Party Defections | రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే లోక్‌సభ ఎన్నికలు రావడంతో రాజకీయ నేతల స్థానభ్రంశంపై దాని ప్రభావం ఎంతగానో పడింది. గత పదేండ్ల పాటు బీఆర్ఎస్ అండతో రాజకీయంగా ఎదిగినవారు వెంటనే ద్రోహచింతనలో పడ్డారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే దానంతో మొదలైన ఫిరాయింపులు జూలై 15న కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తర్వాత ఆగిపోయాయి.
‘బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం తప్ప, ఎవరూ మిగలరు’ అంటూ ప్రతీసారి పలికిన కాంగ్రెస్ నేతల మాటలు నిజం కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన, ఫలితాలు, ఎన్నికల హామీల అమల్లో ఆ పార్టీ మాట తప్పడాలు, జాప్యాలు ఫిరాయింపులను పునరాలోచనలో పడేశాయి. వెళ్లిన పది మంది ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ తప్ప మిగతావారు అనామకంగానే మిగిలిపోయారు. ప్రజల్లో వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు వారు బాధ్యతగా సమాధానం చెప్పక తప్పడం లేదు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం, జగిత్యాలలో కాంగ్రెస్ నేత ఒకరు హత్యకు గురికావడంతో ఫిరాయింపు ఆ పార్టీలో పెద్ద కుదుపును పుట్టించింది. స్థానిక సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిలో మొదలైన నిస్పృహ, ఆక్రోశం తారస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలను తట్టుకోలేని ఆయన కాంగ్రెస్ వ్యవహారాన్ని బహిరంగంగా విమర్శించే పనిలో పడ్డారు.
తన ఉనికి ఏమిటో చెప్పాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకే పెద్ద లేఖ రాశారు. గాంధీభవన్‌లో ఈ నెల 26వ తేదీన ఆయన ఒంటరిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై తీవ్ర విమర్శలు చేశారు. నాడు స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి వల్లనే అసెంబ్లీలో భట్టి కాంగ్రెస్ తరఫున శాసనసభాపక్ష నేత కాలేకపోయారని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని నిలదీశారు. ఇలాంటి తప్పుడు పనుల వల్ల పార్టీపై ప్రజలకు గౌరవం తగ్గుతున్నదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఓడినచోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటే స్థానికంగా పార్టీ బలహీనపడుతుందని, ప్రభుత్వాన్ని కూల్చుతారని విపక్షాలపై ఆరోపణలు చేస్తూ ఫిరాయింపులను సమర్థించుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.
ప్రెస్‌మీట్ తర్వాత జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మద్దతు పెరిగింది. జీవన్‌రెడ్డి విమర్శలు వ్యక్తిగతమని మొదట చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ ఆ తర్వాత మాట మార్చుతూ ఆయన వేదనను పార్టీ అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డికి తన మద్దతు ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బహిరంగంగా తెలిపారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మరో అడుగు ముందుకేసి జగిత్యాలకు వెళ్లి మరీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కలిశారు. అంతేకాదు, హత్యకు గురైన కాంగ్రెస్ నేత గంగారెడ్డి కుటుంబ సభ్యులను జీవన్‌రెడ్డితో కలిసి మధుయాష్కీ పరామర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గంగారెడ్డి హత్య జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా విలేకరుల ఎదుట మధుయాష్కీ డిమాండ్ చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి తీసుకొస్తామని ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని ఆయన ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే తప్ప, వారికి కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రేమ, గౌరవం లేదని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యేలను పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అనవలసిన మాటలు ఒక కాంగ్రెస్ పెద్దమనిషి అనడం విడ్డూరం. వింతేమిటంటే.. ఇప్పటికివరకు మధుయాష్కీ మాటలను కాంగ్రెస్ నేతలెవరూ తప్పుపట్టలేదు, ఖండించలేదు కూడా. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు గాని, వారికి కండువా కప్పి చేర్చుకున్న రేవంత్‌రెడ్డి గాని మధుయాష్కీ అభిప్రాయాన్ని కాదనలేదు.
ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయిన ముగ్గురు సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ ఈ రకంగా ఒక్కతాటిపైకి వచ్చారు. మధ్యలో వచ్చినవారు, ఫిరాయింపురాయుళ్లు పార్టీలో పెత్తనం చెలాయిస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని ఒక హెచ్చరికను జారీ చేసినట్టుగా వారి వైఖరి ఉంది. దాంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తే కాంగ్రెస్ సీనియర్ల నుంచి మరింత వ్యతిరేకత ఎదురుకావచ్చనే సంశయం కూడా పార్టీలో మొదలైంది. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, నిరాశను గమనించి ఫిరాయింపులకు వెనుకాడుతున్న నాయకులు కూడా ఉండవచ్చు.
మరోవైపు చూస్తే .. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన తొలి ముగ్గురు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు కోర్టు మెట్లెక్కారు. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోనట్టయితే తామే విచారణ చేపట్టవలసి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శిని సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే, దీనిపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. ఆ ముగ్గురి సభ్యత్వ రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తెలుపుతూ అక్టోబర్ 4న డివిజనల్ బెంచ్ ఆ కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని హంగామా చేసే రాహుల్‌గాంధీ.. తెలంగాణ దిక్కు చూడకపోవడం విడ్డూరం.
– నర్సన్ బద్రి
94401 28169