Manipur Violence | మణిపూర్ మండిపోతున్నది. కానీ, అది వార్త కాదు. ఎందుకంటే, వార్త అనేది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. రోజువారీ దినచర్య ముఖ్యాంశం కాదు కదా! ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మరో 10 మందికి పైగా అమాయకులు మరణించారు. వారితో కలిపి మృతుల సంఖ్య 200 దాటింది. మళ్లీ కర్ఫ్యూ కూడా విధించారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. కాగా, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం బుకాయిస్తున్నది.
రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లను భద్రతా దళాలు అదుపు చేయలేవని, రాష్ట్ర పోలీసులు మెయితీ, కుకీ వర్గాలుగా విడిపోయారని అసోం రైఫిల్స్ మాజీ అధిపతి గతం లో పేర్కొన్న విషయం విదితమే. అంతర్జాతీయ సరిహద్దుల్లాగా మణిపూర్‌లోనూ అంతర్గతంగా రెండు వర్గాల మధ్య అదృశ్య సరిహద్దు ఏర్పడింది. ఈ సరిహద్దును భద్రతా దళాల అనుమతితో కాదు, మిలిటెంట్ల అనుమతి తీసుకొని దాటాలి. అది కూడా సరిహద్దును దాటేవారు ఏ వర్గానికి చెందినవారనేది నిర్ధారించాకే మిలిటెంట్లు అనుమతిస్తారు. ఎవరైనా అనుకోకుండా అవతలివైపు వెళ్తే మాత్రం వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.
కుకీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రవేశించలేని పరిస్థితి. అంతేకాదు, కుకీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ పరిసరాల్లోకి వెళ్లలేని నిస్సహాయ స్థితి. అసలు రాష్ర్టాన్ని పాలిస్తున్నదెవరో ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యమంత్రి ఉన్నా లేనట్టే! మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన నాటినుంచీ ప్రధాని మోదీ జపాన్, పపువా న్యూగినీయా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్టు, ఫ్రాన్స్, యూఏఈ, దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, ఖతార్, భూటాన్, ఇటలీ, రష్యా, ఆస్ట్రియా, పోలండ్, ఉక్రెయిన్, బ్రూనె, సింగపూర్ తదితర దేశాలను సందర్శించారు. కానీ, మణిపూర్‌ను ఎప్పుడు సందర్శిస్తారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
‘ఓ..! అది మణిపూర్ మాత్రమే. దానితో మనకేంటి సంబంధం? అది ముంబై కాదు కదా, కారు ప్రమాదం కూడా వార్తల్లోకి ఎక్కడానికి? ఒకవేళ మణిపూర్‌లో హిందూ-ముస్లిం కోణం ఉండి ఉంటే, ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్రమై ఉంటే ‘జంగిల్ రాజ్’ పేరిట హెడ్లైన్లకు ఎక్కేది.’
మణిపూర్‌లో మెయితీ, కుకీ వర్గాలు ఇప్పు డు ఒకరిపై ఒకరు రైఫిళ్లతో మాత్రమే కాల్పులు జరుపుకోవడం లేదు. వాళ్లు అప్గ్రేడ య్యారు. ఇటీవల అక్కడ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు కూడా వాడినట్టు వార్తలు వచ్చాయి. ఇది వదంతు కాదు, మణిపూర్ పోలీసులు దీన్ని నిర్ధారించారు కూడా. అత్యధికులు హిందువులుగా ఉన్న మెయితీ వర్గంలోని చాలామంది సీఎం బీరేన్‌సింగ్‌పై విశ్వాసాన్ని కోల్పోయారు. మెయితీలకు బీరేన్‌సింగ్ మద్దతిస్తున్నాడని కుకీలు ఆరోపించారు. అంతేకాదు, ఆయనను నిషేధించారు కూడా. మెయితీల హీరోగా మారేందుకు దాన్ని బీరేన్‌సింగ్ వాడుకున్నారు.
కనీస సమాచారం లేకుండానే ఇప్పుడు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. శాంతిభద్రతలను తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ గవర్నర్‌కు స్వయంగా సీఎం బీరేన్‌సింగ్ లేఖ రాశారు. అవును..! ఆయన రాజ్యాంగం తనకు ఇచ్చిన అధికారాలను తిరిగివ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రం నియమించిన భద్రతా సలహాదారు చేతుల్లో శాంతిభద్రతలున్నాయి. ఈ కాల్పులు, అల్లర్లు విపక్ష పార్టీ పాలిత రాష్ట్రంలో జరిగినట్టు ఒక్కసారి ఊహించుకోండి! ఇది భారీ కుంభకోణం కాదా? జాతీయ భద్రతకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైఫల్యంపై మనం మాట్లాడగలమా? అది వార్త అవుతుందా?
మొత్తానికి మణిపూర్ మాట్లాడటం ప్రారంభించడం శుభపరిణామం. మణిపూర్ లోయ ఎంపీ బిమోల్ అకోయిజమ్ పార్లమెంట్లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. నేను మరో కథనం చెప్పనా? ఇది మణిపూర్ గురించి కాదు.. ఢిల్లీ కఠినమైన హృదయం గురించి, దేశంలో ఆవరించిన నిశ్శబ్దం గురించి, మన హృదయాలను కమ్మేసిన చీకట్ల గురించి. మండిపోతున్నది మణిపూర్ మాత్రమే కాదు.. మన కలల భారతం, చిన్నప్పటినుంచి మనం వింటూ పెరిగిన ‘సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్ హమారా…’
(‘నేషనల్ హెరాల్డ్’ సౌజన్యంతో..)
– యోగేంద్ర యాదవ్