బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందులో ఉండలేక, వెళ్లలేక మథనపడుతున్నారు. అంతేకాదు, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌తో అంటకాగుతూ తామింకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో కూరుకుపోయారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అనేక దారులు వెతుకుతున్నప్పటికీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యే అవకాశాలున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఏమవుతుందో, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయకపోతే ఏమవుతుందో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ ప్రత్యక్షంగా పోరాడుతుండటం, సుప్రీంకోర్టు కూడా కొరడా ఝళిపించేందుకు రెడీ అవుతుండటంతో కక్కలేక, మింగలేకపోతున్నారు. హస్తం పార్టీని నమ్మి తమ హస్తవాసిని చేతులారా నాశనం చేసుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నారు. అదే సమయంలో ప్రజావ్యతిరేకతకు తోడు ఫిరాయింపుల కేసు మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఆగమాగం అవుతున్నది.
తన పీకల మీదికి తెచ్చిన ఈ కేసు నుంచి ఎమ్మెల్యేలను తప్పించేందుకు తన రాజకీయ గురువు చంద్రబాబును రేవంత్ అనుసరిస్తున్నారు. తమ అనుకూల పత్రికలు, ఆస్థాన మీడియా ద్వారా లేనిపోని కథనాలను వండి వారుస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీమంత్రి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, నాలుగు మంత్రి పదవులు ఇస్తే లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేస్తామని అన్నట్టు రాశారు. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోతాయని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. కానీ, ఆ పాచిక పారలేదు. అనుకూల మీడియాను వాడుకుని రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
ఉమ్మడి ఏపీలో 1994 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చంద్రబాబు అస్సలు ఊహించలేదు. మెజారిటీ సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రాకపోవచ్చని, అదే జరిగితే కాంగ్రెస్ సభ్యులను లాక్కొని ముఖ్యమంత్రి కావాలని భావించారు. కానీ ప్లాన్ బెడిసికొట్టడంతో ఎన్టీ రామారావును గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు వైస్రాయ్ హోటల్‌ను వేదికగా మార్చుకున్నారు.
చంద్రబాబుకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలు వేళ్లపై లెక్కపెట్టేంతమంది ఉన్నా, తన అనుకూల పత్రికల సాయంతో చంద్రబాబుకు పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు రాయించారు. దీంతో ఎమ్మెల్యేలు, తటస్థులు అయోమయానికి గురయ్యారు. పదవులు కోల్పోతామేమోననే భయంతో చంద్రబాబు వర్గంలో చేరిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అనుకూల మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అనుకూల మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. తద్వారా ఎమ్మెల్యేలను ఆత్మరక్షణలో పడేయాలని చూస్తున్నారు. ఈ వార్త నిజమని ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకినా ఈ విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు నైతికంగా బలం చేకూరుతుందని భావిస్తున్నారు. కానీ, ఏడాది తిరక్కముందే సర్కారు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఎమ్మెల్యేలు కాదు కదా.. వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ వైపు చూడటం లేదు.
తాము గేట్లు మూసేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడలు దూకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలికారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు బార్లా తెరిచినా ఒక్కరు కూడా అటువైపు అడుగు పెట్టేందుకు సిద్ధంగా లేరనే విషయం వారికి కూడా తెలుసు. ఇప్పటికే గోడ దూకిన ఎమ్మెల్యేలు అనవసరంగా వెళ్లామని చింతిస్తున్నారు. తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు దారులు వెతుకుతున్నారు. ఆ అవకాశం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని వాపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు.
తద్వారా ఒకవేళ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ పేరు వాడుకొని మరోసారి బయటపడదామని కుయుక్తులు పన్నుతున్నారు. అందుకే ఉన్నవాళ్లను కాపాడుకోవడానికి ఆస్థాన మీడియాతో రేవంత్‌రెడ్డి కొత్త రాగం పాడిస్తున్నారు. అయితే ఎన్ని కూనిరాగాలు తీయించినా ప్రయోజనం లేదనే విషయం రేవంత్‌రెడ్డితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలి. ప్రజలు తాము చేసిన పొరపాటును తెలుసుకొని.. ‘పొరపాటున చేయిజారిన తరుణం తిరిగొస్తుందా..’ అనే పాటను తలుచుకొని చింతిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నం పెట్టిన పార్టీకి ద్రోహం తలపెట్టిన ఎమ్మెల్యేలపై రేపో మాపో వేటుపడడం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం తథ్యం.
-బీఎన్‌రావు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
డాక్టర్ బీఎన్ రావు 98668 34717