నీ సముడైన యభ్యుదయనిష్ఠ వెలుంగు కవీశుడెవ్వడున్
చూసిన కానరాడు, పొగచూరిన నాటి చరిత్రలోన నీ
భాసితమైన దీప్తి, ప్రతిభాయుత వాఙ్మయశోభితప్రభల్
రాసులువోసి వెల్గినవి రక్కసి మూకల ద్రోలు నీటె లై!
కాగుచునున్న నాటి తెలగాణపుసీమల విస్ఫులింగముల్
మూగినవేళ, నీ హృదయ పుష్పిత పద్యకవోష్ణమాలికల్
సాగుచు పారద్రోలినవి చంపుచునున్న నరాధమావళిన్
దాగినవేమొ నీ కలము దారుల మానవతా ప్రవాహముల్!
జనములనెల్లదోచుకొని చంపుచు రేగిన దుష్టరాక్షసుల్
వెనుకకు చూడకుండ కడు భీతి పలాయనమైరి నీ వచో
ఘనరుధిరాగ్ని ధారలకు కాలుచు కూలుచు తేలిపోవుచున్
వినిహితమయ్యే శాంతిమయవేదిక నీ కవితాప్రచోదనన్ !
దేశ సమగ్రతారుచిరదీపము వోలె త్వదీయ పద్యసం
కాశము శాంతి కోశమయి కాంతులు చిందెను రత్నగర్భలో
స్వాశయమయ్యె నీకు జనవాసములందు వెలుంగు నాశయే
నీ శమసత్త్వభావనము నింపెను స్ఫూర్తిని కీర్తి నిల్పుచున్ !
ఠీవిగ సుప్రభాతముల టీకలు దీసెడు నీ పదావళిన్
మోవిని నిల్పు గీతముల బూనినవేళ మనమ్ము నిండెడిన్
భావనలోన నిప్పులను భద్రము జేసిన నీ వచస్సులన్
ద్రావకనుండదీ ధరణి, దాశరథీ! కవితాపయోనిధీ!
-అయాచితం నటేశ్వరశర్మ
9440468557