బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పోరాట పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. ఆయన సంస్కరణలు భవిష్యత్తు అభివృద్ధికి సూచికలు. ఆయన నిర్ణయాలు సమగ్రతకు చిహ్నాలు. ఆయన చాణ్యకం, పోరాటం రాజకీయ నాయకులకు ఆదర్శం. తెలంగాణను అభివృద్ధి చేసిన ఆయన ప్రణాళికలు నేడు దేశాభివృద్ధికి అవసరం. ఆయనతో కలిసి పిడికిలి బిగించడం మనందరి కర్తవ్యం.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018లో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచింది. ఈ 8 ఏండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు ప్రవేశపెట్టి దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించింది. పరిపాలనలోనూ కొత్త విధానాలు అమలు చేసి దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే భావన ఉండేది. దాన్ని పండగలా మార్చి నెర్రలు బారిన బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయాభివృద్ధి కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించి భూగర్భజలాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. రైతులకు పెట్టుబడి తిప్పలు, అప్పులు ఉండకూడదని పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తున్నారు. అకాల మరణాలతో ఆగమవుతున్న రైతన్నల కుటుంబాలకు భరోసాగా నిలిచేందుకు రైతు బీమా కింద రూ.5 లక్ష పరిహారం అందించి అండగా నిలుస్తున్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే, కేంద్రం మాత్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఇతర రాష్ర్టాల నిరుపేద రైతులను, దేశ భద్రత కోసం అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నది. వరి కొనుగోలులో తెలంగాణను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఒక్కో రాష్ట్రంతో ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్న కేంద్రం, తెలంగాణ రైతన్నల పట్ల వివక్షను కొనసాగిస్తున్నది. కేంద్రం కుట్రను గమనించిన సీఎం కేసీఆర్ కొన్ని నెలల క్రితం స్వయంగా ఇందిరా పార్కు వద్ద రైతులకు మద్దతుగా ధర్నా చేశారు. కేసీఆర్ ధర్నాకు కేంద్రం వెంటనే సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ శక్తి ఏమిటో తెలంగాణ ప్రజలు ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ర్టాన్ని సాధిస్తే… నేడు కేసీఆర్ మహా ధర్నా వల్ల రైతులకు మేలు జరిగింది. దీన్ని బట్టి భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఓ మహా శక్తిగా ఎదిగే సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని భావించవచ్చు. ఆయన దేశానికి ప్రధాని అయితే దేశంలో గుణాత్మక మార్పులు తెచ్చి భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలపగలరు. కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. వాటిని సమగ్రంగా తిప్పి కొట్టడానికి కేసీఆర్ లాంటి ఉద్యమ నేత అవసరమని గుర్తించాయి. జేడీ(ఎస్) నాయకుడు కుమార స్వామి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, జాతీయ రైతు సంఘాల నాయకులు, మేధావులు, పాత్రికేయులు, అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారులు కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన రాణించాలని కోరుకుంటున్నారు.
ఓ వైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంపన్నులకు అండగా నిలబడుతుంటే…. కేసీఆర్ సర్కారు మాత్రం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. బీజేపీది అధికారం కోసం ఆరాటమైతే… కేసీఆర్‌ది సంక్షేమం కోసం పోరాటం. నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో తెలంగాణ మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. టీఆర్ఎస్ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూనే.. ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నాడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం యావత్తు తెలంగాణ సమాజంలోని నాలుగున్నర కోట్ల మందిలో చైతన్యాన్ని రగిల్చింది. ప్రత్యేక రాష్ట్రం సాకారం అయ్యే వరకూ ఉద్యమాన్ని విడవలేదు.
ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో అలుపెరగని పోరుతో, సంకల్ప బలంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆయన అదే స్థాయిలో అభివృద్ధి ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కేసీఆర్ పిడికిలి బిగిస్తే తెలంగాణ ప్రజలంతా ఆయనకు మద్దతు తెలిపారు. నేడు దేశంలో సుపరిపాలన, అభివృద్ధి కోసం కేసీఆర్ పిడికిలి బిగించారు. దేశ ప్రజలందరూ జై భారత్ అంటూ పిడికిలి బిగించి ఆయనకు అండగా నిలవాలి. అప్పుడే దేశం కోరుకుంటున్న మార్పు సంభవిస్తుంది.
ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ర్టాన్ని సాధిస్తే… నేడు కేసీఆర్ మహా ధర్నా వల్ల రైతులకు మేలు జరిగింది. దీన్ని బట్టి భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఓ మహా శక్తిగా ఎదిగే సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని భావించవచ్చు. ఆయన దేశానికి ప్రధాని అయితే దేశంలో గుణాత్మక మార్పులు తెచ్చి భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలపగలరు.
సంపత్ గడ్డం78933 03516