కాంగ్రెస్ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. రైతులకు అండగా నిలిచిందెవరో తేల్చుకుందామంటూ జూలై 4 నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో రేవంత్ సవాల్ చేశారు. పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించడానికి కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి, నరేంద్ర మోదీ.. ఎవరైనా సరే తాను సిద్ధమని ప్రకటించారు. కానీ, చర్చకు మాత్రం సీఎం సహా ఎవరూ వెళ్లలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్ వెంటనే స్పందించింది. ‘8వ తేదీ ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తా. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం’ అని ఆ పార్టీ నేత కేటీఆర్ ప్రకటించారు. అన్నమాట ప్రకారం కేటీఆర్ సమయానికి ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. ఆ రోజు సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు బదులుగా మంత్రిమండలి నుంచి ఎవరూ ప్రెస్ క్లబ్‌కు పోలేదు. అయితే, దీనిపై మంత్రులు స్పందించారు. కేసీఆర్‌కు సవాలు విసిరితే కేటీఆర్ వచ్చారని ఒకరు, చర్చ అసెంబ్లీలో అంటే ప్రెస్ క్లబ్‌కు ఆహ్వానించారని మరొకరు అన్నారు.
ఒక విషయంపై చర్చించడానికి అసెంబ్లీయే వేదిక కానవసరం లేదు. ఇరుపక్షాలు వివరంగా మాట్లాడుకోవడానికి, రైతులకు ఎవరేం చేశారో తేల్చడానికి అనుకూలమైన స్థలం సరిపోతుంది.
ఇక అసెంబ్లీ విషయానికొస్తే ఆ సమావేశాలకు నియమావళి ఉంటుంది. పాలకపక్షం చేతుల్లో దాని పగ్గాలుంటాయి. సంఖ్యాబలంతో అసలు విషయం పక్కకుపోతుంది. ‘అసెంబ్లీలో చర్చిద్దామంటే సమయానికి కోత పెడుతున్నారు. మా మైకులు కట్ చేస్తున్నారు. అందుకే ఓ బహిరంగ వేదికే ఈ చర్చకు అనుకూలమైంది’ అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతులకు తాము నిజంగానే మేలు చేస్తే వేదిక కరెక్టు కాదనే సాకు చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకొనే అవసరమే లేదు. ప్రెస్ క్లబ్‌కు ప్రభుత్వం తరఫున ఎవరూ రాకపోవడం వల్ల ఈ సవాలుపై బీఆర్ఎస్దే పైచెయ్యి అయింది. దాన్ని సరిదిద్దేందుకు రేవంత్ నోరు విప్పి తాను సవాలు విసరలేదు, చర్చకు రమ్మన్నానని చెప్పారు. ఆయన ఆ సభలో మాట్లాడిన జోరును, తీరును ఎవరైనా సవాల్ అనుకుంటారు కానీ, చర్చకు ఆహ్వానంగా భావించరు. తాను క్లబ్బు, పబ్బులకు వ్యతిరేకమని సీఎం ప్రకటించడం విడ్డూరం.
విచిత్రమేమంటే.. రేవంత్‌ను కేటీఆర్ ఆహ్వానించింది పేకాట క్లబ్బుకు కాదు, ప్రెస్ క్లబ్‌కు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు కేంద్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అందులో మేధావులు కూడి వివిధ సామాజిక సమస్యలపై చర్చలు, తీర్మానాలు చేస్తుంటారు. క్లబ్ అనే పదానికి ఒక ప్రత్యేక అవసరానికి అంకితమైన సమూహమని నిఘంటువులో అర్థముంది. పేకాట క్లబ్బులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ను పోల్చి, దాన్ని అవమానించే రీతిలో ఉన్న మాటలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోని సంజాయిషి చెప్పాలి. క్లబ్బుల్లో కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా అసెంబ్లీలో చర్చించాలని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేద్దామనడం వింతగా ఉంది.
నిజానికి తమ పాలనలో రైతులకు మేలు జరిగిందని రుజువు చేసుకోవడానికి కాంగ్రెస్ వద్ద ఎలాంటి అస్ర్తాలు లేవు. రైతుల సంక్షేమ పథకాల్లో నగదును పెంచిన కాంగ్రెస్ ఇప్పుడు తెలివిగా తప్పించుకుంటున్నది. నగదును పెంచి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఈ ట్రిక్కు ఉపయోగించి గత ప్రభుత్వం కన్నా తక్కువ మొత్తాన్నే రైతులకు అందజేస్తున్నది. లెక్కలను మాత్రం గొప్పగా ప్రచారం చేస్తూ బుకాయిస్తున్నది. సగం పంక్తికే భోజనాలు పెట్టి గిన్నెలు బోర్లేసి బ్రహ్మాండమైన విందు ఇచ్చామని దబాయించినట్టుంది కాంగ్రెస్ వైఖరి. రైతులకు రైతుభరోసా, రైతు బీమా, గిట్టుబాటు ధర, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని సీఎం అంటున్నారు. నిజంగా అంత సొమ్ము ప్రజల చేతుల్లోకి వెళ్తే ఆ ప్రభావం మార్కెట్లో కనబడేది. పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరిగేది. రైతుబీమా కోసం కంపెనీకి కట్టవలసిన రూ.80 కోట్ల ప్రీమియం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.
పంటలు వేసే సమయానికి రైతులకు అందాల్సిన భరోసా సొమ్ము మూడు పంటలకు దక్కనేలేదు. చివరకు పోయిన యాసంగి పంటలకు మొదలై పంట కోతలకు వచ్చాక కోతలతో రైతులకు అందింది. ఇంకా ఆ పంటకాలపు సొమ్ము రూ.5 వేల కోట్లు రైతులకు అందవలసి ఉంది. జనవరి 26న ప్రారంభించిన రైతు భరోసా సొమ్ము మార్చి 31 నాటికి రైతులందరి ఖాతాల్లో జమవుతుందని ప్రకటించారు. ఆ మాట నిలువలేదు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేస్తామని జూన్ 16న ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ ఖాతాల్లో సొమ్ము జమకాని రైతులు లక్షల్లో ఉన్నారు. సగం మంది రైతులకే రుణమాఫీ జరిగింది. ఇలా రూ.15 వేల కోట్లు ఈ పథకానికి టోకరా ఇచ్చింది. ఈ మాత్రం దానికి రాని మోదీని రమ్మని అనడం ఓ డ్రామా. రుణమాఫీ గురించి చర్చించడానికి ప్రతిపక్ష నేత అవసరం లేదు. మాఫీ సొమ్ము దక్కని ఒక్క రైతు చాలు కాంగ్రెస్ నోరు మూయించడానికి. ముందుకుసాగని సవాళ్లు విసిరి అధిష్ఠానం ముందు మార్కులు పొందవచ్చేమో కానీ, ప్రజల వద్ద పొందలేరు.
– బద్రి నర్సన్ 94401 28169