ఈ నెల 4వ తేదీ నాటి పత్రికలలో ఒక శీర్షిక చాలామందిని ఆకర్షించి ఉంటుంది. అది, ‘జైలా, బెయిలా తేల్చుకోండి’ అన్నది. ఆ ప్రకటన చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అంతకుముందు 3వ తేదీన తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ అవినీతి ప్రస్తావన చేశారు. అవినీతిపరులపై చర్యలకు తాను కట్టుబడి ఉన్నానంటూ, దేశంలో అవినీతిపరులకు రెండే అవకాశాలున్నాయని, వారు జైలా, బెయిలా అనేది తేల్చుకోవాలని సూచించారు.
అయితే, అవినీతిపరులని భావించేవారికి మూడో అవకాశం కూడా ఉందని చెప్పటం ఆయన మరిచిపోయినట్టున్నారు. అది, బీజేపీలో చేరటం. సదరు అవకాశం స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటిదే. దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలకు గురై, ఈడీ, సీబీఐ, ఐటీ కేసులను ఎదుర్కొంటున్న అనేకులు బీజేపీలో చేరగానే ఏ విధంగా కేసుల నుంచి విముక్తి పొందుతున్నారో, లేదా పార్టీకి భారీగా ఎన్నికల బాండ్లను సమర్పించుకోగానే కేసుల ఒత్తిడి లేకుండాపోతున్నదో చూపే పరిశోధనాత్మక కథనాలు వరుసగా వెలువడుతున్నాయి. ఈ మూడో అవకాశం ఎట్లాగూ అందరికీ తెలిసిందే గనుక తాను మళ్లీ ప్రత్యేకంగా ప్రకటించటం ఎందుకని ఆయన ఊరుకున్నట్టున్నారు.
BJP | బహుశా అది కూడా నిజం కాకపోవచ్చు. జైలా, బెయిలా తేల్చుకోండి అని ప్రత్యక్షంగా హెచ్చరించటంలోని పరోక్ష ఉద్దేశం.. ‘మీకు మూడో అవకాశం కూడా ఒకటున్నది, అదేమిటో మీకు తెలుసు, కనుక దానిని ఎంపిక చేసుకొని సుఖంగా ఉండండి’ అని చెప్పటం మోదీ వంటి వ్యూహకర్త పరమోద్దేశం అయి ఉండాలి. అవినీతిపరులు జైలుకు పోయినా, లేక బెయిల్ పొందినా బీజేపీకి కలిగే లాభం ఏమున్నది గనుక. అవినీతి నిర్మూలన, అవినీతిపరులకు శిక్షలు మోదీ ఉద్దేశం అయి, అందుకాయన నిజంగానే కట్టుబడి ఉంటే తన పరిపాలనా పద్ధతి మరొక విధంగా ఉండేది.
ఆయన 2014లో జాతీయ రాజకీయాలలో ప్రవేశించి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేసినప్పుడు చేపట్టిన ప్రచారాంశాలలో ఒకటి అవినీతిని అరికట్టడం. అప్పుడాయన ఎక్కడికి వెళ్లినా సభలలో ‘న ఖావూంగా, నా ఖానే దూంగా’ (తినను, తిననివ్వను) అని దృఢంగా ప్రకటిస్తూ దేశ ప్రజలకు వాగ్దానం చేసేవారు. ఆ మాట ప్రజలను బాగా ఆకట్టుకోవటానికి ఒక కారణం ఉంది.
అంతకుముందు 2004 నుంచి 2014 వరకు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై, యూపీఏ భాగస్వామ్య పక్షాలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనులు, 2జీ స్పెక్ట్రం కుంభకోణాల వంటివి మన్మోహన్సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. వ్యక్తిగతంగా ప్రధాని మన్మోహన్ నీతిపరుడని చెప్తూ, ఆ ప్రతిష్ట పేరుతో ఆయన ప్రభుత్వ అవినీతిని కప్పిపెట్టజూశారు గానీ అది ప్రజల దృష్టిలో చెల్లుబాటు కాలేదు. బోఫోర్స్ కేసు సందర్భంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వ్యక్తిగతంగా దోషి కాదనే వాదన ఎట్లాగైతే కాంగ్రెస్‌ను కాపాడలేకపోయిందో, ఈసారి కూడా అదే జరిగింది.
ఇటువంటి నేపథ్యాల మధ్య 2014లో మోదీ ఇచ్చిన ‘న ఖావూంగా, న ఖానే దూంగా’ అనే ఆకర్షణీయమైన నినాదాత్మక హామీ ఓటర్లపై చాలా ప్రభావం చూపింది. ఆ తర్వాత కాలానికి సంబంధించి వివరమైన చర్చలోకి ఇక్కడ వెళ్లలేము గానీ, కొన్ని విషయాలను పేర్కొనాలి. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలలో 2015లో మన అవినీతి ర్యాంకింగ్ 61 కాగా, 2022లో 85కు, 2023లో 93కు పతనమైంది. ఇవి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లెక్కలు.
దేశ ప్రజలకు మోదీ చేసిన ఒక ఆకర్షణీయమైన వాగ్దానం స్విట్జర్లాండ్‌తో సహా ఇతర దేశాలలోని రహస్య బ్యాంకు ఖాతాలలోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి భారతీయుని ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేయగలనని. అది జరుగకపోగా ఇప్పుడా ప్రస్తావన అయినా చేయటం లేదు. ఆ నల్లధనం ఇంకా పెరిగిపోతున్నదని, మారిషస్ వంటి రూట్లలో దానిని ఇక్కడికి తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారని, ఇటువంటివారితో బీజేపీకి సంబంధాలున్నాయని విమర్శకుల ఆరోపణ.
టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలో చేరిన ఒకరిపైనా ఈ ఆరోపణలు ఉండటం తెలిసిందే. బీజేపీలో చేరగానే ఆ కేసులు ఏమైనదీ తెలియదు. ఇది చాలదన్నట్టు, తమ రూ.15 లక్షల వాగ్దానం కేవలం ఎన్నికల మాట అని సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా ఆ తర్వాత ప్రకటించారు. ఇక, పెద్దనోట్ల రద్దుతో అవినీతి సొమ్ము అంతా బయటకు రాగలదనే వాదన ఒట్టి బోగస్‌గానే తేలటం తెలిసిందే. మరొకవైపు ఈ కాలమంతా బీజేపీ ఆశ్రిత పెట్టుబడిదారుల సంపదలు ఎంత శరవేగంగా పెరుగుతూ వస్తున్నాయో కూడా తెలిసిందే.
అవినీతిపై ప్రధాని మోదీ గత పదేండ్లుగా సాగిస్తూ వస్తున్న పోరాట చరిత్రకు ఇవి కొన్ని మచ్చుతునకలు. ఇటువంటి మహత్తర పోరాట నేపథ్యం నుంచి ఆయన ‘జైలా, బెయిలా’ హెచ్చరికను చూడవలసి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు మనసుకు వస్తాయి. ఒకటి, దర్యాప్తు సంస్థల నుంచి అవినీతి కేసులు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసులు రద్దు కావటం, లేదా దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పడిపోవటం. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. అవి అనేక పత్రికలలో వస్తున్నవే కూడా. అయినప్పటికీ 3వ తేదీ నాటి ప్రధానమంత్రి ప్రతిజ్ఞతో ఒక సందర్భం వచ్చినందున మరొకమారు చెప్పుకొందాం.
రెండవది, ఎన్నికల బాండ్లు. ఇటీవల సుప్రీంకోర్టు ఆ చట్టాన్నే రద్దు చేయటంతో పాటు, వరుస ఉత్తర్వులతో స్టేట్‌బ్యాంక్ మెడలు వంచి దారికి తెచ్చేవరకు రహస్యంగా సాగిన ఆ లావాదేవీలలో బీజేపీ ఏ విధంగా లాభపడిందో కనీసం ఒక మేరకు దేశం గమనించింది. అన్ని వివరాలకు సంబంధించిన పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వం 2017లో ఆ పథకాన్ని తెచ్చినప్పుడు చెప్పినమాట, రాజకీయ పార్టీలకు కంపెనీలు గానీ, వ్యక్తులు గానీ ఇచ్చే విరాళాలు ఇక పారదర్శకంగా ఉండగలవని. అవినీతి చోటుచేసుకోబోదని. కానీ అందుకు విరుద్ధంగా అంతా రహస్యంగానే సాగటం ఒకటైతే, ఏ విధంగా కంపెనీలను, వ్యక్తులను బెదిరించి, కేసులను ఒక ఆయుధంగా ప్రయోగించి, కాంట్రాక్టులను సాధనాలుగా ఉపయోగించి బాండ్లు సంపాదించారనేది రెండవది. ఈ చీకటి కోణాలపై పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి.
విషయం ఏమంటే, ఇటువంటి పచ్చి అవినీతి వ్యవస్థకు అధ్యక్షుడైన మోదీ.. జైలా, బెయిలా చెప్తూ, అవినీతిపరులకు గల అవకాశాలు రెండేనని, తాను అవినీతిని ఎంతమాత్రం సహించబోనని, అవినీతిపరులపై చర్యలు తీసుకొని తీరగలనని భీకరమైన ప్రకటనలను అలసట లేకుండా, విన్నవారు ఏమనుకోగలరన్న భీతి లేకుండా చేస్తున్నారు. బాండ్ల సొమ్ము బీజేపీకి ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు ఎంతవచ్చింది, అందుకు గల సందర్భాలు ఏమిటనే వివరాలు ఇప్పటికే అనేకం బయటకువచ్చాయి. పరిశోధనలు పూర్తయి అంతా తెలియవచ్చినప్పుడు, బీజేపీ నీతి ప్రవచనాలు, ఆచరణల గురించి దేశం మరింత తెలుసుకోగలదు.
ఇటువంటిదే ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు, బీజేపీలో చేరికలు, తదనంతరం కేసు మాఫీల ఉదంతం. ఇది ‘వాషింగ్ మెషిన్’ తంతుగా కూడా పేరుగాంచింది. ఈ వివరాలు ఇటీవల వెల్లడవుతున్నవే అయినా, ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తాజా కథనాన్ని చూడండి. దాని ప్రకారం.. మోదీ మనకు నీతి పాఠాలు చెప్పి అధికారానికి వచ్చిన 2014 నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నాయకులలో 25 మంది బీజేపీలో చేరగా, అందులో 23 మందికి విముక్తి లభించింది. వారిలో అజిత్ పవార్, హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, సీఎం రమేశ్, నవీన్ జిందాల్, దిగంబర్ కామత్, ఛగన్ భుజ్‌బల్, అశోక్ చవాన్, తాపస్ రాయ్, సుజనా చౌదరి, ప్రఫుల్ పటేల్, బీఎస్ బొమ్మై, శివరాజ్‌సింగ్ చౌహాన్, నారాయణ రాణే, జనార్దనరెడ్డి, పెమా ఖండూ వంటి హేమాహేమీలున్నారు.
మరొక విశేషం చూసి ఆశ్చర్యపోకండి. ఆర్థిక సంబంధమైన నేరాల దర్యాప్తులు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తాయి. ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె కొద్దిరోజుల కిందట ఒక ఇంగ్లీష్ చానల్ అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. అవినీతి ఆరోపణలు ఉన్నవారైనా, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నవారైనా, ఎవరినైనా సరే తమ పార్టీలోకి స్వాగతిస్తామని ప్రకటించారు. ఈ ప్రశ్నలను పదేపదే వేసినా కూడా ఆమె అదే సమాధానాన్ని ఎంతో నిశ్చలంగా, దృఢంగా చెప్పారు. అది విన్నవారికి ఊపిరి బిగపట్టి నమ్మశక్యం కానట్టు తోస్తే అది ఆమె బాధ్యత కాదు. ఆ విధానం తనది కాదు గనుక. ఆ విధానం జైలా, బెయిలా తేల్చుకోండి అని నిందితులను హెచ్చరిస్తూ, ఈ రెండు మార్గాలే కాదు, మూడవది కూడా ఉంది సుమా అనే సుస్వాగత సూచనలు చేసేవారిది.
– టంకశాల అశోక్