‘గొప్ప మార్పు జరగాలంటే ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేయాలి. దశాబ్దాలుగా మూసీ గర్భంలో జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదల బతుకులు మార్చే సంకల్పం నాది. మూసీ సాగునీరుగా పారి, విషమే పంటలుగా మారి నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గరళ కూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల నాది’ మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవం… ఏం చేస్తున్నాడో తెలియని గందరగోళంలో పేదల ఇండ్ల మీద పడ్డారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ లోనివి పై వ్యాఖ్యలు.
Musi River | రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర మొత్తం కాగడా పట్టి వెతికినా విధ్వంసం, వితండం తప్ప ఎక్కడా ప్రజల కోసం పాటుపడిన ఓ గొప్ప సంఘటన లేదు. తెలంగాణ ప్రజల ఏమరుపాటో, ఆగ్రహమో దశాబ్దకాలంగా వివిధ రూపాల్లో కేసీఆర్ మీద, ఆయన పాలన మీద జరిగిన దుష్ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ‘ఏ దిక్కూ లేనోళ్లకు అక్క మొగుడే దిక్కు’ అన్నట్టుగా రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయక తప్పని పరిస్థితి. తంతే గారెల బుట్టలో పడ్డ రేవంత్ ఇక జీవితంలో మళ్లీ అవకాశం రాదనుకున్నాడేమో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాటిని పక్కన పెట్టి హైడ్రాను ముందరేసుకున్నాడు. మూసీ ప్రక్షాళన అంటూ ఉపన్యాసాలు దంచుతున్నాడు. ‘జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదలు, నల్గొండ ప్రజల ఆరోగ్యం కబళిస్తున్న గరళకూపం నుంచి కాపాడాలి’ అంటూ వగరుస్తున్నాడు.
2006లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచాడు. ఆ వెంటనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనమండలి సభ్యుడిగా గెలిచాడు. ఆ తర్వాత టీడీపీలో చేరిన రేవంత్‌రెడ్డి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచాడు. 2018 ఎన్నికల్లో ఓడిపోగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలిచాడు. తాజాగా మళ్లీ కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజా ప్రతినిధిగా 18 ఏండ్ల రేవంత్‌రెడ్డి చరిత్రను పరిశీలిస్తే జడ్పీటీసీగా మిడ్జిల్‌లో గానీ, ఎమ్మెల్సీగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గానీ, ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గంలో గానీ పేదల బతుకుల్లో వెలుగులు నింపే ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. పేదల బాగు కోసం ఆరాటపడిన దాఖలాలు ఎక్కడా లేవు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటే ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన తెలంగాణను నిర్వీర్యం చేయాలనుకున్న వ్యక్తి ఆయన. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకొని ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన నిందితుడు రేవంత్‌రెడ్డి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే కృష్ణా నది మీద ఉన్న బ్యారేజీలపై తెలంగాణ హక్కులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ధారాదత్తం చేసిన ఘనత ఆయనది.
మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను సరిచేసి తెలంగాణ రైతాంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా ఏడాదికాలంగా కాళేశ్వరం మీద కట్టుకథలు ప్రచారం చేస్తున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. సొంత మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తిచేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను 10 నెలలుగా పెండింగ్‌లో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇటీవలి వర్షాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌజ్ నీట మునిగితే అటు వైపు కన్నెత్తి కూడా చూడని, కనీసం సమీక్ష చేయని చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆరు గ్యారెంటీలంటూ అధికారం చేజిక్కించుకొని మహిళలకు ఉచిత బస్సుతో మిగతా గ్యారంటీలకు మంగళం పాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది.
18 ఏండ్ల రేవంత్ రాజకీయ చరిత్రలో ఒక సమస్య మీద చివరికంటా పోరాడిన చరిత్ర గానీ, ఒక ప్రయోజనం కోసం నిలబడిన చరిత్ర గానీ లేదు. సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) వినియోగించుకొని బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించాడన్న ఆరోపణలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ 60 నుంచి 80 కిలోమీటర్ల రేడియస్‌లో ఊరు పేరు, భూమి సర్వే నెంబర్ చెప్తే దాని యజమాని ఎవరు? ఎవరికి అమ్మారు? ఎవరు కొన్నారు? ఆ భూమి విషయంలో ఉన్న లిటిగేషన్స్ ఏమిటి? అన్నది టకటకా చెప్తాడన్న ఘనత, ఖ్యాతి ఆయనకు ఉన్నది.
ఇటు ఏడుతరాలు, అటు ఏడుతరాలు చూసి పిల్లనివ్వాలని అంటుంటారు పెద్దలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ర్టాన్ని రేవంత్ చేతిలో పెట్టింది. కొండకు ఎంటిక వేసిన రేవంత్‌రెడ్డి వస్తే కొండ, పోతే ఎంటిక అనుకున్నాడు. మొత్తానికి కొండ దొరికాక రేవంత్ ఇప్పుడు ఎవరికీ దొరక్కుండా పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లో ఉన్నాడా? బీజేపీ కనుసన్నల్లో ఉన్నాడా? అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్న.
ఓట్లేసిన ప్రజలకూ దొరకడం లేదు. నిండా నమ్మిన నిరుద్యోగులకు దొరక్కపోగా, లాఠీ దెబ్బలను బహుమతిగా పంపుతున్నాడు. రైతుభరోసాకు రాంరాం చెప్పి రుణమాఫీని కొండెక్కించాడు. మార్పులో భాగంగా సంక్షేమ పథకాలను పక్కన పెట్టి మూసీలో ఉన్న పేదల బతుకులు మారుస్తానంటున్నాడు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఓఆర్ఆర్ మాదిరిగానే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం కూడా వంకలు తిరుగుతున్నది. కేంద్రం భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి నిర్మిస్తుందని చెప్పిన రేవంత్ సర్కార్ ప్రజల మీద రూ.10 వేల కోట్ల భారం మోపుతున్నది. రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన అంటున్నాడు. పథకాల అ మలుకు పైసల్లేవంటూ, ఏ పథకం అమలు చేయకుండానే పది నెలల్లో రూ.80 వేల కోట్ల అప్పులు చేశాడు. ఏతా వాతా చెప్పేదేమంటే ‘మూసీ… ఒక కట్టుకథ’.
-శ్రీధర్ ప్రసాద్
(సీనియర్ జర్నలిస్ట్)