తెలంగాణ ఉద్యమ ద్రోహి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన విశ్వాస ఘాతకుడు, కుటుంబ ప్రయోజనాలే తప్ప మరేదీ పట్టని అహంకారి కడియం శ్రీహరి. బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఆయన నమ్మకద్రోహం చేసిన సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను మళ్లీ నమ్మబలుకుతూ ఈ మోసానికి సాక్షులుగా హైదరాబాద్‌కు రావాలని ప్రాధేయపడుతున్నాడు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లాంటి అనేక పదవులను అనుభవించి, మళ్లీ కుమార్తెకు ఎంపీ సీటును సాధించుకొని, దళిత నాయకులందరిని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసి తల్లి పాలు తాగి, రొమ్ము గుద్దిన చందంగా పార్టీని వీడుతున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని గెలిపించారు. కానీ, తనకు మంత్రి పదవి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కనుమరుగవుతుందని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ మరోసారి నయవంచనకు పాల్పడుతున్నాడు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని అనేక మంది మోసం చేసినా, పార్టీపై కుట్రలు చేసినా చెక్కుచెదరకుండా తెలంగాణను సాధించి, రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీని వీడిన కడియం పన్నాగాన్ని కనిపెట్టి బీఆర్ఎస్ను కాపాడుకుందాం.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బిడ్డగా కార్యకర్తల కష్టాలను, త్యాగాలను ఎరిగిన వ్యక్తిగా, గుండెలోతు బాధతో, ఆవేదనతో మీకు మనవి చేయునది ఏమనగా! త్యాగధనులైన, నాయకులైన, కార్యకర్తలైన మీరు… తెలంగాణ తెచ్చిన పార్టీ, కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. కడియం శ్రీహరి కుట్రలను, మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని గుర్తించి ఎవరూ బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల బాగోగులను చూసుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బిడ్డగా నేను మీకు హామీ ఇస్తున్నాను.
జై తెలంగాణ! జై కేసీఆర్!!
ఇట్లు
డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి,
మీ జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే,
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఇంచార్జీ