ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వలసదారుల రాకను నియంత్రించడం లక్ష్యంగా పలు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇవి అమెరికా వెళ్లిన, వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆందోళనను, ఇబ్బందులను కలిగిస్తున్నాయి. కొన్ని ఫర్మానాలను కోర్టులు కొట్టివేయడం, కొన్నింటిపై కేసులు నడుస్తుండటం తెలిసిందే. అమెరికా ఒక్కటే కాదు, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లోనూ వలసదారులకు వ్యతిరేకంగా రకరకాల నియంత్రణలు వెల్లువెత్తుతున్నాయి.
విదేశీయుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా బ్రిటన్ తెస్తున్న ఈ నిబంధనల కారణంగా భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకోవడం, ఉద్యోగాల్లో చేరడం గగనమైపోతున్నది. ఇదివరకు పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఐదేండ్లు బ్రిటన్లో ఉండాలన్న నిబంధన ఉండేది. తాజాగా ఈ గడువును పదేండ్లకు పెంచడం గమనార్హం.
స్థానికులకు విదేశీయులు ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారనే అక్కసు అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యక్తమవుతున్నది. ఇలాంటి భయాలను సొమ్ము చేసుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అంటూ ఊదరగొడుతున్నారు. భారతీయులకు పొగబెట్టడమే కాకుండా యాపిల్ వంటి బహుళజాతి కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకునే స్థాయికి ఆయన వెళ్తున్నారు. అమెరికా అయినా, బ్రిటన్ అయినా తమ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తాయనేది నిర్వివాదాంశం. ఇప్పటివరకు సంపన్న దేశాలు వలసలను ప్రోత్సహించడానికి ఆయా దేశాల్లో జనాభా తక్కువగా ఉండటం, పారిశ్రామిక విస్తరణకు శ్రామికశక్తి అవసరం కావడం వంటి కారణాలుండేవి.
అక్కడి కరెన్సీకి అధిక విలువ ఉండటం వల్ల వర్ధమాన, పేద దేశాల నుంచి ఎక్కువ మంది వలస పోయేవారు. ఐటీ యుగం రాకతో ఇవి తారస్థాయికి చేరాయి. 1990లో అంతర్జాతీయ వలసదారులు 15 కోట్లు ఉంటే 2024లో ఆ సంఖ్య 30 కోట్లకు చేరుకున్నది. ఇటీవలి దశాబ్దాల్లో ఈ ధోరణి తగ్గుముఖం పడుతున్నది. జాతీయవాదులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వలసదారులను బూచిగా భావించే సంస్కృతి విస్తరిస్తున్నది. దీని ఫలితంగా సంపన్న దేశాల్లో వలస వ్యతిరేక విధానాలు పుట్టుకొస్తున్నాయి.
ప్రపంచం ఇప్పుడు మూలమలుపులో నిలిచింది. వలసల గురించి సహజంగానే పునరాలోచన జరుగుతున్నది. 2026 ఆర్థిక సంవత్సరానికి అమెరికా వీసా దరఖాస్తుల సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం తగ్గినట్టు అమెరికా వలసల విభాగం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు దరఖాస్తుల తిరస్కరణ కూడా భారీగా పెరగడం విశేషం.
దేశంలో అత్యధికంగా విద్యార్థులను అమెరికాకు పంపే తెలంగాణ, ఏపీ రాష్ర్టాల దరఖాస్తుల్లో సగానికి పైగా తిరస్కారానికి గురయ్యాయి. వీసా కోసం లక్షల్లో పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవుతున్నది. దీంతో సంపన్న దేశాలకు వలసపోయి కష్టాలు పడే బదులు ‘జననీ జన్మభూమిశ్చ’ అనుకొని ఇక్కడే ఉండిపోయి ఉపాధి చూసుకుంటే సొంతానికి, దేశానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. ‘మేక్ ఇండియా గ్రేట్’ అనుకొని రూ.5 లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో పాలుపంచుకుంటే మరీ మంచిది.