Manipur | ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింతగా పెచ్చరిల్లుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా బీరేన్ సింగ్ కుకీలపై దాడులను ప్రోత్సహించినట్టు తెలిపే ఆడియో టేపులు బహిర్గతమైన తర్వాత ఘర్షణలు భగ్గుమన్నాయి. ఈ టేపులను మీడియా సంస్థ ‘ది వైర్’ మణిపూర్ హింసాకాండపై కేంద్రం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు అందజేసిన నేపథ్యంలో మొన్న సెప్టెంబర్ 1న ఓ గ్రామంపై డ్రోన్లతో బాంబుదాడులు జరపడం దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది.
ఈ దాడిలో ఇద్దరు సామాన్య పౌరులు మరణించారు. మిలిటెన్సీలో డ్రోన్ల సాంకేతికత ప్రవేశించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. దీనిపై కుకీ, మెయితీ తెగలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఆడియో టేపుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం బీరేన్ సింగ్ ఈ దాడి జరిపించినట్టు కుకీ సంఘాలు ఆరోపించాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తుండటం వల్లే మణిపూర్ మంటలు ఆరడం లేదనే ఆరోపణలున్నాయి. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీయడం తెలిసిందే. అప్పటినుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి.
అల్లర్ల కారణంగా రెండు తెగలకు చెందిన 60 వేల మందికి పైగా పౌరులు స్వరాష్ట్రంలోనే కాందిశీకులుగా గడుపుతున్న పరిస్థితి నెలకొన్నది. ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికమని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. అసాధారణమైన రీతిలో సంవత్సరకాలం పైగా మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పది మంది దాకా కుకీ సభ్యులు ప్రాణభయం కారణంగా ఈ సమావేశాల్లో పాల్గొనలేక పోవడం గమనార్హం.
మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉండటమే ఇందుకు కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.
అరాచకత్వం ప్రబలిపోయింది. దాడులే కాకుండా వసూళ్లు కూడా జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇది ఏ మాత్రం ఉపేక్షించదగిన విషయం కాదు. కేంద్రం ఇప్పటికైనా స్వపక్ష, విపక్ష తేడాలు పక్కన పెట్టి రాజధర్మాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. ఘర్షణ పడుతున్న ఇరువర్గాల మధ్య సఖ్యతకు చర్చలు జరిపి పరిష్కారం కనుగొనకపోతే డ్రోన్ల స్థానంలో ఇంకేం సాంకేతికత వచ్చిచేరి ఎలాంటి ఉత్పాతం సృష్టిస్తుందో ఊహించడం కష్టమేమీ కాదు.