ఒకప్పుడు తెలంగాణ అంటే చీకటి ప్రపంచమే. నాటి ప్రభుత్వాలు రోజూ కొంతసేపు కరెంటు కట్ చేయడం అనివార్యమని చెప్తుండేవి. రైతులంతా వచ్చిన కరెంటునే ఉపయోగించుకుందామని సిద్ధమైపోయేవారు. అయితే దానికి కూడా ఒక నిర్దేశిత సమయం లేదు. క్రమంగా ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత స్థితి ఉండేది. రైతుల దాకా ఎందుకు? సామాన్య జనాలు సైతం ఏం చేయాలో తెలియని స్థితి. నిట్టూర్పులు తప్ప వేరే మార్గం లేని దయనీయమైన పరిస్థితి అది.
ఉద్యమం కొత్తబాటలు వేసింది. రాష్ట్రం సాకారమైంది. కరెంటు కష్టాలకు మనం క్రమంగా తిలోదకాలిచ్చేశాం. ప్రత్యేక రాష్ర్టోద్యమం జరిగే నాటికి విద్యుత్తు వ్యవస్థాపక సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు ఉండేది. ఇప్పుడైతే ఈ సామర్థ్యం 19,464 మెగావాట్లు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మరో 6 నెలల్లో పూర్తికాబోయే యాదాద్రి పవర్ ప్లాంట్లో 4,000 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతుంది. ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ఉత్పత్తి మొదటి ఫేస్ ఒక నెలలో ఆవిష్కరణ కాబోతున్నది. సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం రాష్ట్రంలో మరొక 800 మెగావాట్ల ఉత్పత్తి శక్తి కలిగిన సింగరేణి పవర్ ప్లాంట్ మరో ఆరు నెలల్లో వెలుగు చూడనున్నది. రాబోయే 6 నెలల కాలంలో రాష్ట్రం ఇంకా అదనంగా 6,400 మెగావాట్ల ఉత్పత్తి అంచనా మీద ఉంది. దీనితో రాష్ట్రంలో వ్యవస్థాపక ఉత్పాదక శక్తి 25 వేలకు పెరుగనున్నది. రాష్ట్ర సాధన కాలంలో 74 మెగావాట్లు ఉన్న సోలార్ శక్తి స్థాయి ఇప్పుడు 6,106 పెరిగింది. అధికారిక అంచనా ప్రకారం ఇప్పుడు చెప్పుకొన్న ప్లాంట్స్ అన్నింటి ఆవిష్కరణ జరిగితే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ రూపొందుతుంది. ఇతర రాష్ర్టాలకు పవర్ అమ్మే శక్తి కలిగిన రాష్ట్రంగా అవతరించే అవకాశాలూ కనబడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జెన్కో ఏర్పాటు చేసిన 240 మెగావాట్ల జూరాల జల విద్యుత్తు ప్లాంటు, 120 మెగావాట్ల పులిచింతల జలవిద్యుత్తు ప్లాంట్, అదేవిధంగా 600 మెగావాట్ల కేటీపీపీ-II , 800 మెగావాట్ల కేటీపీఎస్-VII, 1,080 మెగావాట్ల బీటీపీఎస్ మన విద్యుత్తు ఇనుమడింపులకు గొప్ప సంకేతాలు.
2014లో తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 2,700 మెగావాట్ల కరెంటు లోటు ఉండేది. 60 ఏండ్లు సంయుక్త రాష్ట్రంలో తెలంగాణ బొగ్గు, నీరు అక్రమంగా తరలించబడ్డాయి. పవర్ ప్లాంట్ల నిర్మాణం వేరే ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. తెలంగాణ ఏర్పడేనాటికి 7,778 మెగావాట్ల స్థాయి మాత్రమే తెలంగాణకు ఉండేది. 1,196 కిలోవాట్స్ మాత్రమే తలసరి విద్యుత్తు వినియోగం జరిగేది. విద్యుత్తు సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ లైన్ల ఏర్పాటు అవసరానికి సరిపోని దుస్థితి ఉండేది. ఫలితంగా విపరీతమైన పవర్ కటింగ్స్ ఉండేవి. వ్యవసాయానికి ఏర్పాటుచేసుకున్న మోటర్స్, ట్రాన్స్ఫార్మర్లు తరచుగా కాలిపోయేవి. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు మూలంగా నిలిచిన వ్యవసాయం కుదేలైపోతుండేది. విద్యుత్తు మీద ఆధారపడే అనేక పరిశ్రమలు మూతపడేవి. రైతులు ఇతర శ్రామికుల వలసలు నిత్యకృత్యంగా ఉండేవి. ఒక అనిర్వచనీయమైన నిర్వేదం తెలంగాణ రైతును వెంటాడేది. ఎవరో ఆంధ్రకవి అభివర్ణించినట్టు తెలంగాణ ‘చీకటి ఖండం’ అనే మాటలకు నిజంగానే ప్రతిరూపంగా ఉండేది.
గత తొమ్మిదేండ్ల నుంచి ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తున్నది. రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడానికి 97,321 కోట్లు పెట్టుబడి పెట్టింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యుచ్ఛక్తి ఉత్పాదకత, సరఫరా, పంపకం అనే అంశాలపైన ప్రభుత్వం దృష్టి నిలిపింది. ఈ ప్రయత్నాల వల్ల 7,778 మెగావాట్ల స్థాయిలో ఉన్న స్థితి 19,464 మెగావాట్ల స్థాయికి చేరింది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, జూరాల జల విద్యుత్తు కేంద్రం, పులిచింతల జల విద్యుత్తు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. అంతేకాకుండా 48 నెలల్లోనే 800 మెగావాట్ల క్లిష్టసాధ్యమైన కేటీపీఎస్ జల విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తయింది. ప్రతి యూనిట్లో 500 మెగావాట్ల ఉత్పాదకత కలిగిన యాదాద్రి పవర్ స్టేషన్ మీద ప్రభుత్వం రూ. 34,400 పెట్టుబడి పెట్టింది. 2023 ముగిసేసరికి ఇది వినియోగంలోకి వస్తుందని నిపుణుల అంచనా.
ఇంకా ప్రభుత్వం విద్యుత్తురంగం బలోపేతానికి అనివార్యమైన అనేక చర్యలు తీసుకుంటుంది. ఉత్పాదక శక్తి మరింత పరిఢవిల్లేలా జాగ్రతలు తీసుకుంటుంది. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పెంచి చూపించింది. హై టెన్షన్ వైర్స్ దీర్ఘంగా విస్తరింపజేసింది. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా శక్తి 39,345 మెగావాట్ల వరకు చేరుకుంది. పవర్ సరఫరా విషయంగా ఆధునిక విధానాలని అనుసరిస్తున్న తెలంగాణ దేశంలోనే విద్యుచ్ఛక్తికి ప్రత్యేక రాష్ట్రంగా మారింది. మార్చి 2023 వరకల్లా విద్యుత్తు సరఫరాలో తెలంగాణ 15,497 మెగావాట్ల ఉత్పత్తితో ఒక తిరుగులేని రాష్ట్రంగా నిలిచింది. రాబోయే కాలంలో పెరుగనున్న ఉత్పాదకతకు భూమికగా ఇక్కడ ఐల్యాండ్ సిస్టం కూడా వచ్చింది. విద్యుత్ అంతరాయాలను నిరోధించడానికి Ring Main System కూడా 400 కేవీ, 220 కేవీ 132 కేవీల స్థాయిలో హైదరాబాద్లో అమలుకు వచ్చింది.
తెలంగాణలో నిరంతరం జరిగే నాణ్యమైన పవర్ సరఫరాతో వ్యవసాయ క్షేత్రం స్వర్ణమంజరిగా రూపాంతరం చెందుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో వ్యవసాయ ఉపయోగమైన పవర్ సెంటర్ల నిర్మాణం జరిగింది. 2014లో 19.03 లక్షలు మాత్రమే ఉన్న వ్యవసాయ పవర్ కనెక్షన్లు 27.49 పెరిగాయి. ఇంకా అదనపు సెక్టార్లు కలిపి 67 లక్షల విద్యుత్తు సరఫరా కనెక్షన్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు అన్నీ కనెక్షన్లు కలిపి ఒక కోటి డబ్బు ఎనిమిది వరకు చేరుకున్నాయి.
ఇంకా అనేక ప్రణాళికలతో ముందుకువెళ్తున్న విద్యుత్తు రంగం స్థిరత్వం సాధించాలంటే రాష్ర్టానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనివార్యం. విద్యుత్తు వల్ల నీరు, నీటి వల్ల వ్యవసాయం, వ్యవసాయం వల్ల రైతు, రైతు వల్ల దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఒక్క విద్యుత్తు రంగమే కాకుండా అన్ని రంగాల్లోనూ సాధిస్తున్న అభివృద్ధి మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రజల్లో తాత్కాలిక అసంతృప్తి ఏదైనా కలిగి తమ మనసు మార్చుకుంటే అనేక అవాంఛనీయ పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మన లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరాలంటే మరొక దఫా బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి రావాలె. ప్రజల వివేచన ఏ స్థాయిలో పనిచేస్తుందో రేపటి ఎన్నికలే చెప్తాయి.
-డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు
9676096614
పి.విజయేందర్రావు
98660 43441