారు హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను ఆపరేషన్ ఆకర్ష్‌గా బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులను రాజకీయ ఒత్తిడులతో లేదా ఇతర ప్రలోభాలతో పార్టీ మారేలా చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్తున్నారు. ప్రజలు ఒక పార్టీకి ఓటు వేస్తే గెలిచిన ప్రతినిధులు మధ్యలో పార్టీ మారితే అది ప్రజల తీర్పును పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టే అవుతుందని వాదిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపుల పట్ల స్పీకర్ తీసుకున్న నిర్ణయం మూడు ముఖ్యమైన ప్రమాదాలను సూచిస్తున్నది. ప్రజల ఓటు విలువ తగ్గిపోవడం, ప్రజలు ఒక పార్టీకి ఓటు వేసి గెలిపించిన తర్వాత ఆ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే ప్రజల తీర్పు అర్థం లేకుండా పోయి, రాజకీయ నైతికత దెబ్బతిని, పదవిని కాపాడుకుంటూ పార్టీలు మార్చే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో అవిశ్వాసం పెంచుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు కాకపోతే చట్టాలపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. రాజకీయ ఒత్తిళ్లతోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ తీర్పు ద్వారా ఫిరాయింపులపై చెడు సంప్రదాయానికి స్పీకర్ నాంది పలికారు.
స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది. ఈ పోరాటం కేవలం ఎమ్మెల్యేల అనర్హత కోసం మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం. తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామం ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తున్నది.
ప్రజల ఓటు అత్యంత పవిత్రమైనది. ఆ తీర్పును గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. పార్టీ ఫిరాయింపులను అంగీకరించకపోతేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే ప్రజల తీర్పు విలువ తగ్గిపోతుంది. అంతేకాకుండా చట్టసభల్లో చేసిన చట్టాల అమలు సక్రమంగా జరుగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుంది. తెలంగాణలో ప్రారంభమైన ఈ రాజకీయ, న్యాయ పోరాటం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే పోరాటంగా కొనసాగనుంది.
( వ్యాసకర్త: న్యాయవాది)
-తన్నీరు శ్రీరంగారావు