కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని హామీలను, అసమర్థ పాలనను ఎత్తిచూపుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని పాటలను విడుదల చేసింది. అయితే ఆ పాటలు బతుకమ్మ పండుగనే అవమానపరిచే విధంగా ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.
ప్రజా పోరాటాలకు, పండుగలకు అవినాభావ సంబంధం ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు పండుగలను పోరాట రూపాలుగా మలిచిన చరిత్ర మనకుంది. ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, రాజకీయంగా జనాలను సమీకరించడానికి, తద్వారా ఉద్యమాలను, పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి పండుగలను, వేడుకలను ఉపయోగించిన సందర్భాలు కోకొల్లలు. బాల గంగాధర్ తిలక్ మొదలుపెట్టిన సార్వజనిక్ గణేష్ ఉత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐర్లాండ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ డే వంటివి కొన్ని ఉదాహరణలు. ముఖ్యంగా ప్రజాకంటక పాలన ఉన్నప్పుడు, అణచివేత అధికమైనప్పుడు ప్రజలు తమ నిరసన తెలియజేయడానికి, పరోక్షంగా రాజకీయ భావవ్యక్తీకరణ కోసం పండుగలను, పాటలను వాడటం సర్వసాధారణంగా జరిగేదే.
సాంస్కృతిక పునరుజ్జీవానికి, అసమ్మతిని వ్యక్తపర్చడానికి పండుగలను ఒక ఆయుధంగా మలుచుకోవడం అనాదిగా వస్తున్నది.ఇక బతుకమ్మ పండుగ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమంలో ధిక్కారానికి ప్రతిరూపంగా బతుకమ్మ నిలిచింది. ట్యాంక్‌బండ్ మీద బతుకమ్మ ఆడటాన్ని సమైక్య పాలకులు అడ్డుకుంటే, హైకోర్టు అనుమతితో వేలమంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడిన సన్నివేశం ఇంకా మన కండ్లముందే ఉంది. పాలకపక్షాన్ని ప్రశ్నించడానికి, ప్రజలు తమ నిరసనను తెలియజేయడానికి బతుకమ్మ పాటల బాణీలో పాటలు అల్లి, ఆడి, పాడటం నిజాం కాలం నుంచి జరుగుతున్నదే.
అంతెందుకు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా బీఆర్ఎస్ పాలనపై దుష్ప్రచారం చేయడానికి కాంగ్రెస్, బీజేపీలు బతుకమ్మ పాటలను అల్లాయి. కానీ, ఈసారి కాంగ్రెస్ విఫల పాలన మీద బతుకమ్మ పాటల బాణీలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని పాటలను రూపొందించే సరికి, ముఖ్యంగా బీజేపీ మద్దతుదారులు వితండవాదం చేస్తున్నారు. ఇది కేవలం వారి అవగాహనాలేమికి నిదర్శనం. తమ కష్టనష్టాలను తెలియజెప్పే విధంగా బతుకమ్మ పాటల బాణీలో పాటలు పాడటం తెలంగాణ గ్రామీణ జీవనశైలిలో ఒక భాగం. కేవలం తమ వైఫల్యాల నుంచి జనాల దృష్టిని మరల్చడానికే.. రేవంత్ పాలనలో ప్రజల కష్టాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ తయారుచేసిన బతుకమ్మ పాటలకు కాంగ్రెస్, బీజేపీలు దురుద్దేశాలు ఆపాదిస్తున్నాయి. అయినా తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మనే మాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి గాని, వాళ్లకు వత్తాసు పలుకుతున్న బీజేపీకి గాని బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు.
– మైత్రేయ కొడకండ్ల