జగిత్యాలలో ఈ నెల 22న స్థానిక కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో రాజకీయ కలకలాన్ని సృష్టించింది. గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డికి సన్నిహితుడు కావడం ఆ విషాద సందర్భానికి మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న జీవన్‌రెడ్డిని ఈ హత్య మరింత కుంగదీస్తూ ఆవేశానికి గురిచేసింది. తనను ఊరడించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలపై ఆయన తన ఆక్రోశం వ్యక్తం చేశారు. జగిత్యాలలో తన ప్రాబల్యాన్ని తగ్గించడం వల్లనే ఈ హత్య జరిగిందని, ఈ పరిస్థితులకు కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవడమే అని ఆయన బాహాటంగా అంటున్నారు.
తమ పార్టీకి చెందిన ఒక ప్రాంతీయ నేత పట్టపగలు హత్యకు గురైన సంఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యుల నుంచి ఎలాంటి విచారం, స్పందన, ఖండన లేకపోవడం గమనార్హం. సమీప అనుచరుడి హత్య పట్ల బాధపడుతున్న జీవన్‌రెడ్డికి కూడా పార్టీ నుంచి ఎలాంటి సాంత్వన లభించడం లేదు. ఆయన మాటలు, వేదన అరణ్యరోదనగా మిగిలిపోయాయి. ఆయన పట్ల కాంగ్రెస్ వైఖరి చూస్తే కొత్త కోడెను చేరదీసి ముసలి ఎద్దును కబేళాకు అప్పగించినట్టుగా ఉన్నది.
హత్య పట్ల జీవన్‌రెడ్డి చేపట్టిన నిరసన వద్దకు వచ్చిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో ఆయన తన అసహనం వెళ్లబుచ్చుకున్నారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అనడం ఆయన అనుభవిస్తున్న వేదనకు పరాకాష్ఠ. ‘నాలుగు నెలలుగా అవమానాన్ని సహిస్తున్నాను. ఇంతకాలం మానసికంగా అవమాన పరిచారు, ఇప్పుడు భౌతిక దాడులకు దిగుతున్నారు’ అని బాధపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాత్రం ‘అందరితో చర్చించి, అన్నీ ఆలోచించాకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం, జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన సొంతం’ అని అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేను చేర్చుకునేటప్పుడు జీవన్‌రెడ్డికి మాట మాత్రంగానైనా చెప్పని విషయంపై పెద్ద రాద్ధాంతమే అయింది. జీవన్‌రెడ్డి తన అలకను బుజ్జగింపులతో సరిపుచ్చుకున్నారు.
ఈ పరిణామాలను చూస్తుంటే రేవంత్ ఆధిపత్యంలో కాంగ్రెస్ పాత కాపులకు గడ్డుకాలమే వచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు తర్వాత అంతటి సీనియర్ నేత జీవన్ రెడ్డి. హనుమంతరావును కొత్త తరం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పక్కన పెట్టింది. ఢిల్లీ నుంచి పైరవీ చేసినా ఆయనకు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరువును కాపాడుకునేందుకు పార్టీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు ఉన్న నాయకులకు ఫిరాయింపురాయుళ్లతో తంటా వచ్చింది. జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని సందర్భాల్లో పెద్ద దిక్కుగా ఉన్న జీవన్‌రెడ్డికి ఇంత అగౌరవం ఊహించనిది. కొత్త నీరు వచ్చినట్టుగా కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ తన పట్టు కోసం పార్టీ మూలాలను భ్రష్టు పట్టిస్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్‌లో చేరేముందే సీనియర్లు తమ సంగతి ఏమిటనేది పెద్దగా ఆలోచించలేదు. వారు టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు తప్ప రేవంత్ వల్ల వచ్చే ప్రమాదాలను ముందే ఊహించలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సీనియర్ల హక్కులకు భంగం కలగకుండా అధిష్ఠానం నుంచి మాట తీసుకొని ఉండాల్సింది. అదే జరిగితే జీవన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలోనూ ఇక్కడి పార్టీ సీనియర్ల గురించి తెలిసినవాళ్లు, వాళ్లను పట్టించుకునేవారు కరువయ్యారు. ఆరుసార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌కు 40 ఏండ్లు బలంగా నిలిచిన జీవన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి కూడా ఎలాంటి ఊరట లభించడం లేదు.
పార్టీ కోసం నలభై ఏండ్లు పాటుపడిన జీవన్‌రెడ్డికి వృద్ధాప్యంలో ఇంత క్షోభ వస్తుందని ఆయన ఊహించి ఉండరు. తనపై గెలిచిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడమే ఆయనకు పెద్ద షాక్. నియోజకవర్గంలో జరిగిన హత్య పట్ల తనపై వ స్తున్న ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యే తోసిపుచ్చ డం తప్ప హత్య పట్ల ఎలాంటి విస్మయాన్ని, విభ్రాంతిని ప్రకటించలేదు. గత నలభై ఏండ్లుగా కాంగ్రెస్‌నే నమ్ముకున్న జీవన్‌రెడ్డి పార్టీ కోసం సర్వ శక్తులు ధారపోశారు. స్థానిక, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, కొందరు నా యకులు పార్టీలు మారినా, ఆయన మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏదేమైనా జీవన్‌రెడ్డికి రేవంత్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్లో కాం గ్రెస్ సీనియర్లకు కూడా సెగ తగిలే ఉంటుంది. భవిష్యత్తులో ఆయన టికెట్ల కేటాయింపులో సీనియర్లను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. టికెట్ దొరికి ఓడిపోతే మాత్రం వారి కాలం ముగిసినట్టే. జీవన్‌రెడ్డి ఉదంతం చెప్తున్నది అదే.
పార్టీ కోసం నలభై ఏండ్లు పాటుపడిన జీవన్‌రెడ్డికి వృద్ధాప్యంలో ఇంత క్షోభ వస్తుందని ఆయన ఊహించి ఉండరు. తనపై గెలిచిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడమే ఆయనకు పెద్ద షాక్. గత నలభై ఏండ్లుగా కాంగ్రెస్‌నే నమ్ముకున్న జీవన్‌రెడ్డి పార్టీ కోసం సర్వశక్తులు ధారపోశారు.
( నర్సన్ బద్రి 9440 128169 )