ఈ ఆధునిక సమాజం ‘కాదేదీ కల్తీకి అనర్హం’ అనే చందంగా మారిపోయింది. కొంతమంది వ్యాపారులు సొంతలాభం కోసం ప్రాణాలకు హాని కలిగించినా మంచిదే కానీ కల్తీని మాత్రం ఆపేది లేదంటున్నారు. పొద్దున్నే వాడే టూత్ పేస్టు నుంచి రాత్రి పడుకునేదాకా మానవాళి వాడే పప్పు, ఉప్పు, నూనె, పాలు, నెయ్యి, కారం వంటి ప్రతి నిత్యావసర వస్తువు కల్తీమయం చేస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఈ కల్తీ కారణమవుతున్నది. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు వస్తున్నాయి. ఈ రోగాల వల్ల మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండటం బాధాకరం. ప్రజలు నిత్యావసర వస్తువులను కొంటుంటే డబ్బులు పెట్టి మరీ రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. ముఖ్యంగా రైతులకు, వృద్ధులకు, ఇండ్లు లేని నిరాశ్రయులకు, ఆడపిల్ల పెళ్ళిళ్లకు కల్యాణలక్ష్మి లాంటి బృహత్తర పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని వినాశనం చేస్తున్న కల్తీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కల్తీని అడ్డుకుంటున్నా కల్తీ మూలాలు మాత్రం పోవడం లేదు. కాబట్టి వ్యాపారులు కల్తీ చేస్తున్నట్లు ఏ చిన్న ఆధారం దొరికినా ఆ దుకాణాలను శాశ్వతంగా మూసేయాలి. కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మొత్తంగా కల్తీని శాశ్వతంగా నిర్మూలించాలె. అప్పుడే కల్తీరహిత రాష్ట్రంగా మన తెలంగాణ ఆవిష్కారమవుతుంది.
పాములపర్తి లక్ష్మణ్‌రావు
(విశ్రాంత బ్యాంకు అధికారి, మట్టెవాడ, వరంగల్)