కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌గాంధీ ‘రాజ్యాంగాన్ని సంరక్షిస్తా’, ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా’ అని చెప్తూ రాజ్యాంగ ప్రతిని చేతుల్లో పట్టుకొని దేశమంతా కలియతిరుగుతున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఓటుచోరీకి పాల్పడుతున్నదని, లోక్‌సభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ర్టాల్లో ఆ పార్టీ ఈ విధంగానే గెలుస్తున్నదని ఆయన గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
కేంద్రం చెప్పుచేతల్లో ఎలక్షన్ కమిషన్ పని చేస్తున్నదని, బీజేపీకి అనుబంధంగా మరో మోర్చాగా మారిపోయిందని కూడా రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే, దేశమంతా శోధిస్తూ, అధ్యయనాలు చేస్తూ బీజేపీ చేస్తున్న ఓటుచోరీని బయటపెడుతున్న ఆయనకు తెలంగాణలో అధికారంలో ఉన్న సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీ కానరాకపోవడం ఓ వింత.
సొంత పార్టీ నేతలు చేసే ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు మాత్రం ఆయనకు కనిపించకపోవడం విడ్డూరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటరు గుర్తింపు కార్డులు పంచిపెట్టడంపై రాహుల్‌గాంధీ ఇప్పటివరకు కనీసం స్పందించలేదు. సొంత పార్టీ చేస్తున్న ఉల్లంఘనలపై ఆయన నోరు ఎందుకు మూతబడిందో సమాధానం చెప్పాలి.
ప్రజాపాలనకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న ఇందిరాగాంధీ హయాం నుంచే దేశం లో ఎన్నికల కమిషన్ భ్రష్టుపట్టిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాజీవ్‌గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దుష్ట సంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలన లో ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠ మరింత దిగజారింది. ఎన్నికల కమిషన్‌లో పారదర్శకత లోపించిందని, అదొ క బీజేపీ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతుండటమే అందుకు నిదర్శనం. ఇలాంటి తరుణంలో ఓటు చోరీపై ఉద్య మం చేస్తున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను చూసీచూడన ట్టు వదిలేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నిబంధనల ప్రకారం.. ఓటర్ గుర్తింపు కార్డులను అధికారికంగా ఎన్నికల కమిషన్ జారీచేస్తుంది. ఓటర్లకు గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ తన యంత్రాం గం ద్వారా స్వయంగా పంపిణీ చేస్తుంది. రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్-1950లోని సెక్షన్ 23 ప్రకారం.. ఓటరు గుర్తింపు కార్డులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో), లేదా బీఎల్వోల ద్వారా సంబంధిత ఓటర్లకు నేరుగా అందించాలి. ప్రైవేట్ వ్యక్తులు, పార్టీలు లేదా ఇతర సంస్థలు వీటిని పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. అలా పంపిణీ చేయ డం ఎన్నికల నియమావళి ప్రకారం నేరంగా పరిగణిస్తారు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్-1961, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుంది. అంతేకాదు, అధికార పార్టీ అభ్యర్థి స్వయానా కార్డులు పంపిణీ చేయడమంటే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఒక విధంగా ఇది ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేయడమే.
ఓటరు కార్డులను పంచడం ద్వారా నవీన్ యాదవ్ రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1950లోని సెక్షన్ 23; ఇండియన్ పీనల్ కోడ్- సెక్షన్ 420 (ఓటర్లను మోసం చేసి కార్డులు పంచడం); రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 128 (ఓటర్ గుర్తింపు కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డులను అనధికారికంగా ఉపయోగించడం) తదితర చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారు.
వాస్తవానికి ఓటర్ ఐడీ కార్డులను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంబంధిత ఓటరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే, అలా చేయాలంటే ఓటరు ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద తతంగముండగా, 200-300 మంది ఓటరు గుర్తింపు కార్డులు నవీన్ యాదవ్ చేతికి ఎలా వచ్చాయి? ఓటర్ల ఫోన్ నంబర్, ఓటీపీ లేకుండా ఎలా డౌన్లోడ్ చేశారు? ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారా? ఎన్నికల కమిషన్ అధికారులే సహకరించారా? లేదా జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ పోరాడుతున్న బోగస్ ఓట్లను ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నదా? అన్నది దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చాలి.
నాలుగైదు రోజుల కిందటే నవీన్ యాదవ్ ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఆ విషయాన్ని ఆయన అనుచరగణం సగర్వంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పలు పత్రికల్లోనూ ఈ విషయమై వార్తలు వచ్చాయి. అయినా ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. అయితే, ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. దీంతో చివరికి స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
కాలయాపన చేయకుండా, తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చట్టాలు, నియమాలను ఉల్లంఘించిన నవీన్ యాదవ్‌ను రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్- 1951లోని సెక్షన్ 8 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. బీజేపీ ఓటు చోరీపై పోరాటం చేస్తున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ఈ రకం ఓటుచోరీపై వెంటనే స్పందించాలి. తమ పార్టీ నేత చేసిన తప్పును అంగీకరించి, సదరు నాయకుడిపై చర్యలు తీసుకోవాలి. పోటీ నుంచి తప్పించి తన నిజాయితీని చాటుకోవాలి. అప్పుడే ఆయన పోరాటానికి విలువ ఉంటుంది.
– డాక్టర్ బీఎన్ రావు 98668 34717