‘ఆపరేషన్ కగార్’ కాల్పుల విరమణను కోరుతూ మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనకు భిన్నంగా ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ‘శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ’ పేరిట వచ్చిన ఆ ప్రతిపాదనలో గమనార్హమైన విశేషం ఒకటున్నది. శాంతిచర్చలు జరగవలసింది తమకు, ప్రభుత్వానికి మధ్య అన్నది మావోయిస్టుల వైఖరి కాగా, వారితో మాత్రమే కాదని, ఆదివాసీలతో, పౌరహక్కుల వారితో కూడానని ఈ కమిటీ కోరుతున్నది. ఈ మాటల అర్థ తాత్పర్యాల్లోకి వెళ్తే మనకు అనేకం కన్పిస్తాయి.
ఆ చర్చలోకి వెళ్లేముందు కొన్ని మాటలు చెప్పుకోవాలి. కమిటీ వారు తమ లేఖను కేంద్ర ప్రభుత్వానికి గాక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాశారు. కాల్పుల విరమణ కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని, ఈ విషయం ‘ఇండియా’ కూటమిలోని పార్టీల దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ఏమి చేయగలరో వేచి చూడవలసి ఉంటుంది. కమిటీ లేఖలో కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రస్తావనలు మాత్రమే లేవు. ‘దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్న దోపిడీ, భూముల స్వాధీనం, ప్రజా సమస్యల పట్ల వ్యవస్థల నిర్లక్ష్యం, తదితర కారణాల వల్ల ఈ విపత్కర పరిస్థితి తలెత్తటం’ అనే ముఖ్యమైన మాట ఉన్నది. అదేవిధంగా, ‘ఆదివాసీల రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూ జైలుపాలైన ఆదివాసీ నేతలు, ఇతర హక్కుల నేతల’ గురించి కూడా పేర్కొన్నారు.
నక్సలిజం విషయం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు గల కారణాలు, చరిత్ర చాలా ఉన్నాయి. అది తేలికగా తేలేది కాదు. కేవలం కాల్పులు, వాటి విరమణలకు పరిమితమైనది కాదు. ఇదంతా రాయటం ఎందుకంటే, ఆదివాసీ ప్రాంతాల్లో ‘దశాబ్దాలుగా’ జరుగుతున్నదంటున్న దానిలో ఆరంభ పాత్ర, దీర్ఘకాలపు పాత్ర మల్లికార్జున ఖర్గే పార్టీది. అందువల్ల కమిటీ వారు సమస్యను ఆ పార్టీ దృష్టికి తీసుకుపోరాదని అనటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర తప్పదు.
కానీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తూనే, మరొకవైపు అసలు నక్సలిజానికి కారణాలు? తాము పాలించిన దశాబ్దాల కాలంలో వాటి పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు? వాటి నికర ఫలితాలు? ఆ ఉద్యమం అణచివేతకు స్వయంగా తాము తీసుకున్న చర్యలు ‘ఆపరేషన్ కగార్’కు ఏ విధంగా భిన్నమైనవి? నక్సలిజం సమస్య పరిష్కారానికి తమతో పాటు తమ ‘ఇండియా’ కూటమి మిత్రుల సమగ్రమైన విధానం ఏమిటి? దానిని తాము పాలిస్తున్న రాష్ర్టాలలో అమలుపరచగలరా? ఒకవేళ భవిష్యత్తులో కేంద్రంలో అధికారానికి వచ్చినట్టయితే ఆ విధానం కొనసాగించగలరా? ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వానికి ఆ కోణం నుంచి చేయగల ప్రతిపాదనలేమిటి? అనేవి కూడా చర్చించి ఒక విధానం రూపొందించి, ఆదివాసీలకు, తక్కిన దేశానికి వివరించటం అవసరం. అప్పుడు, కాంగ్రెస్ పార్టీ వెనుకటి రికార్డు ఎట్లున్నా, భవిష్యత్తు గురించి, వారి విధానాలపై, నిజాయితీపై దేశం చర్చించి అర్థం చేసుకునేందుకు, వారిని నమ్మాలో లేదో తేల్చుకునేందుకు వీలు కలుగుతుంది.
లేనట్టయితే, ఏఐసీసీ అధ్యక్షుడు అనేకానేక ఇతర విషయాలలో వలెనే ఈ కమిటీ అంశంలో నూ కేంద్ర ప్రభుత్వానికి ఒక మొక్కుబడి లేఖ రా సి చేతులు దులుపుకోవటం అవుతుంది. ఇంత కూ కమిటీ వారు ఆయనకు నేరుగా కాక బహిరంగ లేఖ రాసినందున, అది ఆయన పట్టించుకునేది లేనిదీ తెలియదు. లేక, కమిటీ వారు ఆ లేఖ ను తనకు నేరుగా కూడా పంపుతారేమో తెలియ దు. అదెట్లా జరిగినా, పైన అనుకున్నట్టు, కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వానికి లేఖ రాస్తూనే, పైన పేర్కొన్న విధానపరమైన స్పష్టతలు ఇవ్వటం అవసరం. లేనట్టయితే, తాము రాష్ర్టాల లో, కేంద్రంలో పాలించిన ప్రతిసారీ ఆదివాసీల పీడన, అణచివేత కొనసాగినట్టు, మున్ముందు కూ డా ఆ పనిచేయబోరన్న కనీసపు ఆశాభావమైనా ఆదివాసీలకు, తక్కిన సమాజానికి కలుగబోదు.
కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న కొరత ఒకటున్నది. ఇందులో స్వయంగా ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కనిపించటం లేదు. వారి కోసం కృషిచేసే మైదాన ప్రాంతాల వారు మాత్రం అనేకులున్నారు. ప్రస్తుత కో ఆర్డినేషన్ కమిటీ ఆదివాసీ గ్రూపులు, ఆదివాసీ నేతలు అంటూ మాట్లాడటం బాగున్నది గాని, ఆ లేఖ సంతకందార్లలో ఆదివాసీలు కనిపించరు. ఇతరత్రా స్వయంగా ఆదివాసీలు కొన్ని చిన్న బృందాలుగా ఏర్పడి ఈ చర్చలలో పాల్గొంటున్నారు. అది ఆహ్వానించదగినది.
కానీ, అవి ప్రాచుర్యం లేని చిన్న గ్రూపులు అయినందున ఎవరి దృష్టికి రావటం లేదు. మావోయిస్టు పార్టీ తనదే సర్వాధిపత్యం అనుకుంటుంది గనుక, ఆదివాసీలను అనుచరులుగా మాత్రమే చూస్తుంది గనుక, తమ అనుబంధ పౌరహక్కుల సంస్థలలోనూ వారిని ముందుకు తీసుకురాకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, మైదాన ప్రాంత మేధావులు కూడా ప్రస్తుత కో ఆర్డినేషన్ కమిటీ తరహాలో వారికి చోటు కల్పించరు.
కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న కొరత ఒకటున్నది. ఇందులో స్వయంగా ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కనిపించటం లేదు.
మరొక స్థాయిలో మాట్లాడాలంటే, ఆదివాసీ సమాజాలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, ఎంతో కొంత సంపన్నులు అయినవారి సంఖ్య తక్కువేమీ కాదు. నక్సలిజం, దాని అణచివేతలు మొదలై సాగుతున్న ఐదున్నర దశాబ్దాల కాలంలో తమ సమాజాన్ని కాపాడుకునేందుకు వారు చేసినదేమిటనేది వేరే విషాద చరిత్ర. అదే స్థితి ‘ఆపరేషన్ కగార్’ సందర్భంలోనూ కనిపిస్తున్నది. ఎప్పుడూ వినిపించని ఆదివాసుల గొంతు ఇప్పుడూ వినిపించటం లేదు. ఎవరూ వినిపించనివ్వటం లేదు. అందరికీ వారు ఒక ఇంధనం మాత్రమే.
ఇంతకూ మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణను కోరుతున్నది ఎందుకోసం? ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ఈ గండం గడిచి గట్టెక్కేందుకా లేక, ఒకవేళ మోదీ ప్రభుత్వం నిజంగానే కాల్పులు విరమించి చర్చలకు ఆహ్వానిస్తే భవిష్యత్తుకు సంబంధించి అజెండా ఏమైనా ఉన్నదా? తమ అజెండా రాజ్యాంగపరమైన పరిపాలన, సంస్కరణల పరిధిలో ఉండి అందుకు ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యమ విరమణగా ముగుస్తుందా? ఆయుధాలను వదలటమవుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయుధాలకు తావులేదన్న వాదన ప్రభుత్వం నుంచి వస్తే ఏం చేస్తారు? అట్లాగాక, తమ అజెండాలో ప్రస్తుత రాజ్యాంగాన్నీ, వ్యవస్తనూ అంగీకరించబోము, కనుక ఆయుధ విరమణ ఉండదు, కాల్పుల విరమణ మాత్రమే అన్నది అజెండా అవుతుందా? ప్రస్తుతం తమ వైపు నుంచి ఆరు నెలలు ప్రకటించింది కాల్పుల విరమణే గాని ఆయుధాలు పక్కనపెట్టడం కాదు, విసర్జించటమూ కాదు.
అటువంటి స్థితిలో, ప్రస్తుతం పూర్తి పైచేయిగా ఉన్న ప్రభుత్వం కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరిస్తుందసలు? పోరాట విరమణ జరుగదు, కాల్పుల విరమణ మాత్రమే అంటే అమిత్ షా ఒప్పుకొంటారా? రాజ్యాంగం, చట్టాల అమలు గురించి మాట్లాడటం ఒక పరిధి విషయం. అది ఎవరు ఎంతైనా మాట్లాడవచ్చు. కానీ రాజ్యాంగాన్ని, వ్యవస్థను నిరాకరించటమనే సిద్ధాంతం మౌలికంగా భిన్నమైనది. ఆ విషయమై ఏమి మాట్లాడుతారు? మేము నిరాకరిస్తాము, మీరు మాత్రం కట్టుబడండి అంటూ చేసే సూత్రీకరణలు మేధోపరంగా బాగానే ఉంటాయి. కాని వారే అనే ‘బూర్జువా, దోపిడీ వ్యవస్థ’ అందుకు అంగీకరిస్తుందనుకోవటం, ఆ ప్రకారం రకరకాల చతురమైన తార్కిక వాదనలు చేయటం పూర్తి అవాస్తవికమైన బలహీనత. ముందు కాల్పులు విరమించండి, రాజ్యాంగ విషయాలు, ఇతర విషయాలు తర్వాత కూర్చుని మాట్లాడుకోవచ్చుననటం తమ అమాయకత్వమైనా కావాలి, హోంమంత్రి అమిత్ షా అమాయకుడని భావించటమైనా కావాలి. పైగా ప్రభుత్వంతో తాము సమాన స్కంధ స్థితిలో ఉన్నామనే అవాస్తవిక, స్వీయ భ్రమాత్మక ధోరణి కూడా మావోయిస్టుల ప్రకటనలలో కనిపిస్తున్నది. అటువంటి టేబుల్ కేంద్రం- నాగాల చర్చల వంటి సందర్భాలలో చూశాం. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలంలో చూశాం.
ప్రస్తుతం పరిస్థితి మోదీ పాలనలో పలు విధాలుగా మారింది. పార్టీ కూడా అనేక విధాలుగా బలహీనపడింది. కనుక సమాన స్కంధత లేదు. మరొకవైపు ఆదివాసీల సమస్య తీవ్రత మారలేదు. వారి సమస్యలు, పార్టీ వైఫల్యాలు, కేంద్రం తీవ్ర వైఖరి అనే మూడింటి మధ్య చిక్కుకొని ఆదివాసీలు అనునిత్యం బలవుతున్నారు. వ్యవస్థకు బలి కావటం ఒకటైతే, కనీసం ఇటీవలి సంవత్సరాల విఫల ఉద్యమానికి బలి కావటం మరొకటిగా ఉంది.
కో ఆర్డినేషన్ కమిటీ తన లేఖలో, ఆదివాసీలను చర్చల్లో భాగస్వాములు చేయాలనే ప్రతిపాదనను తెచ్చి మంచిపని చేసింది. కాల్పుల విరమణ ఒక కోణమైతే, అంతకన్న అనేక రెట్లు ముఖ్యంగా, ఆదివాసీలు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులు, వారికోసం కృషిచేస్తున్న మైదాన ప్రాంతాల ప్రముఖులూ మావోయిస్టు పార్టీకి సమాంతరంగా సమస్యలపై విడిగా ఒక అజెండాను, ఒక ఉమ్మడి బలమైన వేదికను రూపొందించుకొని గరిష్ఠ స్థాయిలో సాధించుకునేందుకు ప్రయత్నించగలిగితే ఉపయోగం ఉండగలదు. నక్సలైట్ ఉద్యమం ఒక దశ వరకు తన పోరాటాల ఒత్తిడితో ప్రభుత్వాల నుంచి ప్రజల కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా తగినన్ని సాధించిన మాట నిజం. కానీ, వివిధ కారణాల వల్ల ఆ దశ గడిచిపోయిందని గుర్తించాలి.
– టంకశాల అశోక్