మూసీ ప్రక్షాళన లేదా సుందరీకరణ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన మూసీని కాలుష్యం బారి నుంచి ప్రక్షాళన చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఈ నిర్ణయం వెనుక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, తమ పార్టీ నేతలు, వారి అనుయాయులు, బంధుగణం ప్రయోజనాల కోసం సీఎం కంకణం కట్టుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
మూసీ నది కృష్ణానదికి ఉప నది. ఒకప్పుడు భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చిన జీవనది. ఈ నది మీద ఎన్నో వంతెనలు నిర్మించి, జంట నగరాల నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలను కలిపారు. ఈ నది మీద హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులు కట్టారు. ఒకప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు భాగ్యనగర్ ప్రజల తాగునీటి వనరులు. ప్రస్తుతం ఈ రెండూ మురికికూపాలుగా మారిపోయాయి. ఈ మంచినీటి ప్రాజెక్టులను మనం కాపాడుకోలేకపోయాం. ఫలితంగా ఇపుడు గోదావరి, కృష్ణా జలాల మీద హైదరాబాద్ ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
మూసీ ప్రక్షాళన ఇవాళ కొత్తగా తెరమీదికి వచ్చిన విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వాలు మొదలుకొని, తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే వచ్చాయి. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘నందనవనం ప్రాజెక్టు’ పేరు మీద మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముంపు బాధితులకు పునరావాసం కింద కర్మన్‌ఘాట్ సమీపంలో ‘నందనవనం’ అనే కాలనీని నిర్మించారు. 2005లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ‘సేవ్ మూసీ ప్రాజెక్ట్’ పేరు మీద ప్రక్షాళనకు కృషి చేశారు. 2017లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేశారు. మూసీకి రెండువైపుల రోడ్లు వేయాలని నిర్ణయించి, కొంత పనిని ప్రారంభించారు.
2023లో కూడా కేసీఆర్ ‘మూసీ నది పునరుజ్జీవం’ పేరు మీద మళ్లీ ప్రక్షాళనకు పూనుకున్నారు. కానీ ఎక్కడా కూడా పేద, మధ్య తరగతి ఇండ్లు కూల్చివేయలేదు. వారి బతుకులను ఆగం చేయలేదు. వారిని నిర్వాసితులను చేయలేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన లేదా సుందరీకరణ పేరు మీద ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటు చేసి భారీ వ్యయంతో కూడిన ప్రణాళికలు వేసింది. ఎంతోమంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారి ఇండ్లను కూల్చడానికి సర్కార్ సిద్ధమైంది.
మూసీ ప్రక్షాళన లేదా సుందరీకరణలో భాగంగా ప్రధానంగా వినిపిస్తున్న మాటలు రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్. ఈ ప్రాంతాలను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర సర్కార్ చెప్తున్నది. రివర్ బెడ్ అంటే నది లోపలి భాగం. నదిలోని మురికిని ప్రక్షాళన చేస్తే మూసీ పరివాహక ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. కానీ ఎఫ్టీఎల్, బఫర్జోన్లను గుర్తించి, ఆ ప్రాంతంలో ఉన్న ఇండ్లను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి బాహాటంగా చెప్తున్నారు.
మూసీ ప్రక్షాళన లేదా సుందరీకరణ చేయడమంటే అందులో పారిశ్రామిక వ్యర్థ నీరు, గృహ సంబంధ వ్యర్థ నీరు కలువకుండా చేయాలి. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో రైల్వే లైన్లు, ఆకాశ హర్మ్యాలు (స్కైవండర్స్)ను నిర్మించి, ప్రపంచంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని సీఎం చెప్తున్నారు. ఇందుకోసం దాదాపు లక్షా ఇరువై వేల ఇండ్లను కూల్చడానికి కంకణం కట్టుకున్నారు.
కేవలం హైదరాబాద్ నగరంలో 59 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ ప్రక్షాళనకు ఆసక్తిని కనబరుస్తున్న సీఎం ఆ నది పుట్టిన దగ్గర నుంచి ప్రక్షాళన చేయడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే అక్కడి మూసీ ప్రాంతం బడాబాబుల చేతుల్లో బందీ అయింది. ఈ బడాపెట్టుబడిదారుల వలన మూసీ తన సహజ ప్రవాహతత్వాన్ని కోల్పోయింది. ఈ సహజ ప్రవాహాన్ని కాపాడకుండా, మల్లన్నసాగర్ నుంచి నీటిని తెచ్చి మూసీలో పోస్తామని సీఎం చెప్తున్నారు. ఇది చాలా విచిత్రం. ఒక ప్రాజెక్టు నీళ్లను ఒక నదిలో పోయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.
మూసీ నదిలో నీళ్లు పారితే పేదలు, మధ్య తరగతి ప్రజలు బలికావాల్సి వస్తుంది. దీనిని బట్టి సీఎం ఎవరి కోసం ప్రక్షాళన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ తన అనుయాయులు, బంధువులు, కార్పొరేట్ సంస్థలకు మూసీ నది మీద విల్లాలు కట్టడానికి అనుమతులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పేదల ఇండ్ల కంటే కార్పొరేట్ సంస్థలు, బడాబాబుల ప్రయోజనాలే ముఖ్యంగా సీఎం విధానాలని చెప్పకనే చెప్తున్నాయి.ఇకనైనా సీఎం తన ధోరణిని మార్చుకోకుంటే రానున్న రోజుల్లో ప్రజల చేతుల్లో చావుదెబ్బ తిని, పలాయనం చిత్తగించడం ఖాయం.
-జంగిలి యాదగిరి ,94418 01134