దేశ విదేశాల్లో ఏ నిర్మాణం జరిగినా పాలమూరు బిడ్డలు తట్టేడు మట్టి తీయనిదే ఆ నిర్మాణం పూర్తి కాదు. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్లి పొట్టపోసుకునే వారు. ఎండిన భూముల్లో విత్తు నిలవక కూలీలతో పాటు రైతులు కూడా వలస బాట పట్టారు. కండ్లముందు కృష్ణమ్మను పరాయి పాలకులు సంకెళ్లతో తీసుకెళ్తుంటే నాటి పాలకులు హారతులు పట్టిన తీరుచూసి పాలమూరు బీళ్లు ఎక్కెక్కి ఏడ్చాయి.
భవిష్యత్తుపై నీళ్లు చల్లుకొని ఆశలు వదులుకున్న తెలంగాణం నీళ్ల కోసం నిలబడిన కేసీఆర్‌ను చూసి వసంతం ముందే వచ్చిందని పాలమూరు సంబురపడింది. ఉద్యమ కేరటం కేసీఆర్ అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పాలమూరు వలస ప్రజలకు కారణజన్ముడయ్యారు. కేసీఆర్‌తోనే పాలమూరు పచ్చబడటం ప్రారంభమైంది. పాలమూరు వలసలను నివారించడంలో పాలమూరు దశాదిశను మార్చడంలో కేసీఆర్ ముందుచూపు అమోఘమైనది. కేసీఆర్ కార్యసిద్ధితో పాలమూరుకు నేడు ప్రశాంత జీవితాన్ని ప్రసాదించారు. ఏన్నో ఒడిదుడుకులతో కష్టతరంగా ఉన్న బీడు భూములకు లిఫ్ట్‌ల ద్వారా సాగునీరందించి అపర భగీరథుడుగా కేసీఆర్ కీర్తించబడ్డారు.
కేసీఆర్ ముందు చూపుతో చెరువుల పూడికలు తీయించి, కాల్వలకు మర మ్మత్తులు చేయించి, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రైతులకు సాగు నీటి కష్టాలు తప్పించారు. కేసీఆర్ ఆలోచన విధానం కార్యరూపం దాల్చి ప్రపంచం లోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి నిర్మాణాలు పూర్తయ్యాయి. అతి పెద్ద రిజర్వాయర్ల్ల నిర్మాణం చేపట్టి దశాబ్దం కాలంలోనే నీటి కొరత తీర్చారు. సాధ్యం కాదన్న పనిని సుసాధ్యం చేసి బీడు బారిన నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కేలా చేశారు. అపర భగీరథుడి రూపంలో కేసీఆర్ సాగు నీరుతో పాటు ఇంటింటికి తాగునీటితో ప్రజల దాహాం తీర్చుతున్నారు.