స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్‌ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్‌గా ఉండే కొత్త తరహా బడ్జెట్‌ను రూపొందించే క్రమానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజల అభ్యున్నతి పట్ల నిబద్ధత లేని పాలకుల కారణంగా దేశ ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలు తీరని దుస్థితిలో ఉండటం గమనార్హం.
బడ్జెట్ అంటే జమా, ఖర్చుల పట్టిక, వార్షిక ఆర్థిక ప్రకటన కాదు. ద్రవ్య వ్యయానికి పార్లమెంట్ ఆమోదంపొందే ప్రక్రియగానే బడ్జెట్‌ను చూడరాదు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చే విధంగా కేటాయింపులుండాలి.2021-22 బడ్జెట్ రూ.34.83 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్‌ను రూ.39.5 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే జీడీపీ శాతం ఈ ఏడాది 9.2 శాతం పెరుగుదలతో రూ. 147.5 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అంకెలపై ఆధారపడిన బడ్జెట్ కాకుండా, వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ తయారుచేసి క్షేత్ర స్థాయికి ఆయా పథకాలను తీసుకెళ్లగలిగితే ఒక నిర్దిష్ట కాలపరిధిలో పేదరికం నుంచి దేశం, రాష్ట్రాలు బయటపడుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పుకోవచ్చు. ఉచితవిద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, ఆసరా లాంటి పథకాలే గాక ప్రస్తుతం ‘మన ఊరు-మనబడి’ పథకాన్ని గ్రామ స్థాయిలో అమలు చేయడం ద్వారా గ్రామాల రూపురేఖలు సమూలంగా మారుతున్నతీరును చూడవచ్చు.
ఇన్నాళ్లూ.. దేశాన్ని ఏలిన పాలకుల నిర్వాకం మూలంగా దేశం రెండు భారత్‌లుగా ఉన్నది. ఒకటి సంపన్న భారత్ కాగా మరొకటి పేదల భారత్‌గా దర్శనమిస్తున్నది. 90 శాతం ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపేణా కడుతున్నారు. కాగా 75 శాతం దేశ సంపద 10 శాతం మంది ధనవంతుల చేతుల్లో పేరుకుపోయింది. 60 శాతం పేదల వద్ద 5 శాతం సంపద మాత్రమే ఉన్నది. దేశంలోని అసమానతలపై ‘ఆక్స్‌ఫామ్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 70 శాతంగా ఉన్న 95 కోట్ల మంది ప్రజల చేతుల్లో ఎంత ఆస్తి ఉన్నదో, దేశంలోని 1 శాతం సంపన్నుల చేతుల్లో అంతకు నాలుగురెట్ల సంపద ఉన్నది!
ఆక్స్‌ఫామ్ 2020-21 రిపోర్టు ప్రకారం.. దేశంలోని 102 మంది శతసహస్ర కోటీశ్వరుల జాబితాలో కొత్తగా మరో 40 మంది చేరారు. 2020-21లో 104 మంది సంపన్నుల ఆస్తి రూ.23 లక్షల కోట్లు కాగా, ఆ కరోనా కాలంలో కూడా వారి ఆస్తి రూ.53 లక్షల కోట్లకు పెరిగినట్లుగా ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. 1980లో వాణిజ్య వర్తకునిగా వ్యాపారాన్ని ప్రారంభించిన ఆదాని సంపద 2014లో రూ.50వేల కోట్లు ఉండగా, 2021-22 నాటికి రూ.6.81 లక్షల కోట్లతో ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతునిగా మారాడు. కచ్చితమైన అధికారిక సమాచారం లేనప్పటికీ దేశంలో, విదేశాల్లో దాచిపెట్టిన నల్లడబ్బు రూ.40 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దేశంలోని కుబేరులు బ్యాంకులకు ఎగవేసిందే రూ.13 లక్షల కోట్లు. ఈ విధంగా సంపద పోగుపడటానికి కారణం- ఆశ్రితులు, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలు మోదీ అనుసరించటమే.
ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో నిరుపేద ఆఫ్రికన్ దేశాల సరసన 101వ స్థానంలో భారత్ నిలిచింది. సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం- 2011 నాటి సెన్సెస్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో 41.8 శాతం, పట్టణాల్లో 25.7 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. దేశంలో కనీసం గూడు (ఇల్లు) లేనివారు 12 కోట్ల మం ది.‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి’ నివేదిక ప్రకారం.. దేశంలో దాదాపు 6 కోట్ల మంది చదువుకున్న నిరుద్యోగులున్నారు. 50 కోట్ల మంది కార్మికుల్లో 45 కోట్ల మంది అసంఘటిత కార్మికులు. ప్రముఖ ఆర్థికవేత్తలైన సంధ్యాకృష్ణన్, నీరజ్ హతీకర్ ప్రకారం.. దేశ జనాభాలో సగానికిపైగా మధ్యతరగతి ఉన్నది. మంచి విద్య, వైద్యం, నిత్యావసరాలకు ద్రవ్వోల్బ ణం నేపథ్యంలో చావలేక బతుకుతున్నారు. అలాగే సుమా రు 40 కోట్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో సగం మందికిపైగా దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లింలలో 40 శాతం పేదరికంలోనే ఉన్నారు.
మంచి జీవితాలను గడిపే సమాజం కావాలంటే బడ్జెట్ విధానాన్ని పూర్తిగా మార్చాలి. జీరో బేస్డ్ బడ్జెట్ ప్రకారం పాత లెక్కల జోలికి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు ఆయా వర్గాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. దీనివలన సంకల్పిత సామాజిక లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. మౌలికరంగంలోని ప్రభుత్వరంగాన్ని కాపాడుకుంటూ సంక్షేమాన్ని గమనంలో ఉంచుకోవాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని జమిలిగా కొనసాగించాలి. పేదవర్గాలకు నేరుగా నగదు పంపిణీ దగ్గరి నుంచి సబ్సిడీలను కొనసాగిస్తూ హెలికాప్టర్ మనీ పద్ధతి ద్వారా పేదప్రజల చేతుల్లోకి కనీస డబ్బు చేరే విధంగా చూడాలి. అలాగే జీడీపీలో 15 నుంచి 18 శాతం వరకు భాగస్వామ్యమున్న వ్యవసాయరంగానికి అమెరికా, జపా న్ దేశాల తరహాలో ప్రభుత్వాలు పూర్తి మద్దతు కల్పించా లి. ఆరోగ్య, విద్యారంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. ఇవన్నీ చేయాలంటే సంపన్నులపై 2 నుంచి 4 శాతం సంపద పన్ను విధించగలిగితే సంపద పంపిణీకి, సమానతతో కూడిన భారత్‌కు అవకాశం ఉంటుంది.
దేశ ఆర్థికరంగానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో పెనుమార్పులు రావాలి. జీఎస్టీ.. తదితర పన్ను, పన్నేతర ఆదాయాలను కేంద్రం గుప్పిట్లో ఉంచుకొని కేంద్రంపైన ఆధారపడే స్థాయికి రాష్ట్రాలను మోదీ ప్రభుత్వం కుదిస్తున్నది. ఈ పరిస్థితుల్లో అధికార పునర్విభజన అవసరం. ఆర్థిక, అధికార వికేంద్రీకరణ ద్వారా సంక్షేమం, ఆయారాష్ట్రాల అభివృద్ధి అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. రాజ్యాంగంలో పొందుపర్చిన రాష్ట్రాల అధికార జాబితా, కేంద్ర జాబితా అలాగే ఉమ్మడి జాబితా సమాఖ్య స్ఫూర్తితో అమలు చేయాలి. ఆ విధంగా బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రంతో కూడిన ప్రభుత్వంతోనే 2024-25 నాటికి ఆశించినట్లుగా ఐదు ట్రిలియన్ డాలర్ల మహత్తరమైన ఆర్థిక వ్యవస్థను, ఉజ్వల భారతాన్ని రూపొందించుకోవచ్చు.
జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల, తరుగుదల సామాన్య ప్రజల జీవితాలకు సంబంధించినదిగానే చూడరాదు. సంపన్నుల ఆస్తి పెరిగితే వృద్ధి రేటు అధికంగా కనపడు తుంది. సామాన్యుల, సంపన్నుల ఆదాయాలు కలిపి చూడటం వల్ల జీడీపీలో వృద్ధి కనిపిస్తుంది. కానీ సామాన్యుల అదాయాల్లో, జీవితాల్లో మార్పేమీ ఉండదు.
– కూనంనేని సాంబశివరావు
(వ్యాసకర్త: సీపీఐ, తెలంగాణ రాష్ర్ట సహాయ కార్యదర్శి; మాజీ శాసనసభ్యులు, కొత్తగూడెం)