మా ఊళ్లో నా చిన్నతనం నాటి సంగతి ఇది. లచ్చయ్యది మిర్ర పొలం. దాని కిందిపొలం పెంటయ్యది. ఏటి కాలువ కింద పండుతయి ఆ పొలాలు. పోచారం డ్యాం గేట్లు తెరిస్తే ఏటి కాలువ పారుతుంది. ఆ కాలువకు అక్కడక్కడా తూములు ఉండేవి. ఆ తూము గేటు పైకి అంటే దాన్నుంచి మరో పిల్ల కాలువ ద్వారా పొలాలకు నీళ్లు పారేవి. పైనున్న పొలం వాళ్లు కింది పొలం వారికి తమ గట్టు తెంచి నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదెంతో సయోధ్యతో చేసుకునే పని.
ఓసారి నీళ్లు సరిపడా అందక లచ్చ య్య తన పొలంలోంచి పెంటయ్య కు అందివ్వలేదు. సర్లే అనుకొని పెంటయ్య పక్కనున్న బావిలోంచి మోట కొట్టుకున్నాడు. అయితే ఆరోజు తెల్లారేసరికి లచ్చయ్య పొలంలో చుక్క నీరు లేదు. పెంటయ్య పొలంలో ఫుల్లు నీళ్లు. తన పొలం గెట్టుకన్నీ బుంగలు. ‘నేను నీళ్లిస్తలేనని ఇట్ల బుంగలు కొట్టి నా పొలంల నీళ్లు దోసుకుంటవా?’ అని లచ్చయ్య అడిగిండు. ‘నాతోడు, నేను చెయ్యలేదే ఆ పాడు పని. ఎండ్రికాయలే కొట్టినయి ఆ బుంగలు’ అని పెంటయ్య ఎంత చెప్పినా లచ్చయ్య వినిపించుకోలేదు. పెద్ద గొడవే పెట్టుకున్నాడు. అప్పటినుంచి పెంటయ్య మీద లచ్చయ్యకు పీకల్లోతు కోపం. ఆ తర్వాత తన పొలంలో జరిగినట్టే తన పై పొలం గెట్లకు ఎండ్రికాయలు బుంగలు కొట్టినవి. దీంతో పై పొలంలోని నీళ్లన్నీ తన పొలంలోకి వచ్చాయి. ఇట్ల నిజం తెలిసినా కూడా లచ్చయ్యకు పెంటయ్య మీద ఉక్రోషం తగ్గలేదు. పెంటయ్య ఎదుగుతుంటే చూసి ఓర్వలేక, అతడిని ఊరి నుంచి ఎల్లగొట్టిద్దామని ప్లాన్ చేసి, మంత్రాలు చేస్తున్నడనే పుకారు పుట్టిచ్చిండు. అది నమ్మిన జనం ఓరోజు పెంటయ్యను చెట్టుకు కట్టి కొడుతుంటే పోలీసులు వచ్చి విడిపించిండ్రు. వారి దర్యాప్తులో లచ్చయ్య దుర్మార్గం బయటపడ్డది. దాంతోటి ఆయనను జైలుకు తీసుకుపోయిండ్రు. ఆ తర్వాత జన విజ్ఞాన వేదిక వారు వచ్చి ఊరందరికీ దీని మీద అర్థమయ్యేలా చెప్పి మంత్రాలేమీ లేవని కళ్లు తెరిపించారు. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే.. మనిషి దుర్బుద్ధే తాంత్రికం వైపు నడిపిస్తుందని. ఒక మనిషి మీద పీకల్లోతు కోపాలు పెట్టుకున్నోళ్లే కడుపు మంటతో ఎదుటివారి మీద ఇలాంటి ఫాల్తు నిందలు వేస్తుంటారని.
ప్రస్తుతం పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు జవాబుగా ఇప్పుడీ కథ చెప్పాల్సి వచ్చింది. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ మంత్రాలు చేస్తున్నారట. తాంత్రికుల సలహాలతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బహుశా వారికే చెల్లిండొచ్చు. వారి వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రజ లు నవ్వుకుంటున్నారు. ఈ కాలంలో కూడా మంత్రతంత్రాలా? అని మొట్టికాయలు వేస్తున్నారు. అవున్లే వారి బుర్రలు మన దేశాన్ని మధ్య యుగాలకు తీసుకు పోయేలా ఆలోచిస్తున్నాయి కాబట్టి వారు మూఢ నమ్మకాలను బలపరిచేలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు మరి? అని పెదవి విరుస్తున్నారు. దేవుళ్లు, దెయ్యాలు, మంత్రతంత్రాలు, హిందూ ముస్లిం ఇవి తప్ప వారి నోటి నుంచి ఇది అభివృద్ధి చేస్తాం, తెలంగాణలో విద్య, వైద్యం ఇలా అందిస్తామని అస్సలు పలకరే. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని దేశ ప్రజలు ఆహ్వానించడంతో వారి కళ్లు కుట్టాయన్నది సుస్పష్టం. అందుకే బట్ట కాల్చి మీదెయ్యాలి. ఎదుటోడు ఎదుగుతుంటే వాణ్ని ఆపాలి, తొక్కాలి, అందరం కలిసి మధ్య యుగాల్లోకి వెళ్లిపోవాలి. ఇదే వారి తీరు, వారి లక్ష్యం.
ఆధునిక, వైజ్ఞానిక ఆలోచనలు వారిలో అసలే ఉండవు. దేశంలో ఫాసిస్టు బీజేపీ ఆగడాలకు కళ్లెం వేసే పనిలో పడ్డ సీఎంను చూసి బండి ఓర్వలేకపోతున్నాడు. అందుకే నోటికి ఏదొస్తే అది అనేస్తున్నాడనేది తెలుస్తోంది. ఈ దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లను రెండో శ్రేణి పౌరులుగా మార్చేసి, హిందువుల్లో వర్ణ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి జనాలను వేపుకు తిందామనే ప్లానింగ్‌లో ఉన్నారు వాళ్లు. వాళ్లకు ఇలాంటి మూఢ మాటలు తప్ప ఏం వస్తాయి? ప్రస్తుతం ఈ దేశానికి బీఆర్ఎస్ అవసరం ఎంతో ఉంది.
కేసీఆర్ దేశ ప్రధాని అయితే తప్పకుండా దేశాన్ని తెలంగాణలా అభివృద్ధి చేయగలరు. సత్తా ఉన్న నేత. ఆయనలో విషయ పరిజ్ఞానం అమోఘం. అన్న మాటను తప్పకుండా నిలబెట్టుకోగలరు. బీఆర్ఎస్ను చూసి బీజేపీ అధిష్ఠానం బెదిరిపోయిందనేది కనిపిస్తోంది. అందుకే ఏదో ఒక నింద వేయాలనుకుంటున్నారు. మరి అవేమైనా సహేతుకమైనవా అంటే కానేకావు. ఇదిగో ఇలా క్షుద్ర పూజలు అంటారు. ‘నేను ప్రజలకు ఒక మంచి పని చేస్తే మీరు రెండు మంచి పనులు చేసి చూపించండి’ అని మంత్రి కేటీఆర్ ఎంత మంచి మాట అన్నారు.
– హుమాయున్ సంఘీర్
93981 78380