ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషించి, ఎగుమతి చేసిన దేశంగా పాకిస్థాన్ అపఖ్యాతి మూటగట్టుకున్నది. ఇప్పుడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకొని పాకిస్థాన్ విలవిలలాడుతున్నది. బలూచ్ వేర్పాటువాదులు ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి పాక్ పాలకులకు భారీ సవాల్ విసిరారు. సాయుధ బలగాల దాడిలో ఉగ్రవాదులు హతులైనప్పటికీ పెద్ద సంఖ్యలో అమాయకులైన బందీలు మరణించడం బాధాకరం. 30 గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరు తర్వాత 300 మందికి పైగా ప్రయాణికులను విడిపించినట్టు పాక్ సైనిక ప్రతినిధి వెల్లడించారు. అనేకమంది ప్రయాణికులు అమరులైనట్టు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ప్రకటించారు. చనిపోయిన ప్రయాణికుల్లో సెలవుపై వెళ్తున్న సైనికులు ఎక్కువమంది ఉండటం గమనార్హం.
పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలో ఉండే బలూచిస్థాన్ పాక్‌లోని అతిపెద్ద రాష్ట్రం. అతి తక్కువ జనాభా ఉండే ఆ రాష్ట్రం కొండలు గుట్టలతో దుర్గమంగా ఉంటుంది. అయితే ఖనిజ వనరులు మాత్రం అక్కడ విస్తారంగా ఉన్నాయి. చాగీ జిల్లాలో రెండుచోట్ల బంగారు, రాగి నిల్వలు దండిగా ఉన్నాయి. సుసంపన్నమైన తమ వనరులపై పాక్ ప్రభుత్వం పెత్తనాన్ని సహించని బలూచీలు మొదటి నుంచీ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు. దేశ విభజన సమయంలో పాక్ నాయకత్వం, ముఖ్యంగా దేశ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా స్వాతంత్య్రాన్ని ఎంచుకున్న బలూచీల మెడలు వంచి మరీ విలీనం చేసుకున్నది. తమ వనరులపై పెత్తనం సాగిస్తున్న పాక్ ప్రభుత్వం తమ అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే భావన బలూచీల్లో బలంగా ఉన్నది. 1970 దశకంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడివడటంతో బలూచీల్లో వేర్పాటువాదం మరింత బలంగా వేళ్లూనుకున్నది. అందులో నుంచే బీఎల్ఏ, బీఎల్ఎఫ్ (బలూచ్ లిబరేషన్ ఫ్రంట్) వంటి సాయుధ సంస్థలు ఆవిర్భవించాయి. రెండు దశాబ్దాలుగా ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్నాయి. పాక్ సైన్యాన్ని, పౌరులను అవి హతమారుస్తున్నాయి. పాక్.. చైనాతో చేతులు కలిపి తమ వనరులను తరలించుకుపోతున్నారని, అం దులో తమకు ఎలాంటి లబ్ధి కలుగడం లేదని బలూచీలు విమర్శిస్తుంటారు.
చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టులో భాగంగా బలూచిస్థాన్‌లో పలు ఓడరేవులు, రోడ్డు మార్గాలు, ఇతర మౌలిక నిర్మాణాలకు భారీగా నిధులు సమకూర్చింది. ఇవి చైనాకు సరుకుల రాకపోకలను సులభతరం చేసేందుకు చేపట్టినవేననేది తెలిసిందే. ఈ కారణంగానే ఖనిజాల అన్వేషణ, సేకరణ వంటి వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం వచ్చే చైనా పౌరుల పైనా బీఎల్ఏ దాడులకు తెగబడుతున్నది. తరచుగా రైళ్లను లక్ష్యం చేసుకోవడం బీఎల్ఏ ప్రత్యేకత. పొరుగున ఉన్న ఇరాన్‌లోనూ కొంత బలూచీ ప్రాంతం ఉన్నది. అక్కడ కూడా అప్పుడప్పుడూ వేర్పాటువాద దాడులు జరుగుతుంటాయి. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇవ్వడమంటే పాకిస్థాన్‌కు ఆత్మహత్యా సదృశ్యమే. ఎందుకంటే విశాలమైన భూభాగంతో పాటుగా వనరులపై ఆధిపత్యం అది కోల్పోవాల్సి ఉంటుంది. కనీసం ప్రజాభీష్టం మేరకు స్వయంప్రతిపత్తి కల్పించి బలూచీలకు తమ వనరులకు తామే యజమానులమన్న భావన ఏర్పడటానికి వీలు కల్పించాలి. అప్పుడే బలూచ్ సమస్యకు తెరపడుతుందని పాక్ నాయకత్వం గుర్తించాలి.