నేను ఏరువాకను
విత్తనాన్ని, మొలకని,
మొక్కని పంటల కంకిని,
గ్రీష్మాన్ని, వసంతాన్ని,
రుతువులను, కాలాన్ని,
నా లక్ష్యంతో కనిపెంచిన స్వప్నాన్ని
జన వచనంతో గానం చేసిన బహు వచనాన్ని
నేను మళ్లీ రావడమేంది?
నేనే నేలైనప్పుడు నేల విడిచి పోవటమేమిటి?
నా చేతులతోనే
మడులకు నీళ్లు పెట్టిన
ఆకుపచ్చ కలను చూసి పరవశించిన
తరచి తరచి తడిమి తడిమి
గూడు అల్లిన నా అస్తిత్వం నా స్వప్నం,
నా ప్రాణం, నా లక్ష్యం
పోతయా వస్తయా
నేను మళ్ళీ రావడమేంది?
కర్తవ్యాన్ని ధరించిన సైనికుడను
కాలం ప్రాణమున్నంత
వరకు కాలంతోటే ఉంటా
కరువులను తరిమేసిన ధాన్యం నా రాజ్యం
తెర్లయిన బతుకుల్ని తేటబర్లడం నా ధ్యేయం
గంగాజమునా తెహజీబ్ కాపలాదారున్ని
నా ఫలించిన స్వప్నాన్ని
జాతి జెండాగా ఎగరేస్తున్నా
నేను మళ్ళీ రావడమేంది?
నీళ్ళలోకి చూడు/ నా నీడే కనిపిస్తది
చీకట్లనడుగు/ వెన్నెల నన్నే చూపిస్తది
బడిపిల్లల నడుగు
గురుకులాల్లో నన్నే చూస్తరు
నేనెక్కడికి పోయానో చెప్పమనండి
అంబేద్కర్ చూపుడువేలు సాక్షిగా
విముక్త ఉద్యమానికి పచ్చబొట్టునని చెప్పండి
ఈ మట్టి విశ్వవిఖ్యాతికి నేను రూపాన్ని
తెలంగాణకు అచ్చమైన ప్రతిరూపాన్ని
నేను మళ్ళీ రావడమేంది/ నేను ఇక్కడే ఉన్నా
నేను ఇక్కడి/ అణువణువులోపలి ఆత్మని
(25 ఏళ్ళ బీఆర్ఎస్ రజతోత్సవ సభల సందర్భంగా రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పద్నాలుగేండ్ల స్వరాష్ట్ర ఉద్యమం గుర్తుకొచ్చి..)
– జూలూరు గౌరీశంకర్