తెలంగాణ ఆర్టీసీలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్దఎత్తున సమ్మె జరిగింది. ఆ సమ్మె పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మార్పణం చేసుకోవడం ప్రజలను ఎంతగానో కదిలించింది. దాంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం హడావుడిగా కార్మికులతో సమ్మె విరమణ ఒప్పందం కుదుర్చుకున్నది. అందులో ప్రధానమైన డిమాండ్లకు ఇప్పటికీ అతీగతీ లేదు. కార్మిక సంఘం ఎన్నికల ఊసే లేదు.
విలీనం ప్రక్రియ కమిటీల కాలయాపనతో ఎక్కడి గొంగడి అక్కడే అనేట్టుగా ఉండిపోయింది. మహాలక్ష్మీ ఉచిత టికెట్ల సొమ్ము చెల్లింపు రేపూ మాపు అంటూ సాగిపోతున్నది. బకాయిలు వేల కోట్లలో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆర్థిక వెసులుబాటు కోసం వెయ్యికండ్లతో ఎదురు చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో సర్కార్ తక్షణ సహాయం అందించి ఒడ్డున పడేసేందుకు బదులుగా, ఉన్న ఆదాయ వనరులను ఊడగొట్టేందుకు సమకట్టడం విడ్డూరం. నక్కలు బొక్కలు వెదుకును అన్నట్టుగా ప్రభుత్వం తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా అని వెతకడంలోనే నిమగ్నమైందనేది నికరమైన వాస్తవం.
నెలకు రూ.9-10 కోట్లు, ఏడాదికి రూ.110 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూర్చే కార్గో వ్యాపారం పాలక పెద్దలకు బంగారుబాతులా కనిపించడంలో వింతేమున్నది? గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ సంస్థలకు, అదీ కారుచౌకగా కట్టబెట్టిన వార్త గుప్పుమన్నది. ఏటా రూ.111 కోట్ల వరకు ఆదాయాన్ని ఇచ్చే విభాగాన్ని ప్రైవేట్‌కు.. అందులో నాలుగో వంతుకే, అంటే రూ.36 కోట్లకే అప్పనంగా అప్పగించడం ఏ రకం విజ్ఞత అవుతుంది? 10-15 ఏండ్లపాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు లోపల్లోపల ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఈ లోపాయికారీ ఒప్పందం వెనుక మంత్రులు తమ స్వప్రయోజనాల కోసం చక్రం తిప్పినట్టు సమాచారం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ ఒప్పందంతో సంస్థకు ఆర్థిక నష్టం మాత్రమే కాదు.. సిబ్బందికి పని నష్టం కూడా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. పైగా సుమారు 500 మందికి పైగా హమాలీలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రైవేట్ ఏజెంట్లకూ అన్యాయం జరుగుతుంది.
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కీలక చొరవల్లో కార్గో ఒకటి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అస్తవ్యస్తంగా నడుస్తున్న కార్గో వ్యవస్థ దుమ్ము దులిపి ఆర్టీసీ చేతికిచ్చారు. 2020 జూన్ 19న ఆర్టీసీ కార్గో సేవలు మొదలయ్యాయి. 11 వేల రూట్లలో అన్ని జిల్లా మండల కేంద్రాలు, గ్రామాలతో కూడిన ఆర్టీసీ నెట్ వర్క్ ద్వారా కార్గో, కొరియర్ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత కాలంలో పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు ఈ సేవలను విస్తరించారు. వార్షిక ఆదాయం క్రమంగా రూ.100 కోట్ల పైచిలుకుకు చేరింది. సరసమైన ధరలకే నమ్మకమైన, నాణ్యమైన సేవలందించడంతో ప్రజలు కూడా ప్రైవేట్ కొరియర్ సంస్థల కన్నా ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రాకతో కథ మారిపోయింది. నిర్వహణ మందగించి, ఆదాయం నానాటికీ తగ్గిపోయింది.
2023-24లో అత్యధికంగా రూ.111 కోట్ల ఆదాయం రాగా 2024-25లో రూ.90 కోట్లకు తగ్గిపోయింది. ఆ తర్వాత మరింత పడిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం 2025 డిసెంబర్ 31 నాటికి రూ.471.4 కోట్లు కార్గో ఆర్జించింది. వ్యవస్థలో లోపాలను చక్కదిద్ది ఆర్టీసీకి మరింత ఆదాయం సంపాదించి పెట్టే బదులుగా కార్గో వ్యాపారాన్నే ప్రైవేట్ పరం చేయాలని చూడటం దారుణం. పైగా సదరు ప్రైవేట్ సంస్థకు మిగిలే లాభం కంటే ఎక్కువగా ఆర్టీసీకి చెల్లిస్తుంది అన్నరీతిలో అధికారులు వివరణ ఇచ్చుకోవడం విడ్డూరంగా కనిపిస్తున్నది. ఏదీ ఏమైనా నెలకు కేవలం రూ.3 కోట్లు చెల్లించేలా అన్యాయపు ఒప్పందం చేసుకున్న సంస్థ వెనుక ఎవరెవరున్నదీ బయటపెట్టాల్సిందే. ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్గో ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేసి ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ జరిపించాలి. లేదంటే కార్మికపక్షాల నుంచి పెద్దఎత్తున తిరుగుబాటు పరిస్థితులు తలెత్తడం ఖాయం.