26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు అమెరికా జైలును వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరాడు. తనను భారత్‌కు అమెరికా అప్పగించకుండా ఉండేందుకు రాణా చేయని ప్రయత్నమంటూ లేదు. అవకాశమున్న అన్ని ప్రక్రియలను వాడుకొని భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరగా రాణా వేసిన రెండు దరఖాస్తులు అమెరికా ఫెడరల్ కోర్టులో వీగిపోవడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. ముంబై ఉగ్రదాడి సహ కుట్రదారుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి దాడి ప్రదేశాల గురించిన సమాచారం సేకరించి పెట్టేందుకు పాక్ సంతతికి చెందిన రాణా రెక్కీ నిర్వహించాడనేది ప్రధాన ఆరోపణ.
రాణాను భారత్‌కు రప్పించిన ఘనత తమదేనని బీజేపీ అంటుంటే, తాము 2011 నుంచి జరిపిన కృషి ఫలితంగానే అతడిని అమెరికా అప్పగించిందని కాంగ్రెస్ చెప్పుకొంటున్నది. అప్పగింత ప్రక్రియ మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో మొదలైతే, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో కొలిక్కివచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణా అప్పగింతకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆమోదముద్ర వేశారు. ఎవరికి ఎంత పేరు రావాలనేది పక్కనపెడితే రాణా అప్పగింత కేవలం ప్రతీకాత్మక విజయమేనని చెప్పాలి.
వాస్తవికంగా ముంబై దాడుల కేసులో సాధించే ముందంజ అంతంతమాత్రమేనని చెప్పక తప్పదు. ఇదివరకే అమెరికాకు రాసిచ్చిన హామీపత్రంలో రాణా విచారణకు సంబంధించి పలు కఠినమైన షరతులకు భారత్ అంగీకరించింది. జైలులో భద్రత కల్పిస్తామని, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయబోమని, అప్పగింత లేఖలో ప్రస్తావించిన నేరాలపైనే విచారణ పరిమితం చేస్తామని హామీ ఇచ్చింది.
అంటే వేరే కేసులకు సంబంధించిన ఆధారాలు బయటపడినా చేయగలిగేదేమీ ఉండదన్న మాట. సబబైన రీతిలో విచారణ జరపాలనేది మరో షరతు. ఇంకా 1997 భారత్-అమెరికా నేరస్థుల అప్పగింత ఒప్పందం మేరకు భారత్‌లోని చట్టాలు, అంతర్జాతీయ ప్రమాణాలూ కచ్చితంగా పాటించాల్సిందే. ఈ కారణంగా రాణాను కొందరు విపక్ష నేతలు ‘బిర్యానీ ఖైదీ’గా అభివర్ణించడం గమనార్హం.
భారత్ చేతికి రాణా చిక్కడం నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మరో నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ విషయంలో భారత్ ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగలేదనేది కాదనలేని వాస్తవం. నిజానికి ముంబై దాడుల కేసులో రాణాను విచారించడం ఎంత ముఖ్యమో, హెడ్లీని విచారించడం అంతకన్నా ముఖ్యం. కానీ, అమెరికా అతడిని ఇండియాకు అప్పగించడమనేది అసాధ్యమని తెలియవస్తున్నది.
2010లో అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న నేర అంగీకార పత్రమే అందుకు అడ్డుగా నిలుస్తున్నది. ‘చట్టపరమైన, దౌత్యపరమైన, వ్యూహాత్మక కారణాల వల్ల’ అమెరికా హెడ్లీ అప్పగింతకు ఎన్నటికీ అంగీకరించదనేది స్పష్టం. కీలక గూఢచార రహస్యాలు తెలిసిన హెడ్లీ వంటి వారిని అమెరికా ఎన్నటికీ అప్పగించదని తేలిపోయింది. ఈ క్రమంలో ముంబై దాడి కేసులో న్యాయం జరిపేందుకు భారత్ జరిపే ప్రయత్నాలకు గండిపడినా అమెరికా పట్టించుకోదన్న మాట. అందువల్లనే రాణా అప్పగింతను పాక్షిక విజయంగానే చూడాలి.