ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో విపక్షాల గలభా మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా చుట్టబెట్టిన బిల్లుల్లో గనుల చట్టం సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ సవరణను మామూలు సవరణగా చూడటానికి వీల్లేదు. అది రాష్ర్టాల హక్కులపై కేంద్రం పెత్తనం స్థిరపరచడానికి తీసుకువచ్చిందన్నది గమనించాల్సిన విషయం. ఖనిజాలపై పన్నులు, సెస్‌లు విధించాలంటే కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాల్సిందే అనే నిబంధన అందులో అత్యంత కీలకమైంది. ఇది కేవలం పరిపాలనా సంబంధమైన మార్పు కాదు. రాష్ర్టాల ఆర్థిక నిర్ణయాధికారంపై ప్రత్యక్ష దాడిగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఖనిజ సంపద కలిగిన రాష్ర్టాలు తమ అవసరాలకు అనుగుణంగా ఆదాయ విధానాలు రూపొందించుకునే హక్కు కలిగి ఉండేవి. ఇప్పుడు సవరణ ద్వారా ఆ హక్కును కేంద్రం బలవంతంగా లాగేసుకున్నది. దేశ ఆర్థికాభివృద్ధికి ఖనిజ సంపద మూలం అనేది తెలిసిందే. అయితే ఆ సంపదపై ఎవరు నియంత్రణ కలిగి ఉండాలి? ఎవరు లబ్ధి పొందాలి? అనేది ప్రశ్న. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను తగ్గిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 2026 గనుల చట్ట సవరణ వెనుకగల ఉద్దేశాలు సందేహాస్పదం అవుతున్నాయని చెప్పక తప్పదు.
కేంద్రం దీనిని ’ఏకరీతి విధానం’, ’పెట్టుబడులకు అనుకూల వాతావరణం’ అనే అందమైన ముసుగులు వేసి సమర్థించుకోవడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. కానీ దీని వెనుకనున్న అసలు ఉద్దేశం ఖనిజ రంగంలో పెద్ద కార్పొరేట్ సంస్థలకు పన్ను భారం తగ్గించడం అనేది స్పష్టమే. రాష్ర్టాలు ఎక్కువ పన్నులు విధిస్తే, కంపెనీలకు లాభాలు తగ్గుతాయి. ఇంతకూ ఈ చట్ట సవరణ అవసరం ఎందుకు వచ్చింది అనేది పరిశీలిస్తే 2024లో సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కారణమని తెలుస్తున్నది. రాష్ర్టాలకు గనుల భూమిపై, తవ్వకాలపై పన్నులు వేసే అధికారం ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తీర్పు అధిగమించేందుకు ఇప్పుడు కేంద్రం ఈ చట్ట సవరణ తెచ్చింది. రాష్ర్టాలకు పన్ను విధించే అధికారం లేకుండా చేసి, కార్పొరేట్ కంపెనీల లాభాలను రక్షించేందుకు ఈ సవరణ తెచ్చారనేది నిర్వివాదాంశం. దేశంలోని అపార ఖనిజ సంపద కలిగిన ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాలు ఆ కారణంగానే ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం ఏకంగా న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు ప్రకటించింది.
గనుల చట్టానికి తెచ్చిన తాజా సవరణ సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కేంద్రం మార్గనిర్దేశకుడిగా ఉండాలి గానీ, నియంత్రణాధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నదని చెప్పక తప్పదు. దీనివల్ల ఖనిజ సంపదపై అధికంగా ఆధారపడే రాష్ర్టాలు ఆదాయపరంగా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నియంత్రణ కేంద్రం చేతుల్లోకి, లాభాలు కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి పోతాయి. కానీ పర్యావరణ నష్టాలు, భూసేకరణ సమస్యలు, స్థానిక ప్రజల ఉపాధి లోటు వంటి అన్నిరకాల సాధకబాధకాలను రాష్ర్టాలే భరించాలి. ఇదే అసలుసిసలు సమస్య. ఖనిజాలు తవ్వేది రాష్ర్టాల్లోనే కనుక ఆయా ప్రాంతాల ప్రజలే దాని భారం మోయాలి.
కానీ ఆ సంపదపై నిర్ణయాధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటే అది ’సంపద స్థానికం-లాభం బయటి వారికి’ అనే వలస పాలన తరహా నమూనాను ఆవిష్కరిస్తుంది. దీనిని అభివృద్ధి అనలేం. ఇది వనరుల పునర్విభజన పేరిట జరిగే దోపిడీ మాత్రమే. ఇంకా ఆందోళన కలిగించే విషయమేందంటే ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చుకోవడం భారమైపోతుంది. ఖనిజ ఆదాయం తగ్గితే, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులపై ప్రభావం పడుతుంది. అంటే అంతమంగా కార్పొరేట్ లాభాల కోసం సాధారణ ప్రజల సంక్షేమం బలి అవుతున్నది. రాష్ర్టాల వనరులు రాష్ర్టాలే నియంత్రించాలి అనే సూత్రాన్ని కాపాడకపోతే, సమాఖ్య వ్యవస్థ కేవలం నామమాత్రంగా మిగిలిపోతుంది. రాష్ర్టాల హక్కులను కుదించే ప్రయత్నాలు చివరికి సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని చెప్పక తప్పదు.