దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సామాన్య జనాల జీవనస్థాయి రోజురోజుకు తగ్గిపోతూ, కేంద్ర పాలకుల ఆత్మీయులు నిమిష నిమిషానికి ఆర్థికంగా ఎదుగుతూ ఉండటం ఏమి సూచిస్తుంది? మెక్సికో లాంటి దేశాలలో జరుగుతున్నట్టు చివరికి సామాన్య ప్రజలు షాపుల మీద పడి దోచుకునే రోజు రాదా? ప్రజలంతా రెండు విషయాలు ఆలోచించాలి. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య సోయి లేని ఈ పరిపాలన గురించి ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకునే సమయం వచ్చింది.
Telangana | ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీలు ఏం చేస్తున్నాయో, ఇదివరకు ఏం చేశాయో అర్థం చేసుకోవాలి. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. ఏ రాష్ట్ర చరిత్ర చూసినా, స్వాతంత్య్రానంతరం ఈ 77 ఏండ్లలో తమ రాష్ర్టాన్ని పాలించిన పార్టీల్లో ఏది బాగుందో విశ్లేషించుకోవాలి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి జరిగిందా, ప్రాంతీయ పార్టీల పాలన బాగుందా పోల్చి లెక్కచూడాలి. ప్రతి రాష్ట్రంలోనూ అతికొద్ది కాలం పాలించినా, ప్రాంతీయ పార్టీల పాలనలోనే రాష్ర్టాల అభివృద్ధి జరిగిందని గ్రహించాలి. అవినీతి కాంగ్రెస్ పార్టీ, సంపన్నుల పక్షపాతి బీజేపీ పార్టీ కంటే కేసీఆర్, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ వంటి వారి పాలన బాగుందనే మాట నిర్వివాదాంశం.
ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ మారణహోమం లాంటివి జరిగేవా? అంతేకాకుండా కేవలం ప్రాంతీయ పార్టీయే అని కాదు, వారికి ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది. మన రాష్ట్ర ఉదాహరణే తీసుకుందాం. 1948 నుండీ పోలీసు యాక్షన్‌తో జరిగిన అన్యాయాలు, అత్యాచారాలలోంచి తేరుకొని 1952లో తెలంగాణ ప్రాంతీయుని ఆధ్వర్యంలో ఊపిరిపీల్చుకుంటుంటే, 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ముసుగులో ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపారు జవహర్లా నెహ్రూ. అటువంటి పరిస్థితిలో ఏం జరుగుతుందో అదే జరిగింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పాలనతో ప్రాంతీయ రాజకీయ నాయకులు మరుగుజ్జులైపోయారు. వలస రాజకీయ నాయకులు యథేచ్ఛగా తెలంగాణ సంపద దోచుకున్నారు.
కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం హయాంలో దోపిడీ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ అయినా పరాయి ప్రాంత రాజకీయ నాయకులు పెత్తనం చేశారు. ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్ అబద్ధాలకు, మాట ఇచ్చి తప్పటానికి తెలంగాణ ప్రాంతం ఎన్నిసార్లు మోసపోయిందో లెక్కేలేదు.
తెలంగాణ నిజమైన ప్రగతి 2014లో ప్రాంతాన్ని ప్రేమించే నాయకుడి పార్టీ అయిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మొదలైంది. దేశంలో 7 దశాబ్దాలలో జరగనంత అభివృద్ధి పదేండ్లలో చూశారు రాష్ట్ర ప్రజలు. వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, విద్యారంగం, సాంఘిక సంక్షేమం, సాంస్కృతిక రంగం- అన్నింటిలోనూ దూసుకుపోయి, అత్యధిక తలసరి ఆదాయం సాధించి దేశానికే ఒక ప్రాంతీయ పార్టీ పాలనలో రాష్ర్టాభివృద్ధి ఎంత పెరిగే అవకాశం ఉందో నిరూపించింది తెలంగాణ రాష్ట్రం తన సొంత పార్టీ ఆధ్వర్యంలో.
కాలమహిమో, ఈవీఎం మహిమో తెలియదు కానీ, తెలంగాణకు మళ్లీ గ్రహణం పట్టింది. ఓటుకు నోటు కేసు నిందితుడు, పొరుగు రాష్ట్ర రాజకీయ నాయకుల అభిమానులు రాష్ర్టానికి పాలకులయ్యారు. నిజానికి కేంద్రీయ పార్టీ అయిన బీజేపీకి అధికార దాహం, కాంగ్రెస్‌కు ధన దాహం తప్ప, తెలంగాణ మీద ఆ పార్టీలలో ఉన్న ప్రాంతీయ నాయకులకు ఇసుమంత ప్రేమ కూడా లేదని మళ్లీ రుజువైంది. రాష్ట్రం మళ్లీ దోపిడీకి గురవుతున్నది. కాంగ్రెస్ హై కమాండ్‌కు నిధులు, పక్క రాష్ర్టానికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక నియామకాల సంగతి సరేసరి. రాష్ట్రం అధోగతి పాలవుతుంటే కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు, ఉన్న రియల్ ఎస్టేట్ ప్రిస్టేజ్ కూడా కుప్పకూలింది. ఇక ఈ వలసవాద రాజకీయ నాయకుల దర్శకత్వంలో సాగుతున్న రాష్ట్ర పాలన ప్రజలు ఎన్నాళ్లు భరించగలరు?
ఈ మధ్య చంద్రబాబు చేసిన ఒక వ్యాఖ్య వింటే నవ్వే కాదు, జాలి కూడా కలిగింది. 1834లో మొట్టమొదటి ఇంగ్లీషు మీడియం స్కూల్ మొదలైన తెలంగాణలో, విద్య అసలు లేదనీ, తానే పాఠశాలలు స్థాపించాననీ చంద్రబాబు చెప్పిన అబద్ధాలు ఎన్నో విన్నాం. ఇక 2014 నుంచీ 2023 దాకా జరిగిన ఆర్థికాభివృద్ధి తన 2020 విజన్ వల్ల వచ్చిందేనని 2004 నుంచీ అధికారంలో లేని చంద్రబాబు డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదంగా లేదూ? అంతేకాదు, 2014 నుంచీ 2019 దాక ఆయన కలల రాజధాని ఎంత నిర్మించగలిగాడో కండ్లారా చూశాం. తెలంగాణకు ఆంధ్ర రాజకీయ నాయకుల అభిమానుల పాలన అవసరమా?
నిజానికి కేంద్రీయ పార్టీ అయిన బీజేపీకి అధికార దాహం, కాంగ్రెస్‌కు ధన దాహం తప్ప, తెలంగాణ మీద ఆ పార్టీలలో ఉన్న ప్రాంతీయ నాయకులకు ఇసుమంత ప్రేమ కూడా లేదని మళ్లీ రుజువైంది. రాష్ట్రం మళ్లీ దోపిడీకి గురవుతున్నది. కాంగ్రెస్ హై కమాండ్‌కు నిధులు, పక్క రాష్ర్టానికి నీళ్లు ప్రవహిస్తున్నాయి.
-కనకదుర్గ దంటు, 89772 43484