మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇలా జాతీయనేతలు ఎవరైతేనేమి..వారంతా నేడు ఓట్లకు, ప్రభుత్వాలు కోరుకున్న ప్రాజెక్టులకు రక్షణకవచంలా పనికొస్తున్నారు. కోట్లను కొల్లగొట్టే అవకాశం ఉన్న నిర్మాణాలకు ప్రజావ్యతిరేకతను తగ్గించాలనుకుంటే దానికి ఓ సెంటిమెంట్‌ను జతచేయడానికి వాడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో అదే ఉపాయంతో బాపూఘాట్ విస్తరణను జతచేసింది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అసలు హామీలను పక్కనబెట్టి హైదరాబాద్‌లో ఉన్న మూసీ మీదకు సర్కార్ మనసు మళ్లింది. అదేమీ తక్కువ నిధులతో పూర్తయ్యే పని కాదు. రూ.లక్షా యాభై వేల కోట్ల ఖర్చుకైనా వెనక్కి తగ్గేది లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే దినదిన గండంగా ఉన్నదని రోజూ పలవరించే ప్రభుత్వం మూసీ పరిసరాల అభివృద్ధి కోసం కొత్తగా అప్పులు తెచ్చి అర్జెంటుగా తలపైకి ఎత్తుకోవలసినదేమీ కాదు. మూసీ ప్రక్షాళన ఆవశ్యకమే కానీ అది దీర్ఘకాల ప్రణాళికతో కూడుకున్నది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధితో సమాంతరంగా బడ్జెట్ పరిమితులకు అనుగుణంగా చేపట్టవలసిన ప్రాజెక్టు ఇది.
మూసీ పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇండ్లకు మార్కింగ్ మొదలెట్టగానే జనం ఆ నిర్ణయంపై విరుచుకపడ్డారు. ఆ వ్యతిరేకతను గాంధీ విగ్రహంతో చల్లబరచాలనుకోవడం ప్రభుత్వ పెద్దల రాజకీయ పన్నాగం. రియల్ ఎస్టేట్‌లో భూమి విలువ పెరుగాలంటే.. ప్రజల దృష్టి అటువైపు పడడానికి కొందరు తమ వెంచర్లలో పార్కునో లేదా గుడినో నిర్మిసుంటారు. ఇదొక వ్యాపార లక్షణం. జాతీయ పార్టీకి నిధులు కావాలన్నా, తమ సభ్యుల ఎన్నికల ఖర్చు సర్దుబాటు కోసమైనా పాలకులకు టోకుగా ఓ ప్రాజెక్టు కావాలి. సుమారు రూ.లక్ష కోట్ల ప్రణాళిక సిద్ధం చేస్తే, అది పూర్తయ్యే నాటికి మరో రూ.యాభై వేల కోట్ల వ్యయం పెంచవచ్చు. ఆయా రాజకీయ పార్టీల నాయకులకు కూడా కాంట్రాక్టులే ఏటీఎంలు.
అదేవిధంగా జాతీయ పార్టీల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వారి పాలనలో ఉన్న రాష్ర్టాలే పాడియావులు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టును చేపడితే తప్ప ఆ జాతీయ పార్టీకి కుప్పతెప్పలుగా నిధులు సమకూరవు. అందుకే పట్టిన పట్టు వదలనట్టు మూసీ ఉద్ధరణకు పంతం మీద సీఎం ఉన్నారు. పదవి కాపాడుకోవాలంటే ఇంత మొత్తం చెల్లించక తప్పదనే అధిష్ఠానం కత్తి మెడపై ఉందేమో అనిపించేలా ఆయన మాటలు ఉంటున్నాయి.
రేవంత్ ప్రభుత్వం చెప్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కావాలంటూ ప్రజల వైపు నుంచి ఎలాంటి డిమాండ్ లేదు.
పైగా తాము రోడ్డున పడుతామని వందల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఆదాయమంతా ఆవిరైతున్నదని అబద్ధాలు వల్లె వేస్తున్న రేవంత్ మంత్రివర్గం ఆగమేఘాల మీద మూసీ పునరుజ్జీవం ఎత్తుకోవడం సామాన్యులకు అర్థం కాని ప్రశ్నే.
మూసీ నీటి ప్రక్షాళనకు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధమే లేదు. కేవలం నీటిని శుభ్రపరచేందుకు కావలసిన చర్యలు తీసుకుంటే చాలు. మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు మూసీలో కలువకుండా చేస్తే ఖర్చు తక్కువ, ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలంకరణలతో ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించాలని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకొస్తున్న ప్రాజెక్టు నమూనా తప్పులతడక అని తేల్చిచెప్తున్నారు. చిన్న వాగులను పునరుద్ధ్ధరిస్తే మూసీ నదిలోకి ఎక్కడినుంచో నీళ్లు తెచ్చి పోసే అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో దీర్ఘకాలం నీటి సౌలభ్యం ఉంటుంది. ఇదే విషయాన్ని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆలోచన వేరే కాబట్టి, అసలైన సూచనలను వినిపించుకోవడంలేదు.
గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ప్రజల ఇండ్లు ఖాళీ చేయించడం మహాత్ముడి సూత్రాలకు వ్యతిరేకమని బాపూజీ మునిమనుమడు తుషార్ గాంధీ చెపారు. ‘గాంధీ పేరుతో ఇలాంటి పనులు చేయకండి.. ఇండ్ల తొలగింపును తక్షణం ఆపండి’ అని రేవంత్ రెడ్డిని కోరారు. ‘బాపు విగ్రహానికి పెట్టే ఖర్చును ప్రజల విద్య, వైద్య సదుపాయాల కోసం వినియోగించండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు. గాంధీ వారసుడైన వ్యక్తి మాటలకు ఎంతో గౌరవపూర్వకంగా స్పందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
అయితే అందరి మాటలను బేఖాతర్ చేసినట్టే తుషార్ గాంధీ మాటలకు కూడా రేవంత్‌రెడ్డి రాజకీయ కోణాన్ని అంటగట్టారు. ఆయన సూచనలను సీఎం తేలిగ్గా కొట్టిపారేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం తమ నివాస స్థలాలను ఎవరు ఇవ్వకున్నా అందుబాటులో ఉన్న భూమిలోనే నిర్మాణం పూర్తిచేయవచ్చునని ఒకవైపు అంటూనే, ‘నన్ను నమ్మండి.. ఎవరినీ నిర్వాసితులుగా వదిలేయను. పునరావాసం కల్పిస్తాను’ అని అసెంబ్లీ వేదికగా సీఎం నమ్మబలుకుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రజలు రేవంత్‌ను నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని, పార్టీని, వ్యక్తులను ప్రజలు ఎలా నమ్ముతారు? పనుల్లో ప్రాథమ్యాలు లేని ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయవు.
-బద్రి నర్సన్