శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన విద్యార్థి ఉద్యమాల ఖిల్లా. చైతన్య దీప్తి.. ఉద్యమాలకు స్ఫూర్తి. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో అగ్రభాగాన నిలిచిన చరిత్ర ఓయూ సొంతం. తెలంగాణ సాధన కోసం క్యాంపస్ సలిపిన అలుపులేని పోరు మరపురానిది, మరువలేనిది. వలస పాలకుల దమనకాండను ఎదురొడ్డి నిలిచిన వీరకిశోరాల పురిటిగడ్డ ఓయూ.
క్యాంపస్ మొత్తం పోలీసు క్యాంపుగా, హాస్టళ్లు యుద్ధభూమిలా మారిన రోజులున్నాయి. అంతటి ఘన వారసత్వం కలిగిన ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన పర్యటన పలు విధాల ఆక్షేపణీయంగా నిలిచింది. అందులో మొట్టమొదటిది పోలీసు బందోబస్తు. ఆంక్షలు, అరెస్టులు, అణచివేతలతో క్యాంపస్ ఓపెన్ జైలుగా మారడం. అడుగడుగునా నిర్బంధంతో, స్వపరిపాలనలోనే ఉన్నామా లేక వలస పాలకుల అణచివేత రోజులు మళ్లీ వచ్చాయా? అనే సందేహం కలిగేలా చేసింది ఖాకీల పహారా.
‘నేను వచ్చినరోజు క్యాంపస్‌లో ఒక్క పోలీసును కూడా పెట్టొద్దు’ అని గత ఆగస్టులో చెప్పిన మాటలను తానే అటక మీద పెట్టారు రేవంత్. అడుగడుగునా ఆంక్షలు, నిర్బంధకాండ మధ్య సీఎం ఓయూ పర్యటన సాగడం ఆయనలోని అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నది. రెండేండ్లు గా ఓయూను పట్టించుకోని సీఎం పోలీసు రక్షణతో దండయాత్ర జరుపడం విద్యార్థులకు ఆగ్రహం తెప్పించడంలో వింతేముంది? నిరసన తెలపాలనుకున్న వాళ్లను అరెస్టు చేసి ధైర్యంగా అభిమానంతో క్యాంపస్‌కు వచ్చానని చెప్పుకోవడం మరో వింత. సీఎం వచ్చారు, వెళ్లారు తప్పితే తక్షణ సమస్యలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా ఓయూలో విద్యాబోధన నానాటికీ అడుగంటింది. నియామకాలు నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ సిబ్బంది అరకొర జీతాలతో ఈడ్చుకువస్తున్నారు. హాస్టళ్లు అధోగతి పాలయ్యాయి. అక్కడ పెట్టే ఆహారం గురించి విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం. సీఎం పర్యటనలో వీటికి ఎలాంటి ప్రాముఖ్యం లేకపోవడం విద్యార్థుల ఆగ్రహావేశాలకు ప్రధాన కారణం. భవన నిర్మాణ డీపీఆర్‌లు, కాంట్రాక్టుల ఆలోచనే తప్ప టీచింగ్, నాన్ – టీచింగ్ సిబ్బంది సమస్యలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అరకొర జీతాల సమస్యల వంటివి ఏవీ ఆయన ఎజెండాలో లేవు. విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపర్చడం గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు.
కేవలం తన ఆధిపత్యం చాటుకోవడానికే సీఎం క్యాంపస్‌కు వచ్చారని తెలుసుకోలేనంత అమాయకులు కారు విద్యార్థులు. పైగా ఉద్యోగాల విషయంలో సర్కారు టోకరా ఇవ్వడం వారు మరచిపోలేదు. అందుకే నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గురించి నిలదీస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. నిర్బంధంపై నిప్పులు చెరిగారు. క్యాంపస్‌ను హోరెత్తించారు. ఇక మరో విషయం. పోలీసు పహారా మధ్య జరిపిన సభలో సీఎం మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది. విశేషించి ఆంగ్లభాష అప్రాధాన్యం గురించి ఆయన వెలిబుచ్చిన అఖండ పాండిత్యం ఆయనలోని ఆత్మన్యూనతకు అద్దం పట్టింది.