గోడదెబ్బ.. చెంప దెబ్బ అన్నట్టుగా తయారైంది తెలంగాణ రైతు పరిస్థితి. సర్కార్ సాయం పైసా అందకపోగా సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడం రైతుకు అరిగోసగా మారింది. రేవంత్ సర్కార్ సకాలంలో చర్యలు చేపట్టడంలేదు. అసలు కొనుగోళ్ల విషయమై కాంగ్రెస్ పాలకులకు ఓ ప్రణాళిక అంటూ ఉన్నదా అనేది అసలు ప్రశ్న. నలభై రోజులుగా కాళ్లావేళ్లా పడుతున్నా చలనం సున్నా. సమయం మించి పోతుండటంతో రైతులలో ఆందోళన పెరిగిపోయి అవాంఛనీయ ఘటనలకు దారితీస్తున్నా సర్కారు మొద్దు నిద్ర వీడకపోవడంతో అరిష్టాలకు తెరతీసినట్టయింది. బతిమాలినా, బామాలినా కొనకపోవడంతో రైతులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కిన సందర్భాలూ కోకొల్లలుగా ఉన్నాయి. రెండు నెలలైనా ధాన్యం కొంటలేరన్న కోపంతో పాలకపక్షీయుడైన ఓ రైతు సొసైటీకి తాళం వేయడం రాష్ట్ర రైతు పరిస్థితికి అద్దం పట్టింది. తాజాగా ధాన్యం కొనాలని డిమాండ్ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్ను అధికా రులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రై తులు, ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహానికి జడిసి ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకోకతప్పలేదు. ధాన్యం కొనమని నిలదీసిన రైతుల మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే దాడులకు దిగుతున్నారు. కల్లాల నుంచి మార్కెట్ కు తరలించిన ధాన్యం అమ్ముడైతేనే రైతు అప్పులు తీ ర్చుకుని నిమ్మళమైతడు. కానీ సర్కార్ అందుకు ఏమాత్రం వెసులుబాటు కల్పించకుండా కల్లోలానికి గురిచేస్తుండటం భావ్యం కాదు.
సర్కార్ అలవిమాలిన నిర్లక్ష్యానికి అకాల వర్షాలు కూడా తోడయ్యాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో, రోడ్ల మీదా ఇలా ఎక్కడ పడితే అక్కడ ధాన్యం తడిసిపోవడంతో రైతులు హతాశులయ్యారు. కష్టపడి పండించిన ధాన్యం గాలివాన బీభత్సానికి నీటిలో కొట్టుకు పోతూ ఉంటే ఆపలేని నిస్సహాయతతో కుంగిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండల్లో చెడగొట్టు వానల నష్టం అధికంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత జరిగినా సర్కారు పెద్దలు వచ్చి చూసిన పాపాన పోలేదు. మంత్రులు అధికారులు వెళ్లి ఊరడించిన దాఖలాలు లేవు. పైగా సర్కారు నుంచి ధాన్యం కొనుగోలుపై పూటకోమాట వెలువడుతున్నది. పొంతన లేని ప్రకటనలు ఎన్ని వెలువడితేనేం? క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నది వాస్తవం. ఈ వాస్తవం సర్కారు పెద్దలకు మాత్రం కనిపించడం లేదు. ఈ సరికే 80 శాతం కొనుగోళ్లు పూర్తయినట్టు చెప్పుకుంటున్న సర్కార్ గాలివానకు కొట్టుకుపోయిన ధాన్యం ఎక్కడిదో చెప్పగలదా?
ఇప్పుడు ఏ మార్కెట్ యార్డుకు వెళ్లినా కండ్ల నీళ్లు కుక్కుకుంటూ నీళ్లలోంచి ధాన్యాన్ని ఏరుకునేందుకు తంటాలు పడుతున్న రైతులే కనిపిస్తారు. సర్కారు పాపం రైతుల పాలిట శాపమై నరకయాతన పెడుతున్నది. మార్కెట్ యార్డులకు తరలించి రోజులు గడుస్తున్నా కదలని ధాన్యం దైన్యం మిగిల్చింది. సెంటర్లలో కాంటా వేయలేదు. వేసినా మిల్లులకు తరలించేందుకు వాహనాలు సమకూర్చ లేదు. హమాలీలు అందుబాటులో లేరు. వర్షం వస్తే కప్పేందుకు కనీసం టార్పాలిన్లు అయినా సిద్ధంగా ఉంచలేదు. దీంతో రైతు బతుకు గాలివానలో దీపమైపోయింది. పులిమీద పుట్రలా రెండుమూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల కాళ్ల కిందకు నీళ్లు తెచ్చాయి. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేనితనం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని చెప్పక త ప్పదు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై సర్కారు సరైన శ్రద్ధ పెట్టాలి. తగిన వసతులను కల్పించాలి. తడిసిన వరి, మక్క, తదితర పంటలను తరుగు లేకుండా కొనుగోలు చేసి తప్పుదిద్దుకోవాల్సిన అవసరమున్నదని చెప్పక తప్పదు.