మాలేగావ్.. మహారాష్ట్రలోని ఈ నగరం పేరు ఇప్పుడు రాజకీయాల్లో మారుమోగిపోతున్నది. దేశంలో ఇదొక ప్రముఖ వస్ర్తాల ఎగుమతి కేంద్రం. ఈ నగరం చర్చల్లో నిలవడానికి కారణం మరొకటి ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. భవిష్యత్తు రాజకీయాల సరళిని తెలిపే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండటమే ఇందుకు కారణం.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే అని చెప్పుకొచ్చారు. ఈ మాటలను బీజేపీ రాష్ట్ర నేతలు పట్టించుకోలేదు. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ, అనుబంధ విభాగాలు రేవంత్ మాటలను సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ చేశాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కొనఊపిరితో ఉన్నది. ఆ మాత్రం మిణుకుమిణుకుమంటూ అది కూడా ముస్లిం ఓటు బ్యాంక్ వల్లే. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికీ మైనారిటీల ఓట్లు కీలకంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కర్నాటక ముస్లిం పెద్దలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు.
నిజానికి బాబ్రీ ఘటన తర్వాత ముస్లింలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆ వర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రయత్నించారు. ఆఖరికి పీవీ నరసింహారావు అంత్యక్రియలను కూడా ఢిల్లీలో జరిపేందుకు, ఆయన పేరిట స్మారక చిహ్నం నిర్మించేందుకు కూడా ఇష్టపడలేదు. పీవీ వల్లనే కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమవుతున్నారని భావించి, సొంత పార్టీ ప్రధాని అయినా పీవీ అంత్యక్రియలపై అంత కఠినంగా వ్యవహరించారు. బీజేపీ బలం పుంజుకుని కేంద్రంలో అధికారంలోకి రావడంతో ముస్లింలు హస్తం పార్టీకి దగ్గరయ్యారు. కానీ తాజాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ వైఖరిలో మార్పు వస్తున్నదని తెలుస్తున్నది. ప్రధానంగా మాలేగావ్ ఫలితాలు చూస్తుంటే అక్కడి మాడల్‌తో ముస్లింలే కాంగ్రెస్‌కు మరణ శాసనం రాస్తున్నారని స్పష్టమవుతున్నది.
గతంలో మాలేగావ్తోపాటు చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రాజ్యమేలింది. ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని ఇస్లామిక్ పార్టీతోపాటు ఎంఐఎం పార్టీ ఆక్రమించింది. ముస్లింల ఓట్లపై ఆశలు పెట్టుకొన్న కాంగ్రెస్‌కు నిద్ర లేకుండా చేసే ఫలితాలు ఇవి. ఇస్లామిక్ పార్టీ పేరులోనే అసలు విషయం ఉన్నది. మాలేగావ్‌లో ఇస్లాం పార్టీ పుట్టుకొచ్చింది. ఇస్లాం పార్టీ పూర్తి పేరు.. ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ అఫ్ మహారాష్ట్ర. సంక్షిప్త పేరు ఇస్లాం. మతం పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, దానిలో సెక్యులర్ అనే పదాన్ని కూడా చేర్చడం గమనార్హం. నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్టు ఇస్లాం పార్టీలో సెక్యులరిజం ఉంటుంది అన్నమాట. మాలేగావ్‌లో మొత్తం జనాభా 4.71 లక్షల మంది కాగా, అందులో 3.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు ముస్లింలు. కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు మూడు. ఒక్క మాలేగావ్లోనే కాదు, మహారాష్ట్రలోని ముస్లింల ప్రాబల్యం ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉన్నది. ఈసారి ఎంఐఎం సీట్ల సంఖ్య పెంచుకోగా, కాంగ్రెస్ సీట్ల సంఖ్య తగ్గింది. అర్బన్ ప్రాంతాల్లో ఎంఐఎం బలం పెరుగుతుంటే కాంగ్రెస్ సీట్లు తగ్గుతున్నాయి. మహారాష్ట్ర మున్సిపాలిటీల్లో ఒకప్పుడు అధికారం చెలాయించిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేకపోతున్నది. ఔరంగాబాద్ (ఛత్రపతి సంభాజీనగర్)లో కాంగ్రెస్ ఒకే సీటుకు పరిమితమైంది. అక్కడ ఎంఐఎంకు 33 సీట్లు వచ్చాయి. అమరావతిలో 11, ముంబ్రాలో 5, గోవండిలో 4, ధూలేలో 10, నాందేడ్‌లో 13, అహమ్మద్‌నగర్‌లో 2, జాల్నాలో 2, సోలాపూర్‌లో 8, స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం గెలిచిన సీట్ల కన్నా కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీసిన ప్రభావమే ఎక్కువ కనిపిస్తున్నది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నది. ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్న చోట్ల బరిలో నిల్చుంటున్నది. దీనివల్ల బీజేపీకి ప్రయోజనమే. కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నది కాంగ్రెస్, ఇతర సెక్యులర్ పార్టీలు.
హైదరాబాద్‌లో ముస్లింలు గెలుపోటముల నిర్ణాయక స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేసి, గెలుస్తున్నది. గెలిచే స్థా యిలో ముస్లింలు లేని నియోజకవర్గాల్లో ఎ క్కువ సందర్భాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నది. దాదాపు దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ వైఖరి బాగా ఉపయోగపడింది. మన ఓట్లు మనమే వేసుకుందాం, కాంగ్రెస్‌ను నమ్ముకోవడం, సెక్యులర్ పార్టీలను నమ్ముకోవడం కన్నా ముస్లిం పార్టీలను నమ్ముకోవడం మంచిది అనే భావన ముస్లింలలో చాలా రోజుల నుంచి వినిపిస్తున్నది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దీనిని రుజువు చేస్తున్నాయి.

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల పరిణామాలు కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీస్తే బీజేపీకి ప్రయోజనం కలిగిస్తున్నాయి. వివిధ రాష్ర్టా ల్లో ఎంఐఎం పోటీ చేయడం బీజేపీకి ఉపయోగపడేందుకే అనే విమర్శ బలంగా ఉన్నది. ఈ విమర్శలో నిజానిజాలు ఎలా ఉన్నా కాంగ్రెస్, సెక్యులర్ పార్టీలు లేకపోతే ఎంఐఎం పార్టీనే దిక్కు అనే పరిస్థితి లేదు. ఎంఐఎం కాకపోతే ఇస్లామిక్ పార్టీ ఉన్నది అని ముస్లింలు భావిస్తున్నట్టు మాలేగావ్ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు మాలేగావ్‌లో ఇస్లాం పార్టీ విజయాన్ని చూస్తుంటే లండన్, న్యూయార్క్‌లకు ముస్లిం లు మేయర్లు అయ్యారు. తర్వాత, ముంబై మేయర్ అవుతారు అని మాలేగావ్ ఫలితాలపై జీ న్యూస్ (హిందీ) విశ్లేషణ. ముస్లిం ఓటు బ్యాంకుతో దశాబ్దాలపాటు అధికారం చెలాయించి, ఇప్పటికీ ముస్లిం ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకొన్న కాంగ్రెస్‌కు మాలేగావ్ మాడల్, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ. ఒక రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆయా మున్సిపాలిటీల్లో పరిస్థితులు ప్రధాన పాత్ర వహిస్తాయని ఎవరైనా వాదన చేయవచ్చు. కానీ ఇస్లాం పార్టీ విజయం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టగా ఎంఐఎం అనేక ప్రాం తాల్లో ప్రభావం చూపడం కాంగ్రెస్‌కు కచ్చితంగా కోలుకోలేని దెబ్బనే.