మన సీఎం రేవంత్‌రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్‌లో లైన్ లోకి తెచ్చి ’ఆగ్రహం’ కక్కిండట! సర్కారోళ్లే మీడియాలో రాయించుకున్నరు. ఎమ్మెల్యేలు ఇట్లనే ఉంటే వాళ్ల మీద ఇంచార్జీలను పెడతా అని వార్నింగ్ ఇచ్చిండట.
అబ్బో.. పెద్ద వార్నింగే. ఇంకా వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లో పని చేయనోళ్ల పేర్లు అందరి ముందే చెప్తా, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని క్లాస్ లీడర్ లెక్క బెదిరిచ్చిండట. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జూమ్ మీటింగులతో పని నడువది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జనంలోకి పోవాలి, మొఖం చూపించాలి అంటే ఎట్లా.. జనం మంట మీదున్నరు అని దగ్గరోళ్లతో అంటున్నరట. ఇక్కడ తిరకాసు ఏందంటే, ఒక పక్క మంత్రులేమో ’ఆఫీసర్లు మా మాట వింటలేరు’ అని లబోదిబోమంటున్నరు. ఇంకోపక్క సీఎం ఏమో ’మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేస్తలేరు’ అని చిందులేస్తున్నరు. అంటే మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ల ’ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టున్నది యవ్వారం. ఎవరికీ ఎవరితోనూ సమన్వయం లేదనేది మాత్రం తేలిపోయింది. ఎంతయినా మున్సిపల్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లేదని కోప్పడ్డ ముఖ్యమంత్రి మరి. ఆ రెండు శాఖలకు ఆయననే మంత్రి. మరి ఎవరికి ఎవరితో సమన్వయం లేదో!

ఎన్నికల ముందు మన రేవంత్‌రెడ్డి ఏం చెప్పిన్రు? ’ఉద్యోగ సోదరులారా.. మీరు ఏది అడిగితే అది చేస్తా, ఎక్కడికంటే అక్కడికే బదిలీలు చేస్తా, ఆలుమగలకు ఒకే దగ్గర డ్యూటీలు వేయిస్తా, బిల్లులు పెండింగ్‌లో పెట్టను, అదిరిపోయే పీఆర్సీ ఇస్తా’ అని నోటికేదొస్తే అది చెప్పిన్రు. కట్ చేస్తే.. గద్దెమీదికెక్కినంక సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులకు సీఎం సారు ఏం చెప్తుండు..
’మీరు పని సక్కగ చేస్తలేరు, సర్కార్‌కు ఆమ్దానీ వస్తలేదు. ఓ గంటెక్కువ పని చేయున్రి, ప్రభుత్వ సంపాదన పెంచండి, పీఆర్సీ తీసుకోన్రి’ అని ఆఫర్ ఇస్తుండు. గీ ముచ్చట విన్న ఉద్యోగులు.. ’సారూ.. సంపాదన పెంచి ఇన్సెంటివ్‌లు పొందడానికి మేమేమైనా కమీషన్ ఏజెంట్లమా? మా జీతాలకు సాకులు.. మీ సోకులకు కాసులు’ అని నెత్తినోరు కొట్టుకుంటుంటున్రు. ఇంకా నిజానికి ప్రభుత్వ విధానాలు సక్కగ ఉంటే ఆదాయం అదే పెరిగేది. మొఖం సక్కగ లేక అద్దం పగులగొట్టినట్టు.. జీతాలు పెంచలేక, మమ్ముల్ని ఎందుకు బద్నాం చేస్తున్నరని అని గుస్సా అయితున్రు. సరే గానీ సీఎం గారూ.. ఉద్యోగులకు ఇచ్చుటానికి పైసల్లేవు కానీ, మీ విమానం టూర్లు, మినిస్టర్ల హెలికాప్టర్ షికార్లకు, ఫుట్‌బాల్ ఈవెంట్లకు, మిస్ వరల్డ్ పోటీల సోకులకు మాత్రం పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సామీ? అని జనం అడుగుతున్నరు.

తెలంగాణ సర్కార్ పెద్దల తీరు చూస్తుంటే.. ’అయ్యా.. బాంచెన్! మీరు చెప్పినట్లే చేస్తా, బయటకు పోయి మాత్రం నేనే గెలిచినట్టు చెప్పుకుంటా’ అన్నట్టుంది. హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేసుకుంటం, నాలుగు శాతం వడ్డీకే అప్పు తెస్తాం, చర్చలు మస్తు ఫలప్రదం అయినాయని మీడియాలో జీఎం ఊదరగొట్టిన సంగతి మనందరికీ తెలిసిందేనాయె.
తీరా ఇప్పుడు తేలిందేందంటే.. గీ మెట్రో డీల్ కోసం ఐడీబీఐకి బ్రోకరేజ్ ఫీజు కింద రూ.174 కోట్లు, ఐఆర్ఎఫ్సీకి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్ల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో కట్టేసిన్ర. ఆ డీల్ మంచిగ లేదంటూ సెంట్రల్ సర్కార్ రద్దు చేసింది. ’జీ హుజూర్’ అనుకుంటూ సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిండు. అంటే మెట్రో కోసం కట్టిన కోట్ల రూపాయలు గోడకు కొట్టిన సున్నం అన్నట్టేనా?’ డిల్లీకి పోయిన ప్రతిసారీ తెచ్చిందేం లేకపోయినా వాళ్లు చెప్పినదానికి ’ఊ’ కొట్టివస్తుండు సీఎం సార్ అని జనంలో చర్చ నడుస్తాంది. యూరియా యాప్, వడ్ల కొనుగోలు ఇప్పుడు మెట్రో.. మళ్ల పోయినప్పుడు దేనికి ’ఊ’ కొట్టివస్తడో ఏమో అని సొంత పార్టీ కార్యకర్తలు కూడా సురుకులు అంటిస్తున్నరు.

మట్టి పనికైనా మనింటోడే ఉండాలని చెప్పిన్రు పెద్దలు. అది నూటికి నూరుపాళ్లు నిజమేననిపిస్తున్నదిప్పుడు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఏరువడి దగ్గర పన్నెండేండ్లు దాటింది. అరవై ఏండ్ల అవమానాలను భరించలేకనే కదా మనం మన తెలంగాణ మనక్కావాల్నని బరిగీసి కొట్లాడినం. ప్రాణాలను సైతం పణంగాపెట్టి తెలంగాణ సాధించుకున్నం. ఆ కండ్లమంట కొంతమంది ఆంధ్రులకు ఇంకా సల్లవడనట్టున్నది. అందుకేనేమో తాపకోసారి తెలంగాణ అస్తిత్వం మీద దాడులకు తెగబడుతున్రు. తెలంగాణ సోయి ఉన్న ఇడుపుకాయితం అనే సినిమా పోస్టర్ ఇట్లా విడుదలైందో లేదో.. కొందరు ఆంధ్రుల అక్కసు అట్ల బయటవడ్డది. ఇడుపుకాయితం అనే తెలంగాణ పల్లె పదం వాళ్లకు జీర్ణం కానట్టున్నది. అందుకేనేమో ఈ సినిమాను ఏపీలో డబ్ చేస్తారా? సబ్ టైటిల్స్ ఉంటాయా? అని వెటకారం మాట్లాడుతున్నారు.
ఆ కారడ్డాలు తెలంగాణ ప్రజలకు రావనుకొంటే కొందరాంధ్రులు తప్పులో కాలేసినట్టే. ఆరున్నర దశాబ్దాల పాటు ఆంధ్రా మాండలికంలో అచ్చిన సినిమాల పట్ల తెలంగాణ ప్రజలు గిట్లనే కారడ్డమాడితే ఆ సినిమాల గతి ఏమైపోవునో ఒక్కసారి ఆలోశించుకోవాలె. అయినా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పదేండ్ల పాటు ఒక్కసారి కూడా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగలేదు, కనీసం ప్రయత్నం జరగలేదు. కానీ, రెండున్నరేండ్ల నుంచి కొందరు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తనే ఉన్నరు. అంటే వాళ్లకు ఇంకా దింపుడుగల్లం ఆశ పోలేదన్నమాట. తెలంగాణ సోయి ఉన్న నాయకులే తెలంగాణ రాష్ర్టాన్ని పాలిస్తే మనకీ అవమానాలు ఎదురవుతుండేనా?
-దాము నర్మాల