ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్యనో, ఒక ఆర్థిక సవాలో మాత్రమే కాదు ఇది అధికారం, అహంకారం, అవధులు లేని రాజకీయ ఆరోపణల మధ్య నలిగిపోతున్న ఒక సామాన్య ప్రజా కల. ఈ సంక్షోభం వెనుక అసలు ఎవరిది తప్పు? నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వానిదా, ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వానిదా. నిజానిజాలను నిష్పక్షపాతంగా తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి హైదరాబాద్ పౌరుడిపై ఉన్నది.
2017వ సంవత్సరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మెట్రో ప్రాజెక్టుగా గొప్ప పేరు తెచ్చుకున్నది. మొత్తం 69 కిలోమీటర్ల మేర విస్తరించిన మూడు ప్రధాన కారిడార్లు, 57 అత్యాధునిక స్టేషన్లు లక్షలాది నగర ప్రయాణికుల దైనందిన జీవితాలను, ప్రయాణ సంస్కృతిని పూర్తిగా మార్చేశాయి. కానీ ఆ మెరుపుల వెనుక ఒక చేదు నిజం దాగి ఉన్నది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మించి నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఏటా దాదాపు రూ.600 కోట్ల భారీ నష్టాల్లో కూరుకుపోయింది.
ప్రయాణికుల సంఖ్య అనుకున్న అంచనాలను అందుకోలేకపోవడం, వాణిజ్య అవసరాల కోసం ఆనాడు కేటాయించిన 200 ఎకరాల విలువైన భూమిని సంస్థ నష్టాల వల్ల సమర్థంగా వినియోగించుకోలేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. వీటికి తోడు, కోవిడ్ సంక్షోభ సమయంలో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.3,000 కోట్ల సాఫ్ట్ లోన్‌లో కేవలం రూ.900 కోట్లు మాత్రమే విడుదలైంది. ఫలితంగా ఆర్థిక భారం మోయలేక ఎల్ అండ్ టీ చేతులెత్తేసింది. రెండో దశ విస్తరణ నిర్మాణానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పడమే కాకుండా, మొత్తం ప్రాజెక్టును రూ.20,000 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించి, తమను దీని నుంచి చట్టబద్ధంగా తప్పుకొనేలా చేయాలని కోరింది.
ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. రూ.2,100 కోట్లు ఈక్విటీ రూపంలో భరిస్తూ, దాదాపు రూ.13,000 కోట్ల భారీ అప్పును తమపై వేసుకుంటూ మొదటి దశను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన, కఠినమైన సాంకేతిక నిబంధనను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఫేజ్-1కు సంబంధించిన యాజమాన్య హక్కులను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి చట్టబద్ధంగా, ఆర్థికంగా పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే రెండో దశకు కేంద్ర వాటా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఈ బదిలీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రతిపాదించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇంకా తమకు అధికారికంగా అందలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తుంటే, తాము ప్రతిపాదనలు, పేర్లను ఎప్పుడో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతివాదం చేశారు.
ఇదే క్రమంలో 2026 ఏప్రిల్‌లో లోక్‌సభ వేదికగా రైల్వే మంత్రి స్వయంగా చెప్పిన మాట మరింత ఆందోళనకరం. ప్రాజెక్టు వ్యయం, దేశవ్యాప్త వనరుల లభ్యత కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆమోదానికి కచ్చితమైన గడువు చెప్పడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. జూన్ మధ్య నాటికి ఈ వివాదం మరింత వ్యక్తిగత, రాజకీయ మలుపు తిరిగింది. జపాన్ (జైకా) సంస్థ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఖాతాలో అత్యంత పారదర్శకంగా జమ అయిన రూ.13,600 కోట్ల నిధులను కిషన్‌రెడ్డి కావాలనే రాజకీయ కారణాలతో నిలిపివేయించారని రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కేంద్ర మంత్రులను తాము అనేకసార్లు స్వయంగా కలిసినా ప్రయోజనం లేకపోయిందని, కనీసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్‌రెడ్డికి లేఖ రాయాల్సి రావడం దారుణమన్నారు.
విశ్వనగరంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధిని బీజేపీ కావాలనే అడ్డుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. దీనికి ప్రతిగా బీజేపీ సీనియర్ నాయకులు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి అసలు కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా అసమర్థతేనని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై ఇలాంటి తప్పుడు ప్రచారం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. గత రెండేండ్లలో ముఖ్యమంత్రి ఏకంగా 71 సార్లు ఢిల్లీ వెళ్లారని, అందులో 15 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ఐదుసార్లు, అశ్వినీ వైష్ణవ్‌ను మూడుసార్లు నేరుగా కలిసిన రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి సాయం కోరలేదని, ఇప్పుడు అపాయింట్మెంట్ దొరుకడం లేదని నాటకాలు ఆడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూల అంశాలనే ప్రజల ముందుకు తెస్తున్నాయి. ముందు ఫేజ్-1 బదిలీ, తర్వాతే ఫేజ్-2 నిధులు అనే కేంద్రం పెట్టిన నిబంధన వాస్తవంగా అమల్లో ఉన్నది. అలాగే పార్లమెంటులో కేంద్ర మంత్రి ఆమోద గడువు ఇవ్వలేమని చెప్పిన మాట కూడా రికార్డుల్లో ఉన్నది.
ఢిల్లీ, బెంగళూరు మెట్రో ప్రాజెక్టులకు వర్తింపజేసిన 50:50 భాగస్వామ్య నమూనానే హైదరాబాద్‌కు కూడా వర్తింపజేయాలన్న రాష్ట్ర డిమాండ్ పూర్తిగా న్యాయబద్ధమై నదే. కానీ, జపాన్ నుంచి రావలసిన రూ.13,600 కోట్లను కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఆపేశారు అనే ఆరోపణకు బహిరంగంగా ధృవీకరించదగిన బలమైన ఆధారాలు ఇంకా ఎక్కడా బయటకు రాలేదు.
సవరించిన డీపీఆర్ సమర్పణ, అధికారిక ప్రక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కొంత జాప్యం జరిగింది. సంయుక్త కమిటీ నామినేషన్ల విషయంలో ఇరువైపులా రాజకీయ పట్టింపుల వల్ల ఆలస్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రజలకు ఇది రాష్ట్రం వర్సెస్ కేంద్రం మధ్య జరిగే ప్రతిష్టాత్మక యుద్ధం కాదు ఇది వారి దైనందిన జీవన నాణ్యతకు, కష్టార్జితానికి సంబంధించిన ప్రశ్న. హైదరాబాద్ ప్రజలారా మీరు గొంతు విప్పి ప్రశ్నించాల్సిన సమయమిది. రెండు ప్రభుత్వాలనూ ఒకే వేదికపై నిలబెట్టి జవాబు అడగాలి. ఫైళ్లు ఏ ప్రభుత్వ టేబుల్‌పై ఆగాయి? నిధులు ఎక్కడ చిక్కుకున్నాయి? ఎవరి రాజకీయ అహంకారం వల్ల మన నగరం వెనుకబడుతున్నది? ఆరోపణలు చేసేవారికీ, ఎదురు ఆరోపణలు చేసేవారికీ ఇద్దరికీ సమాన జవాబుదారీతనం ఉండాలి. మెట్రో అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ సొంత ఆస్తి కాదు, అది హైదరాబాద్ పౌరుల ప్రాథమిక హక్కు. ఆ హక్కు సాధన కోసం పాలకులను పౌరసమాజం నిలదీయాలి.
– సూర్యదేవర రామకృష్ణ