‘ఇకమీదట భారత్‌లో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణిస్తాం’ అని ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.ఉగ్రదాడి జరిగిన మరుక్షణమే పాక్‌పై భారత్ యుద్ధభేరి మోగిస్తుందని కూడా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కూడా దేశ ప్రజలకు అభయమిచ్చారు. కానీ, ఆరు నెలలు కూడా గడవకముందే దేశంలో మరో ఉగ్రదాడి జరిగింది. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సౌధాలకు కూతవేటు దూరంలో, పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిచ్చే ఎర్రకోటకు అతి సమీపంలో… ఈ దాడి జరగడం బీజేపీ సర్కార్ వైఫల్యానికి నిదర్శనం.
కాంగ్రెస్ పాలనలో మన దేశంలో ఉగ్రదాడులు ఎక్కువగా జరిగేవి. ముంబై 26/11 ఉగ్రదాడిని చూసి ప్రపంచమే కలవరపడింది. మన హైదరాబాద్‌లోనూ గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. హస్తం పాలన లో వేళ్లూనుకుపోయిన అవినీతి, శాంతిభద్రతల సమస్యను 2014 ఎన్నికల ప్రచారాంశంగా వాడుకున్న మోదీ.. తాము అధికారంలోకి వస్తే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. కానీ, మోదీ సర్కార్ కొలువయ్యాక దేశంలో ఉగ్రదాడులు ఇంకా ఎక్కువయ్యాయి. 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 68 ఉగ్రదాడులు జరగడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఈ పదకొండేండ్లలో గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, పుల్వామా, పాంపోర్, ఉరి, రియాసీ, పహల్గాం, తాజాగా ఎర్రకోట వద్ద భారీ ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 360 మంది సైనికు లు, 230 మంది పౌరులు మృతిచెందడం బాధాకరం.
కాంగ్రెస్ హయాంలో సామాన్య ప్రజలు ఎక్కువగా చనిపోగా, బీజేపీ పాలనలో మాత్రం జవాన్లు అమరులవుతుండటం అనుమానాలకు తావిస్తున్నది. సైనికుల తరలింపు కోసం హెలికాప్టర్లను పంపించాలని తాను కోరినా కేంద్రం పట్టించుకోలేదని పుల్వామా దాడి సమయంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆరోపించడం ఈ అనుమానాలను బలపరుస్తున్నది. జవాన్లపై దాడులు జరుగుతాయని తెలిసినా, ఉద్దేశపూర్వకంగానే వారిని బలిచేశారా? అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
యూపీఏ పాలనలో దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు నాటి పాలకపక్షం కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేది. శాంతిభద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని సర్వత్రా విమర్శలు వచ్చేవి. కానీ, మోదీ పాలనలో పదుల సంఖ్యలో ఉగ్రదాడులు జరుగుతున్నా ఈ విధమైన విమర్శలు ఎక్కువగా కానరావడం లేదు. మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దాడులు జరుగుతున్నాయనే ప్రచారం జరగకుండా; దేశభక్తి, జాతీయవాదం అంటూ బీజేపీ మేనేజ్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతుండటం శోచనీయం.
దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రదాడి జరుగుతున్నదనే తీవ్ర ఆరోపణ కూడా ఉన్నది. 2016 జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడగా, 8 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్- మే నెలల్లో అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 18న పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి- మార్చి నెలల్లో యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగాయి. 2017 జూలైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరగగా, అదే ఏడాది నవంబర్- డిసెంబర్ నెలల్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘాతుకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరి 26న భారత సేనలు బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ చేయగా, ఆ తర్వాత ఏప్రిల్- మే నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఉగ్రదాడి జరగడం, దాని తర్వాత మూణ్నాలుగు నెలలకే ఎన్నికలు రావ డం, అత్యధిక చోట్ల బీజేపీ గెలుపొందడం మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తెలియనప్పటికీ, ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిగి, ప్రజా సమస్యలు పక్కదారి పట్టడంతో బీజేపీ లబ్ధి పొందుతున్నదనేది మాత్రం సుస్పష్టం.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు ప్రకటించింది. ఇరువైపులా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాక్-భారత్ యుద్ధంగా మారింది. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇక పాక్‌ను తుడిచిపెట్టేస్తామని, పీవోకేను స్వాధీనం చేసుకుంటామని, దాయాదిని నామరూపాల్లేకుండా చేస్తామని బీజేపీ పాలకులు ప్రగల్భాలు పలికారు.
కానీ, రెండు రోజులయ్యాక అటునుంచి వచ్చే డ్రోన్ల ను కూల్చుడు తప్ప, ఇటు నుంచి ఒక్క తూటా పేల్చకుండా ఆర్మీ చేతులను కట్టేశారు. ఆర్మీకే తెలియకుం డా, అటువైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాకుండానే, అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి లొంగిపోయి కాల్పుల విరమణకు బీజేపీ సర్కార్ అంగీకరించింది. పైగా దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
అయితే, పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రపంచానికి నిరూపించి, దోషిగా నిలబెట్టడంలో మోదీ సర్కార్ విఫలమైంది. అంతేకాదు, ఉగ్రవాదంపై పోరును బీజేపీ పాలకులు అత్యుత్సాహంతో ఒక వర్గానికి వ్యతిరేక పోరుగా మార్చడంతో అంతర్జాతీయంగా భారత్ ఒంటరైపోయింది. ఈ కారణంగానే చైనా, తుర్కియే, అజర్బైజాన్ లాంటి దేశాలు పాక్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలపగా, అరబ్ దేశాలు పరోక్షంగా మద్దతిచ్చి, అమెరికా సహకారంతో పాక్‌కు ఐఎంఎఫ్ రుణం వచ్చేలా చేశా యి. టారిఫ్‌ల పేరిట బెదిరించి ఇరుదేశాలను లొంగదీసుకున్నానని పదే పదే చెప్పిన ట్రంప్.. ప్రధాని మోదీని మరింత ఇరుకున పెట్టేశారు.
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో ఉగ్రదాడి జరిగినా మోదీ సర్కార్ కిక్కురుమనడం లేదు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు నాడు సీఎం గా ఉన్న మోదీ అప్పటి మన్మోహన్ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో ఉన్న అనేక రాష్ర్టాలు కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయని; త్రివిధ దళాలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని, అయినా ఉగ్రవాదులు దేశంలోకి ఎలా చొరబడుతున్నారని, దాడులు ఎలా చేస్తున్నారని మోదీ నాడు ప్రశ్నించారు. మరి నేడు సరిహద్దుల్లోని రాష్టాల్లో ఎవరి పాలన నడుస్తున్నది? త్రివిధ దళాలు ఇప్పుడు మోదీ చేతుల్లో లేవా? కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నది మోదీ సర్కార్ కాదా? అలాంటప్పుడు ఉగ్రవాదులు దేశంలోకి ఎలా చొరబడుతున్నారు? దేశ రాజధానిలో ఎలా దాడులు చేయగలుగుతున్నారు? ఇది మోదీ సర్కార్ వైఫల్యం కాదా?
ఎర్రకోట వద్ద ఉగ్రదాడి జరిగాక రెండు రోజుల వరకు ఉగ్రదాడా, కాదా? అన్నది స్పష్టం చేసేందుకు కూడా మోదీ సర్కార్ సాహసించలేదు. 48 గంటలు గడిచాక జైషే మహమ్మద్ పని అంటూ చావుకబురు చల్లగా చెప్పింది. అయితే, మరోసారి దేశంలో ఉగ్రదాడి జరిగితే యుద్ధానికి ఆహ్వానంగానే పరిగణిస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు కనీసం దానిపై నోరు విప్పడం లేదు. అంటే ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం లేదని మోదీ చెప్తున్నారా? లేదా పాక్ ప్రమేయం ఉందని తెలిసినా, దాని వెనుక ఉన్న అమెరికా, చైనాలకు జడిసి నోరుమెదపడం లేదా? అసలు పాక్ ప్రమేయం లేకుండా భారత్‌లో ఉగ్రదాడి జరిగే ఆస్కారం ఉందా? ఇంకా కొనసాగుతుందని చెప్పిన ఆపరేషన్ సిందూర్ ఏమైంది? పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ హస్తం ఉందని భద్రతా దళాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వెనుక ఉన్న మర్మమేమిటన్నది తెలియాల్సి ఉన్నది.
-మాలోతు సురేష్ 98856 79876