ఆమె హైదరాబాద్ వస్తుంది
నా ఆనందానికి అవధుల్లేవు
ఊరూరా తిప్పవచ్చని కలలు కన్నాను
చార్మినార్ వెలుగుల్లో ఆమెను
నడిపిస్తూ గాజులు కొనిపించాలనుకున్నా
కుదరదన్నారు
ఓ ఫొటో షూట్‌కు మాత్రమే అనుమతి అన్నారు
ఆమెను ఓ బొమ్మలా మాత్రమే చూడమన్నారు
ఆమె వంపుసొంపుల అందం నేను చూడలేదు
తోటి మనిషిగానే చూశాను
ఆమెను పొట్టి గౌనులో చూడలేను
విపణి వీధిలో వాడు కురచబుద్ధితో కొలతలేసి వ్యాపారం చేస్తున్నాడు
చేనేతలో ఆమె ముస్తాబు వాడికి
కాసులు కురిపిస్తోందని ఊదర కొడుతున్నాడు
ఆమె నడకలో కులుకుల చూసే జడ్జిల
ముందు ఆమె అంగడి సరుకై నవ్వుతుంది
నేనేమో తల దించుకున్నా సభ్య సమాజంలో ఒకడిగా
అందం ఆమెదేనా
విరగబూసిన మల్లెల్లో లేదా!
అడవంతా రాలిన ఇప్పపూవులో లేదా!
అడవికి నెత్తుటి మరకలందించి దోపిడీ చేయబడుతున్న ఆదివాసీ అందం వేదిక నెక్కజాలదుగా
టేకు ఆకుల సవ్వడిలో నైపుణ్యం లేదా?
నాట్యం చేసే మయూరాల్లో లేని అందాన్ని కొలుస్తున్న నగరాన్ని చూస్తుంటే జాలి కలుగుతుంది!
– గిరిప్రసాద్ చెలమల్లు 94933 88201