ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని.. అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట. అలివిగాని ఆశలు వెంటాడంగ ఎండమావిల వెంట పరుగులు పెడతారట. ఎన్నికల నాట మన మానసిక పరిస్థితి ఇదే! రూ.లక్ష కట్నం.. తులం బంగారం.. రూ.4 వేల పింఛన్ హామీల వెంట ఉరుకులు పెట్టినం. ఈ పున్నామ నరకం మనకొద్దని జనహితం కోరి జాతిపిత కేసీఆర్ గొంతు చించుకున్న మాటలు మనకు రుచించ లేదు.
నాటి ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన మాటలు మరొక్కసారి గుర్తుచేసుకుందాం. ‘మోసపోతే గోసపడుతం.. బతుకులు ఆగమైతయి.. మనం చెదిరిపోయిన నా డు మళ్లీ పాత తెలంగాణ వస్తది. ఒక్కసారి దెబ్బతింటే..! ఉన్న కూర్పు చెడిపోతే..! తెలంగాణ సమాజానికి మంచిది కాదు..తెలంగాణ తెచ్చినవాళ్లుగా చెప్పటం మా బాధ్యత.’ అని అచ్చంపేట సభలో చెప్పిండు. అసుంటపోయి పాలమూరు సభల చెప్పిండు. అదే మాట సూర్యాపేట వచ్చి చెప్పిండు. కానీ మన చెవికెక్కలేదు. సారు మంచోడే అనుకుంటనే.. ఒకరిద్దరు దారితప్పిన ఎమ్మెల్యేలను తల్సుకుంట పాడి బర్రె తీరు సారును కాదనుకొని పోయి కంపల పడితే ఇవ్వాళ్టికి లేపి నిలబెట్టే దిక్కు లేదు.
అచ్చంగా ఆరోజు సారు చెప్పినట్టే ఈ రోజున ఆగం పాలైతున్నం. ఏం గ్రహచారం ఇది. చావు బొబ్బలతోనే మళ్లీ పల్లెలు తెల్లారుతున్నయి. సోమవారం దినపొద్దు సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి రైతు పరశురాములు ఊరు ముందరి పెద్దమ్మ తల్లి గుడి గంటకు పీనుగై వేలాడుతూ కనిపించిన వికల, విషాద శోక దృశ్యం కడుపుల పేగులను మెలిపెట్టింది. ఎవడు మోసుకొచ్చిన పాపం ఇది. కాంగ్రెస్ పాలన వచ్చిన నాటినుంచి ఈ రోజు వరకు తెలంగాణలో 465 మంది రైతుల అసహజ మరణాలు జరిగాయి. ఇటువంటి అనుభవాలు తెలంగాణకు కొత్త కాదు. 12 ఏండ్ల కింది ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకు మించిన నరకపు సంవేదన తెలంగాణది. నీళ్లింకిన బోర్లను చూసి కన్నీళ్లతోనే కాలమెల్లదీసిన అనుభవం తెలంగాణది. చెరువులు ఎండిపోయి, బావుల్లో నీటి ఊట రాక, పొట్టకొచ్చిన చేను వట్టిపోతుంటే.. ఇగో..!
ఈ మధ్యకాలంలో నీటి చెమ్మ కోసం నిర్మల్ జిల్లా నీలాయిపేట రైతు రాజన్నతట్టతోని వరి పైరుకు నీళ్లు చల్లుతూ పంటను కాపాడుకోవటానికి తండ్లాడుతున్న దృశ్యం ప్రతి పల్లెలో ఉండేది. అయినా పంట చేతికి అందక గుండెలు బాదుకుంటూ పంట సేండ్లనే పాణం ఇడిసిన చరిత్ర తెలంగాణది. పొద్దంత కాయ కష్టం చేసి పొద్దుగూకి ఇంటికొచ్చి అడ్డమొరిగితే.. కన్నుఅంటుకునే లోపు కరెంటు పోయి.. దోమలు ఒంట్లె నెత్తురు పీలుస్తుంటే ఆ బాధను కనురెప్ప మాటునే దాచుకొని కునుకు తీసిన బండ బతుకు తెలంగాణ పల్లెలది. తెల్లారకముందే కరెంటోళ్లు ఇండ్లళ్ల చొరబడి కరెంటు బిల్లు కింద ఆలి మెడ మీది పుస్తెలు గుంజుకపోతుంటే గుండెలు అవిసేలా ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్లు పట్టిన గతం తెలంగాణది.
ఈ కష్టాలు, కన్నీళ్లు,చావులు వద్దనే కదా తెలంగాణ కోసం బాపు తండ్లాడింది. కేసీఆరే కొలువుకెక్కి గోదావరి మీద కాళేశ్వరం కట్టకడితే మా ఊరు సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంల కొత్త చెరువు మత్తడి దుంకింది. తెలంగాణ బంగారం పల్లెం పట్టుకొని రాలేదు. 5000 మెగావాట్ల విద్యుత్ సంక్షోభాన్ని మూట గట్టుకొని వచ్చింది. కేసీఆర్ పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ పోయి ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను బతిమిలాడితే..చిమ్మచీకట్లను చీల్చుకుంటూ సరికొత్త వెలుగులు రాష్ట్రంలోకి చొచ్చుకువచ్చాయి. రూ.3.90కే యూనిట్ చొప్పున కరెంటు తీసుకొస్తే వ్యవసాయానికి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందింది. దానికి రైతుబంధు తోడైయింది. రూ.1.64కోట్లు ఖర్చుచేస్తే కాళేశ్వరం, కొండపోచమ్మ, రంగనాయకసాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు మోత మోగుకుంటా జలపాతాలను తలిపించినయి. 97.48 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందినయి.
సారు కోటి ఎకరాల మాగాణి అనే చెప్పారు కానీ ఆయన కొలువు దిగే నాటికి 2.2 కోట్ల ఎకరాల సాగు విసీర్ణం రైతుల చేతిలో పెట్టారు. (2024 ఆర్బీఐ నివేదిక ప్రకారం) కాల గమనంలో పదేండ్లు గిర్రున తిరిగినయి. కాలంతో పనిలేకుండా పంటలు చేతికందినయి. దండుగ అనుకున్న వ్యవసాయం జీవనోపాధి నుంచి వాణిజ్య స్థాయికి ఎదిగింది. సాలుసరి దిగుబడి 4.65 కోట్ల టన్నులు వచ్చింది. అప్పులు మొగ్గినయి. రైతు ఆత్మహత్యలు ఆగినయి. పల్లె లోగిళ్లు పెండ్లి, పేరంటాళ్లు, జాతర్లు, జాజిరి పాటలతో సాంస్కృతిక పునర్జీవనం పోసుకున్నది. పోరల చదువులకు ఎల్లుబాటైం ది. రైతులు, రైతు కూలీల మొఖం జరంత తెల్లబడ్డది. కానీ కష్టపడి తెలంగాణ రూపురేఖలు దిద్దిన సారు మొఖమే మన కంటికి మసకబారింది.
ఎవరిని పలుకరించినా పదేండ్లు అవకాశం ఇచ్చినం. కొత్తోళ్లను కూసోబెడుదామన్న మాటే గానీ, మంచి చెడుల యోచనే లేకపాయే. పగ బట్టినట్టు పట్టుబట్టి కేసీఆర్ను ఓడించినం. ఇప్పు డేం మూటగట్టుకున్నం? సారుకు మనం అవకాశం ఇచ్చినమా?మనకు సారు అవకాశాలు కల్పించిండా? ఆత్మ యోచన చేసుకోవాలే. పేద కొంపల మీదికి సర్కారు వదిలిన హైడ్రా భూతం అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు వస్తున్నది. సర్కారు బుల్డోజర్లు జనం మీద పడుతుంటే పేద మధ్య తరగతి కుటుంబాలు ‘నా ఇళ్లు కూలిపోతంది.. కేసీఆరన్నా రాయే’ అని గుండెలు బాదుకుంటున్నయి. రియల్ ఎస్టేట్ ఉపాధి పోయింది.కార్మిక జీవనం ఆగింది. పట్టణం సంగతి అట్లుంటే.. ఇక పల్లె జీవనం మరీ అధ్వాన్నం. కాళేశ్వరంను ఎండబెట్టి పల్లె సాగుబాటును పండబెట్టిండ్రు. రంగనాయకసాగర్, కొండ పోచమ్మ, గడ్డెన్నవాగు, చలివాగు, నాగార్జునసాగర్, జూరాల ఇలా ప్రతి చోటా ప్రాజెక్టుల కింద వరి సాగు తడి తప్పింది. ‘నిలబడ్డకాన్నుంచే జారిపోతన్నం సారూ కేసీఆర్ చెయ్యందుకొని పైకి గుంజు’ అని రైతాంగం దిక్కులు చూస్తున్నది.
గాయపడ్డ బిడ్డ అమ్మా అనటం ఎంత ప్రాకృతికమో..! తెలంగాణాలో దెబ్బతిన్న తనువులు బాపూ అని పలవరించటం అంతే సహజం. మనకు కష్టం వస్తే బాపు బరిగీసి నిలబడాలే. కానీ ఆయన మీద జరుగుతున్న కుట్రలు మాత్రం మనకు పట్టవు. సారు కరెంటు తెస్తే బావి మోటరు పొద్దంత పొసింది. ఇప్పుడా హరిత కాంతికి అవినీతి ఆపాదిస్తున్నరు. కరెంటు కొనుగోళ్ల మీద కమిషన్ వేసి దోషిగా నిలబెట్టే కుతంత్రాలు చేస్తున్నరు. కాళేశ్వరం మహా యజ్ఞానికి మకిలి పూసి కమిషన్ వేసిండ్రు. గతి తప్పిన ఇటువంటి పాలకుల మీద ప్రొటెస్టు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సకల జనులు సంఘటితమై నిలబడక పోతే మళ్లీ తెలంగాణ ఆగమైతది.
ఇకడో కాల ధర్మాన్ని గుర్తు చేయాలి. అర్థాష్టమ శని ప్రభావం రెండున్నర ఏండ్లేనట. ఈ లోపు బాధిత జనం మేల్కొని నివారణ యజ్ఞానికి పూనుకోకుంటే అష్టమ దశలోకి శని ఆగమనం జరుగుతుందని వైదిక శాస్త్రం ప్రభోధిస్తున్నది. చంద్రబాబు పాలనలో మా ఊరి పల్లెల పంటి దీన్ని ఏలినాటి శని అని అనుకోంగ విన్న. ఏలినాటి శని ఫలితం ఏడున్నర ఏండ్లట. ఏడాదిన్నర కాలంలో 20 ఏండ్ల కింది బాధలన్నీ అనుభవించినం.
దుష్ట పాలన పోవాలని ఇంటి గుమ్మానికి దిష్టిబొమ్మలు వేలాడ గడుదాం.రుణమాఫీ, రైతు భరోసా అందని రైతాంగం పంట పొలాల్లో దిష్టిబొమ్మలు నిలబెట్టి నిరసిద్దాం.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు