బడికెళ్లడానికి ఇష్టపడని పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొస్తుందంటూ మారాం చేస్తుంటారు. నిజమే కావచ్చని తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పదే పదే అదే కారణం చెప్తూ డ్రామాలు చేస్తే మాత్రం బెత్తం పట్టుకొని మరీ స్కూల్‌కు పంపిస్తారు. ఇక్కడ కడుపు నొప్పి అని చెప్పడాన్ని మనం డైవర్షన్‌గా భావించాలి. అచ్చం అలాగే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వమూ రాష్ట్రంలో డైవర్షన్ డ్రామాలు చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం పక్కనపెట్టి డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుకొంటున్నది.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ విషయానికి వస్తే డైవర్షన్ రాజకీయాలు ఆయనకు కొత్త కాదు. విత్తు ఒకటైతే చెట్టు మరొక్కటవుతుందా? రేవంత్ కాదు, తన మంత్రివర్గమూ మళ్లింపు రాజకీయాలు చేస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. రిజర్వేషన్ల విషయం కోర్టులో ఉన్నప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణలో ఎన్నికల వేడి ఒక్కసారిగా చల్లబడిపోయింది. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు సూచించినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. దీనివెనుక ఉన్న అసలు మర్మమేమంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల పలితాలు వస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపడంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందనేది మెల్లిగా ప్రజలకు తెలిసింది.
అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనుముల రేవంత్ వాటిని అమలుచేయడంలో బొక్కబోర్లా పడ్డారు. హామీలు అమలుచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుండటంతో ఆయన డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో రేవంత్ రెడ్డి అప్రతిష్ట పాలయ్యారు. దీంతో ప్రజల దృష్టిని మరల్చడానికి మూసీ ప్రక్షాళన, హైడ్రా అంటూ కొత్త నాటకాలు ఆడారు. ఈ చెత్త నిర్ణయాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌రంగం కుప్పకూలిపోయింది. కొనుగోలు దారులు ముందుకురాకపోవడంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి.
గత పాలకులు మంచి చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత పాలకులు ముందుకు సాగాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు లాంటి సంక్షేమ పథకాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. ఆ సమయంలో విమర్శకులు సైతం కేసీఆర్‌ను అభినందించారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఒక ప్లాట్‌ఫామ్ మీద నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, చెరువు, కుంటల ప్రక్షాళన, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణను పొందాయి. కానీ, వాటిని రేవంత్ రెడ్డి ఏనాడూ ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ పథకాలను సీఎం రేవంత్ కొనసాగించాల్సింది పోయి, వాటికే పేర్లు మారుస్తూ తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరం.
గోదావరి, కృష్ణా మిగులు జలాలను తెలంగాణవ్యాప్తంగా పారించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ అవిరళ కృషిచేశారు. కానీ, రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా రైతుల కోసం చేసిందేమీ లేదు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో కొనసాగిస్తే తెలంగాణ మరింత వృద్ధి సాధించేది. కానీ, రేవంత్‌కు ఈగో అడ్డం వచ్చింది.
ఆయన కొత్త నిర్ణయాలు తీసుకోరు, కేసీఆర్ తీసుకున్నవాటిని కొనసాగించరు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైతే తన సీఎం పదవికి ఎసరు రావచ్చుననే భయంతోనే రేవంత్ వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు.
– జీడిపల్లి రాంరెడ్డి
96666 80051