దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత సైతం డాక్టర్లవుతున్నారు. కూలికి వెళ్లే కుటుంబాలకు చెందినవారు, ప్రభు త్వ స్కూళ్లలో చదివిన పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. దీంతో వేల మందికి డాక్టర్ చదువు ‘అందిన ద్రాక్ష’ పండైంది. దీంతో సగటున గ్రామానికో డాక్టర్ అందుబాటులోకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏటా 8,515 మంది వైద్య విద్య పూర్తి చేసుకొని బయటకు వస్తే నాలుగేండ్లలో 34 వేల మంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. అంటే సగటున ఒక ఊరికి ముగ్గురు డాక్టర్లు అందుబాటులోకి వస్తారన్న మాట! అంటే తెలంగాణ డాక్టర్ల కార్ఖానాగా మారుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక డాక్టర్లున్న దేశం క్యూబా. ఆ దేశం మాదిరిగా తెలంగాణ రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. నాడు రాష్ట్రంలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, నేడు ఆ సంఖ్య 8,515కు పెరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో మెడిసిన్ పీజీలో 2,890 సీట్లు, సూపర్ స్పెషాలిటీలో సీట్లు 206 ఉన్నాయి. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. పీజీలో 7.5 సీట్లతో రెండోస్థానంలో ఉన్నది. 2023-24లో దేశంలో కొత్తగా 2,118 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే, అందులో 900 సీట్లు (43 శాతం) తెలంగాణవే. రాష్ట్రంలో సుమారు 3.51 కోట్ల జనాభాకు మొత్తం 6,690 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అంటే లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు. లక్ష జనాభాకు గల వైద్య సీట్ల నిష్పత్తిని పరిశీలిస్తే దేశంలోనే ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (17.91 సీట్లు), తమిళనాడు (15.35 సీట్లు), గుజరాత్ (10.67 సీట్లు) ఉన్నాయి. ఇలా తెలంగాణ దేశంలోనే మొదటిసారిగా వైట్ కోట్ రెవల్యూషన్ సాధించిన రాష్ట్రంగా నిలిచింది.
ప్రపంచంలోనే అత్యున్నత విద్య అయిన వైద్య విద్య గతంలో సంపన్న విద్యార్థులకు మాత్రమే అందిన ద్రాక్ష. ప్రస్తుతం యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజు, సీడీఎస్, ఈ-లైబ్రరీ, లైబ్రరీ, సెంట్రల్ స్టోర్, హాస్పిటల్ ఫీజు లాంటివన్నీ కలిపి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు చదవడానికి ఒక ఏడాదికి ఒక లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అదే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అయితే రూ.5-6 లక్షలు, మేనేజ్మెంట్ కోటా అయితే రూ.50 లక్షలకు పైగా ఖర్చవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల రూపంలో ఆ చదువును పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నది! తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం, ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ అందుబాటులోకి రావడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు సైతం వైద్య విద్య అభ్యసిస్తున్నారు. పేద పిల్లలు వైద్య విద్యలో ప్రవేశాలు పొందడానికి ప్రభుత్వ గురుకులాలు దోహదం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టులో ఎంసెట్, నీట్ రాసే విద్యార్థులకు లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ శిక్షణ ఇస్తున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన నీట్ తొలివిడత కౌన్సెలింగ్‌లోనే సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు సుమారు 195 ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. గడిచిన ఆరేండ్లలో 512 మంది గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కైవసం చేసుకున్నారు. మా ఊరికి (అయిటిపాముల) చెందిన నిరుపేద కూలీ మేడి రామలింగయ్య కుమారుడు విక్రమ్‌కుమార్ ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించాడు. విక్రమ్ భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి గురుకులంలో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకుని 408 మార్కులతో 2 లక్షల ర్యాంక్ సాధించి మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే ఎంబీబీఎస్ సీటు పొందాడు. విక్రమ్ లాగా చాలా మంది పేద విద్యార్థులు ఇప్పటికే ఎంబీబీఎస్ చదివి డాక్డర్లయ్యారు. మరికొందరు ఎంబీబీఎస్ చదువుతున్నారు.
పాలకులు తీసుకొనే ఒక మంచి నిర్ణయం భావితరాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అలాంటి నిర్ణయమే వైద్య విద్య సీట్ల పెంపు. కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ముందస్తు వ్యూహం ఇది. తెలంగాణ వైద్యరంగానికి ఆయన డాక్టర్‌గా మారి తగిన చికిత్స చేస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం చక్కని వైద్య సేవలు అందుబాటులోకి రావాలని.. మన పిల్లలు ఎంబీబీఎస్ చదివి డాక్టైర్లె అందుకు సాయపడాలన్నది కేసీఆర్ లక్ష్యం. అందుకే జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన ఉండేలా చేశారు. ఇది కదా తెలంగాణ సాధించిన విజయం! ఇది కదా కేసీఆర్ విజన్‌కు మచ్చుతునక. ఇది కదా ఆరోగ్య తెలంగాణకు పునాది!
-లట్టుపల్లి విక్రమ్
97015 87979