యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపింది కదా, అమెరికా. ‘వార్ ఆన్ టెర్రర్’ పేరిట అఫ్ఘాన్‌పై 20 ఏండ్లు యుద్ధం చేసి, విసిగి వేసారి చివరికి తమ ఆయుధాలనూ వాళ్లకే అప్పగించి చేతులెత్తేసింది. భారత్‌కూ స్వానుభవమే మరి. రెండు యుద్ధాల్లో చావు దెబ్బ కొట్టినా, సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడినా పాక్ ఉగ్రవాదాన్ని ఆపగలిగామా? ‘ఆపరేషన్ సిందూర్’ ఆపుతుందన్న గ్యారెంటీ ఉందా?
PM Modi | పాకిస్థాన్ ఉగ్రవాదుల లక్ష్యం ఏమంటే… భారత్‌లోని మత విద్వేషాలకు ఆజ్యం పోస్తూ, దేశ సమైక్యతను దెబ్బతీసి భారత్‌ను బలహీనపరచటం. కశ్మీర్లో హిందూ పర్యాటకులను హతమార్చటం ద్వారా భారతీయుల్లో కశ్మీరీల పట్ల విద్వేషాన్ని రగిలించటం. పర్యాటకులను హడలకొట్టి, కశ్మీరీల ఉపాధికి గండికొట్టి, వాళ్లను భారత్‌పై తిరగబడేలా చేయటం. భారత్‌లో డ్రగ్స్‌ను ప్రవహింపజేసి భారత యువతను నిర్వీర్యం చేయటం, తమ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక వనరులను సమీకరించటం. అమెరికా-చైనాలతో బంధాన్ని కొనసాగిస్తూ… భారత ప్రతిదాడుల నుంచి తమను కాపాడుకోవటం పాకిస్థాన్ లక్ష్యం అన్నది చారిత్రక సత్యం. వీటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా పాక్ ట్రాప్‌లో భారత్ పడ్డట్టే. ‘మోదీ తల్చుకుంటే గంటల్లో పీవోకేను ఆక్రమిస్తాడు. రోజుల్లో ‘బలూచిస్తాన్’ను వేరు చేస్తాడు. ప్రపంచ పటంలో పాక్‌ను తుడిచేస్తాడు’ అంటూ భారతీయ పేపర్లు, ఛానెళ్లు, సోషల్ మీడియా, బీజేపీ కార్యకర్తలు, మోదీ వీరాభిమానులు హోరెత్తిస్తున్న సమయంలో అనూహ్యంగా కాల్పుల విరమణ వార్త వచ్చింది. చేతికి అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటమేమిటని, అఖిలపక్షాలు, విశ్లేషకులు ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఉదాహరణకు పహల్గాం హత్యాకాండ గురించి అమెరికా, చైనా, ఐరోపా మీడియాలో ‘కేవలం గన్మెన్లు పర్యాటకులను కాల్చినట్టు’ రాశారు. పాకిస్థాన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తుండగానే ‘పహల్గాం దాడికి మేమే కారకులం’ అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది.
అయినా సరే ‘ఐరాస తీర్మానం’ నుంచి ఆ పేరు తొలగింపజేసుకోగలిగింది పాకిస్థాన్. భారత్ అడ్డుపడినా ఐఎంఎఫ్ నుంచి రుణాన్ని మంజూరు చేయించుకోగలిగింది. ఎవరి కాళ్లు పట్టుకుంటేనేమీ బేషరతుగా భారత్‌ను కాల్పుల విరమణకు ఒప్పించి, మృత్యుముఖం నుంచి బయటపడింది కదా పాకిస్థాన్. ఉగ్రవాదుల సృష్టికర్త అయిన పాకిస్థాన్‌కు ఎవరు సాయపడుతారులే అని అనుకుంటున్నవాళ్లు గ్రహించాల్సిన వాస్తవమేమంటే.. తనకు చేతికర్ర వంటి గూండా, పరమ దుర్మార్గుడైనా పరోక్షంగా అతన్ని పోషిస్తూనే ఉంటాడు క్రిమినల్ రాజకీయ నేత. పాకిస్థాన్ కూడా ఎంతరోగ్ కంట్రీ అయినా, తమ చేతి రిమోట్‌లా ఉన్నంతకాలం అమెరికా, చైనాలు పరోక్షంగా పాకిస్థాన్‌ను కాపాడుతూనే ఉంటాయి. భారతదేశ పాలకులెప్పటికీ విస్మరించరాని వాస్తవం ఇది.
అమెరికా రోహింగ్యా శరణార్థులకు సాయం పేరిట బంగ్లాదేశ్ నుంచి మయన్మార్‌లోని ‘రఖైన్ స్టేట్’ దాకా సైనిక కారిడార్ నిర్మిస్తున్నది. మయన్మార్ వద్ద సైనిక స్థావరం ఏర్పాటే అమెరికా తదుపరి లక్ష్యం. అమెరికాను ధిక్కరిస్తే, బంగ్లా, పాకిస్థాన్ రెండింటినీ ఏకకాలంలో భారత్‌పై దాడికి దింపగలనన్నది ట్రంప్ ధీమా. అంతేకాదు, పాకిస్థాన్‌తో చేతులు కలిపిన టర్కీ, అజర్ బైజాన్లకు ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నది అమెరికా, చైనాలే సుమా. ఇంకో ఇబ్బందికర విషయమేమంటే.. తనతో పొత్తు పెట్టుకునే ఏ దేశానికైనా అమెరికా ‘నా నోట్లో నీ వేలు పెట్టనిస్తా-నీ కంట్లో నా వేలు పెట్టనివ్వు’ అనే షరతు విధిస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే వాజపేయితో సహా భారత ప్రధానులంతా అమెరికాతో అంటీముట్టనట్టు వ్యవహరించారు. కానీ, మోదీ మాత్రం ఎరక్కపోయి ట్రంప్ కౌగిట్లో ఇరుక్కున్నారు. అందుకే ప్రస్తుతం కక్కా మింగలేని స్థితిలో ఉన్నారు.
కాల్పుల కొనసాగింపు కన్నా, అంతర్జాతీయ దౌత్యం కోసం పార్లమెంటరీ బృందాలను పంపటమే మంచిదనిపిస్తున్నది. ప్రస్తుతం పీవోకేలో మెజారిటీ ప్రజలు పాకిస్థాన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత్‌తో కలిస్తే బాగుపడుతామన్న భావన వాళ్లలో మొలకెత్తిందన్న వార్తలు వైరలవుతున్నాయి. ఇలాంటప్పుడే కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇచ్చి, పర్యాటక రంగాభివృద్ధితో పాటు అదనపు ఉపాధి మార్గాలను సృష్టించాలి. కశ్మీరీలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించగలిగితే వాళ్లను చూశాక పీవోకే ప్రజల్లో భారత్ పట్ల మరింత సానుకూలత పెల్లుబుకుతుంది. భారత్‌లో పీవోకే విలీనానికి మార్గం సుగమమవుతుంది.
భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ ఉద్యమకారులకు పరోక్షంగానైనా, సహాయ సహకారాలను అందించాలి. అంతర్జాతీయంగానూ బలూచిస్థాన్ స్వాతంత్య్రానికి మద్దతు కూడగట్టే బాధ్యతనూ భుజానికెత్తుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పరోక్షంగానైనా మోదీ ప్రభుత్వం శక్తియుక్తులన్నింటినీ వియోగించాలి. పాకిస్థాన్‌తో విభేదిస్తున్నప్పటికీ అది మరో ఉగ్రవాద దేశం గనుక, అఫ్ఘాన్‌తో ఆచితూచి అడుగులువేస్తూ సత్సంబంధాలను కొనసాగించాలి. ‘అపర హిట్లర్, పాలస్తీనా కబ్జాదారు’ అన్న అపకీర్తిని మోస్తున్న ‘నెతన్యాహూ’-ఇజ్రాయెల్‌తో స్నేహమంటే భారత్‌ను ప్రపంచ ఇస్లామిక్ దేశాలన్నింటి విద్వేషానికి గురిచేసినట్టే. తస్మాత్ జాగ్రత్త.
– పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889