బీఆర్ఎస్ ఆరోపించినట్టుగా మేడిగడ్డ 7వ బ్లాకులోని ఒక పియర్ దగ్గర బాంబులతో కంట్రోల్డ్ బ్లాస్ట్ చేసి రెండు పియర్లు కొద్ది అంగుళాలు కుంగేలా దుశ్చర్యలకు పాల్పడ్డ వారి దురుద్దేశం ‘అవినీతికి పాల్పడి నాసిరకంగా మేడిగడ్డను నిర్మించార’ని కేసీఆర్‌పై బురదజల్లడమే. ఈ దుశ్చర్యకు ముహూర్తం కూడా పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9, 2023 తర్వాతే (అక్టోబర్ 21). మేడిగడ్డ పియర్ కుంగుబాటు సహజంగా జరిగిన ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికీ విద్రోహ చర్యే అని చెప్పడానికి పలు అనుమానాలను నీటిపారుదల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
1. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం మొత్తం పోలీసులు, కలెక్టర్ సహా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి అక్టోబర్ 9న ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే అక్టోబర్ 21వ తేదీని మేడిగడ్డలో బ్లాస్ట్ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు.
2. ఒకవేళ మేడిగడ్డ నాసిరకమైన నిర్మాణమైతే 500 ఏండ్ల చరిత్రలో వచ్చిన వరదల రికార్డును అధిగమించి 28.75 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ నుంచి పోటెత్తిన 2022 జూలై 15నే ఆ బ్యారేజీలోని చాలా పియర్లు కుంగాల్సి ఉండె. వరద తక్కువగా ఉన్న సమయంలో 77 గేట్లు మూసి ఉన్న అక్టోబర్ 21న చీకట్లు ముసురుతున్న సాయంత్రం 6.30 గంటలకు ఎలా పియర్స్ కుంగాయి? సహజంగా పియర్ కుంగితే కొన్ని రోజులు లేదా కొన్నిగంటల ముందు నుంచే పెచ్చులూడటం, రేడియల్ గేట్లు, పియర్ మధ్య అలైన్మెంట్ దెబ్బతినడం, పైపింగ్ ఎఫెక్ట్ అంటే దిగువన పెద్ద మొత్తంలో నీరు, ఇసుక బయటకు రావడం వంటి సూచనలు కనిపిస్తాయి.
3. సహజంగా జరిగే ప్రమాదమైతే ఉధృతంగా గోదావరిలో వరద పోటెత్తిన 2022 జూలై 15వ తేదీ రోజు పియర్లు కుంగాలి. అక్టోబర్ 20 ఉదయం 6 గంటల నుంచి 21 ఉదయం 6 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన వరద నీరు 14,930 క్యూసెక్కులు. ఈ మొత్తం వరద నీటిని (14,930 క్యూసెక్కులు) 5, 6వ బ్లాకులోని 8 గేట్ల ద్వారా దిగువకు వదిలారు. 7వ బ్లాకులోని ఏ గేటు కూడా తెరవలేదు. మేడిగడ్డ వద్ద పియర్స్ కుంగిన సాయంత్రం ఆరున్నర గంటలకు 5, 6వ బ్లాకుల్లోని 8 గేట్ల నుంచి 13,100 క్యూసెక్కుల నీరు దిగువకు నదిలోకి ప్రవహించింది. ఆ సమయంలో 7వ బ్లాక్‌పై ఎలాంటి నీటి ఒత్తిడి కూడా లేదు. అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మేడిగడ్డ వద్దనున్న మొత్తం 85కు 85 గేట్లు తెరిచే ఉంచారు. 7వ తేదీ ఉదయం 39 గేట్లు మూసి, 46 గేట్ల ద్వారా వచ్చే వరదను దిగువకు వదిలారు. క్రమంగా వరదలు తగ్గుముఖం పట్టడంతో అక్టోబర్ 21 సాయంత్రం సంఘటన జరిగే సమయానికి 5, 6వ బ్లాకుల్లోని 8 గేట్లు మాత్రమే తెరిచి ఉంచారు.
2023 జూన్ 1 నుంచి అక్టోబర్ 21 మధ్య మేడిగడ్డ బ్యారేజీ గేట్ల ద్వారా సుమారు 1820 టీఎంసీల నీరు గోదావరిలో దిగువకు ప్రవహించింది. ప్రపంచంలోనే అత్యంత ఉధృతంగా వరదలు వచ్చే నదుల్లో గోదావరి ఒకటి. పది, పదిహేను లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ గేట్ల ద్వారా ప్రవహించినా 7వ బ్లాకులోని పియర్స్‌కు ఏ చిన్న నష్టమూ జరగనిది కేవలం 13,100 క్యూసెక్కుల వరదను 5-6 బ్లాకులోని 8 గేట్ల ద్వారా విడుదల చేసినప్పుడు 7వ బ్లాకు మధ్య భాగంలో ఉన్న 19, 20 పియర్లు ఎలా దెబ్బతింటాయి?
4. మేడిగడ్డలో స్టోరేజీ అన్ని గేట్లు (85) మూసివేస్తేనే సాధ్యం. అక్టోబర్ 21న ఈ 8 గేట్ల ద్వారా 13,100 క్యూసెక్కులు (24 గంటలు ప్రవహిస్తే ఒక టీఎంసీకి కొంచెం ఎక్కువ) ప్రవహిస్తుంటే అది స్టోరేజీ ఎలా అవుతుంది? కాబట్టి బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేశారనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలనే దురదృష్టవశాత్తు జస్టిస్ పీసీ ఘోష్ కూడా నమ్మినట్టు ప్రభుత్వం విడుదల చేసిన నోట్ ద్వారా తెలుస్తున్నది. గోదావరిలో పూర్తిగా ప్రవాహాలు తగ్గిన తర్వాతే 85 గేట్లు పూర్తిగా మూసేసి నీటిని నిల్వ చేస్తారు. గేట్లు మూసి నీటిని నిల్వ చేసేది డిసెంబర్ తర్వాతే. నీటి ప్రవాహాలను రెగ్యులేట్ చేయడానికి సుమారు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నప్పుడే 5-6 బ్లాకుల్లో (నది మధ్యలో)ని ఏడెనిమిది గేట్లు తెరిచి మిగిలినవి మూసివేస్తారు. వరద ప్రవాహం 2-3 లక్షల క్యూసెక్కులకు మించి ఉంటే మిగిలిన గేట్లన్నీ తెరుస్తారు. 2019 జూన్ 21 నుంచి సంఘటన జరిగిన నాటివరకు ఇదే పద్ధతిని అనుసరించారు. నాలుగేండ్లలో ఎలాంటి ప్రమాదం జరుగనది అక్టోబర్ 21న చీకట్లు ముసిరే సమయంలోనే అతి తక్కువ వరద ప్రవాహం (13,100 క్యూసెక్కులు) ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? కన్నెపల్లిలో పంప్‌హౌజ్‌లోకి నీళ్లు వచ్చిన రోజు 2022, జూలై 15న డిజైన్ డిశ్చార్జి (28,25,000 క్యూసెక్కులు)కి మించి మేడిగడ్డ వద్ద వరద వచ్చింది. రికార్డు స్థాయిలో (1953 తర్వాత) ఏనాడూ రానంత వరద 28,46,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే ప్రమాదం జరిగి ఉండాల్సింది.
5. పైపింగ్ ఎఫెక్ట్: అంటే రాఫ్ట్ (పియర్స్ కింది బేస్మెంట్)కు దిగువన ఇసుక కదిలి నీటి లీకేజీ ద్వారా దిగువకు కొట్టుకుపోయి పునాది బలహీనపడటం. ఇది సహజంగా ఏ బ్యారేజీ, డ్యాంలోనైనా జరిగేదే. ప్రతి సంవత్సరం ఇలాంటివి కనిపెట్టి వాటిని మూసివేయడానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం పనిచేస్తుంది. పెద్ద ఎత్తున కుంగిన ఈ పియర్ల (19 అండ్ 20) కింద ఇసుక లీక్ అయినట్టు ఏ ఆధారం లేదు. ఇలాంటి లీకేజీలకు ఆస్కారం ఉండొద్దనే షీట్‌పైల్స్‌కు బదులు సముద్రాల్లో పిల్లర్ల ఏర్పాటులో వినియోగించే సీకెండ్ పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో వాడారు. నదిలో గులకరాళ్లతో కూడిన ఇసుకలో షీట్ పైల్స్‌ను దించలేకపోయారు. షీట్స్ వంగి పోవడం వల్ల సీకెండ్ పైల్స్ (బోర్ డ్రిల్లింగ్ ద్వారా) అవసరమయ్యాయి. ఈ విషయాన్ని కూడా జస్టిస్ పీసీ ఘోష్ అర్థం చేసుకోనట్టు ప్రభుత్వ నోట్ ద్వారా వెల్లడవుతున్నది.
ఒకవేళ పైపింగ్ ఎఫెక్ట్ వల్ల ఇసుక కదిలిందని అనుకున్నా 7వ బ్లాకులోని 12వ పియర్ నుంచి 23వ పియర్లలో ఏ పక్క ఇసుక కొట్టుకుపోతే ఆ పక్కన గల పియర్లు కుంగే అవకాశం ఉంది కానీ మధ్యలో ఉన్న 19, 20 పియర్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగవు. ఇవి కుంగాలంటే మొత్తం 7వ బ్లాక్ కిందికి కుంగాలి (12 నుంచి 23 వరకు). మధ్యలో ఉన్న 19, 20 పియర్లు కుంగడమంటే కచ్చితంగా విధ్వంసం జరిగితేనే సాధ్యం. మరొక విషయం ఏమంటే కుంగితే బాంబులు పేలినట్లు శబ్దాలు కిలోమీటర్ల కొద్దీ వినిపించవు, పియర్ నిలువునా చీలదు. ఒక్కసారిగా కుంగడం సాధ్యపడదు. ఒక్కో బ్లాకు 200 మీటర్ల పొడవు, 20.1 మీటర్ల ఎత్తు, రాఫ్ట్ మందం 4 మీటర్లు రెండు పియర్ల మధ్య ఉన్న బే కూడా 20 మీటర్లు ఉంది. రాఫ్ట్ వెడల్పు 110 మీటర్లు (నది ఎగువకు, దిగువకు మధ్య) రాఫ్ట్ 18-20 పియర్స్ మధ్య క్రాక్ ఒక్క మీటర్ లోతు, 18 మీటర్ల పొడవు (రాఫ్ట్‌పై అడ్డంగా) వచ్చింది. ఇంత మందం, వెడల్పు, పొడవు గల రాఫ్ట్ కేవలం కింద ఒక్క దగ్గర లీకేజీ అయితే బీటలు పడి కుంగుతుందా? ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో జరిపిన డై టెస్ట్ (రంగు నీళ్లు)లో ఈ 7వ బ్లాక్ దిగువన కొద్దిగా లీకేజీ కనిపించింది తప్ప, పెద్ద మొత్తంలో ఇసుకేమీ రాఫ్ట్ కింది నుంచి రాలేదు. ఈ లీకేజీ కూడా ఆ బ్లాస్ట్ వల్లనే ఏర్పడి ఉండవచ్చు.
కాబట్టి పైపింగ్ థియరీ తప్పు. కొందరు రిటైర్డ్ ఇంజినీర్లు ఈ మధ్య అభిప్రాయపడుతున్న కేవిటేషన్ థియరీ కూడా నా దృష్టిలో తప్పే. ‘రేడియల్ గేట్స్ నుంచి తక్కువ పరిణామంలో నీటిని వదిలినప్పుడు హైవెలాసిటీ నదికి దిగువ పక్క రావడం వల్ల రాఫ్ట్‌కు బయట గల నదిలో ఆ నీరు దుంకి, ఆ ఒత్తిడి ప్రభావంతో ఇసుక రాఫ్ట్ కింది భాగంపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల రాఫ్ట్ కింది ఇసుక కదిలి పియర్లు కుంగవచ్చని వీరి అభిప్రాయం. దిగువవైపు రాఫ్ట్ పైగల దిమ్మెలు (సిమెంట్ బ్లాక్స్) వెలాసిటీ ఒత్తిడికి కొట్టుకుపోతే ఇలా జరగవచ్చు. కానీ, మేడిగడ్డ వద్ద మొదటి సంవత్సరమే బ్లాక్స్ కొట్టుకుపోయినవి ఒకటవ బ్లాక్ నుంచి 4వ బ్లాకు మధ్యనే. 7వ బ్లాకు వద్ద ఈ దిమ్మెలు భద్రంగానే ఉన్నాయి. బాంబులతో పేల్చితే తప్ప రాఫ్ట్‌పై 18 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు వరకు క్రాక్ రావటమనేది జరగదు.
మేడిగడ్డలో స్టోరేజీ అన్ని గేట్లు (85) మూసివేస్తేనే సాధ్యం. అక్టోబర్ 21న ఈ 8 గేట్ల ద్వారా 13,100 క్యూసెక్కులు (24 గంటలు ప్రవహిస్తే ఒక టీఎంసీకి కొంచెం ఎక్కువ) ప్రవహిస్తుంటే అది స్టోరేజీ ఎలా అవుతుంది? కాబట్టి బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేశారనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలనే దురదృష్టవశాత్తు జస్టిస్ పీసీ ఘోష్ కూడా నమ్మినట్టు ప్రభుత్వం విడుదల చేసిన నోట్ ద్వారా తెలుస్తున్నది.
ఎ. తెలంగాణ వైపు దిమ్మెలు దెబ్బతిన్న 1వ బ్లాకు నుంచి 4వ బ్లాకు మధ్య కాకుండా దిమ్మెలు సురక్షితంగా ఉన్న మహారాష్ట్ర వైపు ఎందుకు పియర్స్ కుంగాయి?
బి. నక్సలైట్లపైకి అనుమానం వచ్చేలా సిరొంచ జిల్లా సరిహద్దు వైపున గల 7వ బ్లాకులో ఈ కుట్ర జరిగింది. అటువైపు అధికారులు, సెక్యూరిటీ ఎవరూ ఉండరు.
సి. ఎవరూ గమనించకూడదనే సూర్యాస్తమయ సమయంలో చీకట్లు ముసురుతుండగా ఈ కుట్ర జరిగింది.
డి. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న విడుదలైంది. పాలనా యంత్రాంగం మొత్తం కేసీఆర్ చేతిలో నుంచి ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పోయిన తర్వాత ఈ కుట్ర జరిగింది.
ఈ. ఇసుకలో పియర్స్, రాఫ్ట్ కుంగితే పెద్ద పెద్ద శబ్దాలు కిలోమీటర్ల కొద్దీ వినిపించవు. బాంబులతో పేల్చితేనే ఈ శబ్దాలు వినిపిస్తాయి. 10 టీఎంసీల అడుగున ఇసుకలోకి రాఫ్ట్ జరిగితే పెద్ద శబ్దాలు వచ్చే అవకాశం లేదు. ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ) ద్వారా నీళ్లలో పియర్స్‌ను బ్లాస్ట్ చేయవచ్చు. 19వ పియర్ రేడియల్ గేట్ల అలైన్మెంట్ వద్ద పెద్ద చీలిక, 20వ పియర్ నిలువు చీలిక బాంబుతోనే సాధ్యం. కుంగితే ఇవి ఏర్పడవు.
ఎఫ్. ‘విధ్వంసం’ జరిగిందనే అనుమానంతో పోలీసులకు 12 గంటల తర్వాత ఇంజినీర్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కూడా ఈ రోజు వరకు కనీసం దర్యాప్తు ప్రారంభించలేదు. ఆ సమయంలో పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కమిటీ, జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఈ ఎఫ్ఐఆర్ను ఎందుకు పట్టించుకోలేదు?
జి. ఉధృతంగా లక్షలాది క్యూసెక్కుల వరదను నాలుగేండ్లు తట్టుకున్న మేడిగడ్డలో ఎన్నికల ప్రచారంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణ చేసిన కొద్దిరోజుల్లోనే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? డిజైన్ లేదా పర్యవేక్షణ లేదా నిర్మాణ లోపమైతే మూడు బ్యారేజీల్లోని 225 పియర్లలో రెండు మాత్రమే ఎందుకు కుంగుతాయి?
పైన నేను పేర్కొన్న అనుమానాలపై లోతుగా విచారణ జరపడానికి టెక్నికల్ ఎంక్వయిరీ కమిటీని విదేశీ నిపుణులతో నియమించి నిజానిజాలు వెల్లడించే వరకు దీన్ని కుట్రలాగే ప్రజలు భావించాలి.