ఉభయ తెలుగు రాష్ర్టాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇద్దరు సీఎంల మధ్య భేటీ. అది కూడా ఒకరు ఇండియా కూటమికి చెందినవారైతే, మరొకరు ఎన్డీయే కూటమికి చెందినవారు కావడం గమనార్హం. ఆ సంగతి అలా ఉంచితే ఆ భేటీ అనంతరం జరిగిన ఓ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే.. తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం గురించి చంద్రబాబు మాట్లాడటం.
CM Chandrababu | వాస్తవానికి తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం పొందితే ఎవరికి ప్రయోజనం? తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఏమైనా మేలు జరుగుతుందా? తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు కండ్ల సిద్ధాంతంతో పైకి కనిపిం చిన బాబు.. వాస్తవానికి ఒక కంటితోనే చూశారు. ఉద్యమ సమయంలోనే కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తన చూపు ఒకవైపేనని ఆయన స్పష్టం చేశారు. పదేండ్ల పాటు ఏపీలోనే రాజకీయం చేశారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినా ఆయన పట్టించుకోలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేయదని చెప్పి.. పార్టీని నమ్ముకున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైపోయాక, బీ ఫామ్‌లు ఇవ్వడమే తరువాయి అనే సమయంలో.. పోటీకి ససేమిరా అన్నారు బాబు. ఎవరి ప్రయోజనాల కోసం బరిలో నుంచి టీడీపీని ఎందుకు తప్పించారో తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలడానికి వీల్లేదని భావించి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై టీటీడీపీతో సెల్ఫ్ సూసైడ్ చేయించారు. అలాంటి బాబు నేడు ఆరు నెలలు తిరగకముందే పునరుజ్జీవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది.
ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు రాజకీయంగా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఏపీలో బీజేపీతో అధికారాన్ని పంచుకుంటూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో మైత్రీ నెరుపుతున్నారు. అటు ఏపీలోనూ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉభయ రాష్ర్టాల్లో అక్కడ వైసీపీకి, ఇక్కడ బీఆర్ఎస్కు ఏకకాలంలో చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో కూటమి నేతలు, కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్దగా విమర్శలు, ప్రతి విమర్శలు లేవు. అక్కడ అన్ని పార్టీల టార్గెట్ వైసీపీయే. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతుండగా.. టీడీపీలోకి కూడా వలసలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే పార్టీ పునరుజ్జీవం గురించి వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఉభయ రాష్ర్టాల్లోనూ గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను మార్పుచేర్పులతో కొనసాగిస్తూనే, అదనంగా కొన్ని సంక్షేమ పథకాలు చేరుస్తామని రెండు రాష్ర్టాల్లోని అధికార పార్టీలు చెప్పాయి. కానీ, పరిస్థితులు చూస్తుంటే.. సంక్షేమ పథకాల్లో మార్పు కంటే రాజకీయ మార్పుచేర్పులపైనే ఎక్కువగా చర్చ జరుగుతున్నది.
టీడీపీ పునరుజ్జీవం గురించి మాట్లాడుతూనే బాబు మరో మాట కూడా చెప్పారు. తెలంగాణ గడ్డపైనే టీడీపీ పుట్టిందని, ఇక్కడ పుట్టిన పార్టీని మరోసారి ఇక్కడ బలంగా విస్తరిస్తానని శపథం చేశారు. ఒకరిద్దరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబును కలిశారు. ఈ పరిణామాలను చూస్తుంటే.. ఈసారి బాబు పక్కాప్లాన్‌తో తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తున్నది. ఈ తరుణంలో తెలంగాణలో పుట్టిన టీడీపీ ఇక్కడి రైతుల నడ్డి విరిచే విధానాలను ఎందుకు అమలు చేసింది? బోరు మోటర్లపై ఆధారపడి సాగు చేసే రైతులపై అదనపు కరెంట్ భారం ఎందుకు మోపింది? అనే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పాలి.
అంతేకాదు, 1982 నాటికే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కొన్ని సమూహాలు పనిచేస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణవాదం లేదని నిరూపించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అందుకే 1990 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులకు రూరల్ తెలంగాణలోని నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఒక నియోజకవర్గంలో సీమాంధ్ర నాయకుడిని బరిలో దించారు. తెలంగాణ ప్రజలు అతన్ని ఓడించి, తెలంగాణవాదానికి జై కొట్టారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందినవారితో కోస్తాలో పోటీ చేయించేందుకు సాహసం చేయలేదు నాటి టీడీపీ. తెలంగాణ ప్రాంతాన్ని తమ వలస ప్రాంతంగా చేసుకునేందుకు నాడు టీడీపీ ప్రయత్నించింది. దాన్ని ముందుగానే పసిగట్టిన తెలంగాణవాదులు వారి వ్యూహాలను తిప్పికొట్టారు.
అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఎందుకు. మొన్నటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చంద్రబాబు పోషించిన పాత్ర గురించి తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సీమాంధ్ర నాయకుల రాజీనామా డ్రామాల వెనుక ఉన్నది బాబేనని నాటి ఉద్యమ సమాజానికి తెలుసు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మరో ప్రకటన రావడం.. ఆ తర్వాత తెలంగాణలో వందలాది మంది బలి దానాలు చేసుకున్న వేదనాభరిత ఘటనలకు ఆయనే కారణం. ఎన్నో కష్టనష్టాలకోర్చి, ప్రాణ త్యాగాలు చేసుకుని తెలంగాణ ప్రజలు స్వయం పాలన సాధించుకున్నారు. పదేండ్ల స్వయం పాలనా ఫలితాలను తెలంగాణ సమాజం అనుభవం ద్వారా చూసింది. ఉమ్మడి రాష్ర్టానికి, స్వయం పాలనకు మౌలికమైన తేడా కూడా కనిపించింది. సీమాంధ్ర రాజకీయ కుట్రల ద్వారా ఇవన్నీ తమకు దూరమవుతాయననే ఆందోళన ఇప్పుడు తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్నది.
సంక్షేమ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎటువైపు పయనిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ సందర్భంలోనే తెలంగాణలో టీడీపీని పునరుజ్జీవింపజేస్తామని చంద్రబాబు చెప్పడమంటే ముమ్మాటికీ తెలంగాణ ప్రజాప్రయోజనాలను, భవిష్యత్తును గందరగోళంలో పడేసినట్టే. పదేండ్లుగా ‘జై ఆంధ్ర’ నినాదమే వల్లించిన ఆ నోట కొత్తగా ‘జై తెలంగాణ’ అనే నినాదం రావడం ఆంధ్ర వాళ్లను ఆలోచింపజేయవచ్చేమో కానీ, తెలంగాణవాళ్లను మాత్రం పక్కా ఆందోళనకు గురిచేస్తున్నది.
పదేండ్ల తర్వాత మళ్లీ ఆంధ్రావాళ్ల పెత్తనం ఏమిటనే ప్రశ్న యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నది. కాబట్టి స్వయంపాలన కోసం తండ్లాడి సాధించుకున్న తెలంగాణలో మొదలవుతున్న కుట్రలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలె. ఈ కుయుక్తుల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సమాయత్తం కావాలె.
– అస్కాని మారుతీ సాగర్
90107 56666