సుమారు ఆరు దశాబ్దాల (బలవంతపు) సహజీవనం, అందులోనూ 52 ఏండ్ల రాజకీయ పెత్తనం, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఆంధ్రవారి వలసలు, తెలంగాణ వనరుల దోపిడి, ఇక్కడి ప్రజలకు జరిగిన అన్యాయాలు, పక్షపాత ధోరణి-ఆంధ్రా, తెలంగాణ విడిపోవటానికి గల కారణాల్లో కొన్ని అయితే, వీటిని మించిన కారణం ఒకటుంది. అది భావసమైక్యత లేకపోవడం! ఈ సమైక్యత లోపించటానికి ముఖ్య కారణం భాషా సమైక్యత లేకపోవటం! ఆంధ్రులకు, తెలంగాణవారికి ఈ వైరుధ్యం, వారు విడిపోయి పదేండ్లయినా తగ్గకపోవటానికి ముఖ్య కారణం తెలుగు, ఆంధ్రం వేరు భాషలవటమే! ఆ రెండూ ఒక్క భాష కాదు, ఒక్క మూలంలోంచి కూడా రాలేదు. అందుకే ఈ రెండు ప్రాంతాల ప్రజలకు భావాల, సంస్కృతుల మధ్య సమైక్యత దశాబ్దాల పాటు కలిసి ఉన్నా ఏర్పడలేదు.
తెలుగు భాష తెలంగాణవారి సొంతం, ఆంధ్రా ప్రాంతం వారి భాష సంస్కృత పదాలతో నిండి ఉన్న ఆంధ్ర భాష! ఇది తెలియని నెహ్రూను మోసగించి ఈ రెండు ప్రాంతాలను ఒక్క రాష్ట్రంగా భాషా ప్రాతిపదికన ఏర్పరిచినా ఆ కలయిక ఫలించలేదు. రాష్ట్ర విభజన అనివార్యమైంది. ‘వెయ్యేండ్లు కలిసున్నా వేరు పడవలసిందే’ అన్న గోరేటి వెంకన్న మాట నిజమైంది. శ్రీలంకలో స్థానిక లంకేయులకు, తమిళవారికి పొట్లాటలకు కారణం భాషే! కేరళలో సమంగా ఉన్న మూడు మతాల సఖ్యతకు కారణం వారంతా మాట్లాడేది ఒకే భాష కావటం! ఇప్పటికీ, తమ దేశం మత ప్రాతిపదిక మీద విడిపోయినా, బంగ్లాదేశ్‌లో ముస్లింలలో కూడా అధికులు బెంగాలీయే తమ మాతృభాషగా భావించటానికి కారణం కూడా భాషకున్న ప్రభావమే!
Telangana | కులం కంటే, మతం కంటే మానవ భావాలను ప్రభావితం చేసేది భాష! సుమారు 400 ఏండ్లు ముస్లిం రాజుల పరిపాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా మనటానికి వారందరూ ఒకే భాష మాట్లాడగలగడం. మొదట్లో పర్షియన్, తర్వాత ఉర్దూ దేశ భాషలుగా ఉండి, ఇక్కడి హిందువులు తెలుగు, కన్నడం, మరాఠీ మాతృభాషలుగా ఉన్నా, పర్షియన్, ఉర్దూ భాషలను కూడా తమ భాషలుగా భావించటం వలన ప్రజల్లో మత వైరుధ్యాలు లేవు. ముస్లింలు దసరా, వినాయక చవితికి పండాలు అలంకరిస్తే, హిందువులు మిలాద్ ఉన్ నబీ, పీర్ల పండుగలు జరుపుకునేవారు. సమైక్యతకు సరైన అర్థం అదీ! తెలుగు, ఆంధ్రం విడి భాషలన్నది చారిత్రక ఆధారాలు కూడా నిరూపిస్తాయి. వాటిని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి.
‘ఆంధ్ర’ అన్న పదం ‘ఐతరేయ బ్రాహ్మణం’లో కనిపిస్తుంది. అందులోని ఒక కథ ప్రకారం.. తన నూర్గురు కొడుకుల మీద కోపగించిన విశ్వామిత్రుడు వారిని ఇంట్లోంచి వెళ్లగొడతాడు. అప్పుడు ఉత్తర భారతం నుంచి వారిలో కొందరు దక్షిణ దిశకు పయనించి దండకారణ్యం గుండా వచ్చి కృష్ణా, గోదావరి నదీతీరాలలో స్థిరపడ్డారు. ఈ ప్రయాణంలో వారు కొద్దిగా ద్రవిడ భాషలోని పదాలు తీసుకుని తాము అప్పటిదాకా మాట్లాడిన సంస్కృత భాషతో కలిపి వాడటం మొదలుపెట్టారు. అందుకే ఆంధ్రావారి భాష పూర్తిగా సంస్కృత పద భూయిష్టమైంది. వ్యాకరణ రీతులు కూడా పూర్తిగా సంస్కృత వ్యాకరణంతో కలుస్తాయి. పైగా వారిది ఆర్య సంస్కృతి. త్రిలింగ దేశంగా పిలవబడిన తెలంగాణ ప్రాంతంలో వాడే భాష ద్రవిడ భాష అయిన తెలుగు. మూడు శైవక్షేత్రాల మధ్య (శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం) ఉన్న ఈ భాష మాత్రమే తెలుగు. దీనిమీద సంస్కృత భాష ప్రభావం లేదు!
భరత ముని రచించిన ‘నాట్యశాస్త్రం’ (2 బీసీ)లో ఆంధ్రుల జాతి గురించిన ప్రస్తావనలో, వారి భాష ‘ఆంధ్రం’ అని ఉంది. తెలుగు అన్న పదం ఈ రచనలో గాని, ప్రాచీన వాఙ్మయంలో గాని, బౌద్ధ రచనలలో గాని, ప్రాచీన ప్రాకృత రచనలలో గాని కనపడదు. ఆంధ్ర ప్రాంతంవారి భాష ‘ఆంధ్రం’ అని ఆ ప్రాంతంలోని బౌద్ధ ఆరామాల్లో కనిపిస్తే, తెలంగాణలో జైన, బౌద్ధ, ఆరామాల్లో ఇక్కడి భాష ‘తెలుగు’ అని ఉంటుంది. ఈ మధ్య మెదక్‌లో దొరికిన 1300 ఏండ్ల కిందటి శాసనంలో తెలంగాణ పురం (ప్రస్తుత తెల్లాపూర్) అన్న ఊరు ప్రత్యేక దేశమైన త్రిలింగ దేశంలో ఉందని స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ దేశాలు, భాషలు రెండూ మొదటినుంచీ వేరని తెలుస్తుంది.
ఇక యుగయుగాల చరిత్రలు చూద్దాం! త్రేతాయుగానికి చెందిన రామాయణంలో, ద్వాపరయుగానికి చెందిన మహాభారతంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. రామాయణంలో సీతని వెతకటానికి వానరులను పంపిస్తూ దక్షిణ దిశలో ఉన్న కొన్ని దేశాలని వర్ణిస్తూ సుగ్రీవుడు ఆంధ్ర దేశం గురించి ప్రస్తావిస్తాడు. (కిష్కింధకాండ, 41 సర్గ, 12వ శ్లోకం). మహాభారతంలో వేదవ్యాసుడు కూడా సహదేవుడు ఆంధ్రులను చిత్తుగా ఓడించాడని రాశాడు.
ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే.. కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు అధర్మపరుడైన దుర్యోధనుడిని సమర్థించి, కౌరవసేనలో ఉండి పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. (బహుశా చంద్రబాబు అప్పుడు ఆంధ్రదేశానికి రాజై ఉంటాడు ఆ జన్మలో!) ఆంధ్రుల గురించి రాసిన తన సుదీర్ఘ వ్యాసంలో పెప్పర్ స్ప్రే వీరుడు లగడపాటి రాజగోపాల్ ఈ విషయం మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టాడు.
రామాయణ, భారతాల్లోనే కాక, పురాణాల్లో, చరిత్రలో, సాహిత్యా ల్లో, అన్నిచోట్ల ఆంధ్ర ప్రాంతంలో నివసించేవారిది ఆంధ్ర జాతి అని, వారు మాట్లాడేది ఆంధ్ర భాష అని ఉందే తప్ప, ‘తెలుగు’ అన్న పదం వారికి సంబంధించి ఎక్కడా లేదు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో ఎప్పుడూ కలిసిలేదు. అంతేకాదు, ఆంధ్రవారి ఆదికవి నన్నయ కాలం నుంచీ తమది ఆంధ్ర భాషే అని రాశారు కవులు, సాహిత్యకారులంతా. ‘వ్యాసరచిత భారతం నయం ఆంధ్ర భాషగా నొనర్చి జగతి బొగడుగతి నన్నపార్యు, తిక్కనను, క్రితక్రతు శంభుదాసు నెర్రకవి దలతు భక్తి’ అని వ్యాసకర్తలు కవిత్రయాన్ని పొగిడారు. కవి నన్నెచోడుడు తన రచన ‘కుమార సంభవం’లో ఈ రెండు భాషల భేదాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. ‘మును మార్గ కవిత లోకంబున నిల్పి ఆంధ్ర విషయంబన, దేశికవిత బుట్టించి తెనుగున’ అని కవిత్వంలో కూడా ఈ భాషలు వేరని విశదీకరించాడాయన. కవిత్రయం వారి ఆంధ్ర భారతం తెలుగు బాగా వచ్చినవారికి కూడా అర్థం కాదు, దివాకర్ల వెంకటావధాని గారు దిగివచ్చి వివరిస్తే తప్ప! అదే పోతన ‘భాగవతం’ గాని, పాల్కుర్కి సోమన ‘బసవ పురాణం’ గాని ఎంతో సులభంగా అర్థమవుతాయి. కవిత్రయం కూడా తాము వ్యాసభారతాన్ని ‘ఆంధ్రీకరించామని’ అన్నారే కానీ, ‘తెలుగీకరించామని’ అనలేదు. అది ఆంధ్ర మహాభారతంగానూ, పోతనది తెలుగు భాగవతంగానూ మొదటినుంచీ అందరూ గుర్తించారు. నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని రాయటాన్ని ప్రశంసిస్తూ తిక్కన ఇలా అన్నాడు. ‘ఆంధ్ర కవితా విశారదుండు విద్యాదాయితుండొనరించె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్’ (విరాట పర్వం, 6వ పద్యం). అంతేకాదు, తాను కూడా ఆంధ్రుల కోసమే ఈ పని చేశానని చెప్పుకున్నాడు. ‘కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదం బొరయునట్లు రచియించెదన్ కృతుల్ (విరాటపర్వం 30వ పద్యం). కవిత్రయంలో నన్నయ సగం రాసిన అరణ్యపర్వాన్ని పూర్తిచేసిన మూడోకవి ఎర్రన కూడా తన భాష ఆంధ్రమనే అన్నాడు కానీ, తెలుగు అని ఎక్కడా అనలేదు. ‘శేషోన్నయం ఆంధ్ర భాషా సుజనోత్సవ మొప్పగ నిర్వచించెదన్’ (నృసింహ పురాణం, 17వ పద్యం).
ఇక 20వ శతాబ్దంలో కూడా ఈ రెండు భాషలు వేరన్న భావమే కనిపిస్తుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 150 ఏండ్లపైన కలిసి ఉన్న ఆంధ్రులు రాజకీయాలల్లో కూడా బాగానే పెత్తనం చేశారు. గుంటూరులో హైకోర్టు బ్రాంచ్ ఒకటి పెట్టినప్పుడు అక్కడి ఉద్యోగాల్లో ఒక తమిళుడిని నియమించారన్న కారణంతో ప్రత్యేక రాష్ట్ర పాట మొదలుపెట్టారు ఆంధ్ర రాజకీయ నాయకులు. తాము సగం మద్రాసు రాష్ర్టాన్ని ఆక్రమించటం, సంపద పోగు చేసుకోవటం బాగానే ఉంది.
ఆంధ్ర ప్రాంతంలో తమిళుడికి ఒకే ఒక్క ఉద్యోగం ఇవ్వటం మాత్రం నచ్చలేదు. అక్కడ భాష అడ్డం వచ్చింది. తమ స్వరాష్ట్రం కోసం 1911 నుంచీ నడిపిన సభలను కూడా ‘ఆంధ్ర మహాసభలు’ అన్నారే కానీ ‘తెలుగు సభలు’ అనలేదు. ఆఖరికి ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో కూడా ఎక్కడా తాము తెలుగువారని చెప్పలేదు, ఆ పదమే వాడలేదు.
నిజానికి వారు దురాశతో మద్రాసు నగరం తమకు కావాలని అడగకపోతే 1952లో కాకుండా, ఎంతో ముందుగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది. కానీ, మద్రాసే తమ రాజధాని కావాలని పొట్టి శ్రీరాములును కూడా ఉద్యమంలో దింపి వాదించారు. తర్వాత భాషా ప్రయుక్త రాష్ర్టాలనేటప్పటికీ ఆంధ్ర రాజకీయ నాయకుల కళ్లు సుసంపన్న హైదరాబాద్ మీద పడ్డాయి. నిజానికి పొట్టి శ్రీరాములుకు హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడుందో కూడా తెలియదు. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఆయన మద్రాస్ కోసం పోరాడాడు. అయితే తర్వాత ఆంధ్ర నాయకులు ఆయన తెలుగు రాష్ట్రం కావాలన్నాడని, అన్నీ మార్చినట్టే, ఈ మాట చరిత్రలో ఇరికించారు. 1956 వరకు వచ్చిన వార్తా పత్రికలు ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని గురించి రాశాయే గానీ, ఎక్కడా తెలుగు రాష్ట్రం అన్న మాటే లేదు. ప్రత్యేక రాష్ట్రమైన మూడేండ్లలోనే ఆర్థికంగా చతికిలపడ్డాక ఒకే వర్ణమాల ఉన్న తెలుగు, ఆంధ్రం ఒక్క భాషగా వాదించవచ్చని ఆంధ్ర రాజకీయ నాయకుల బుర్రలలో ఒక మెరుపు మెరిసింది. రెండు ప్రాంతాలను కలిపితే తెలంగాణకు వచ్చే నష్టాలను ఫజల్ అలీ కమిషన్ వివరంగా తన రిపోర్ట్‌లో ఇవ్వగానే ఖంగు తిన్న ఆంధ్ర రాజకీయ నాయకులు తెలుగు జపం మొదలుపెట్టారు.
1955లో విడుదలైన మాయాబజార్ సినిమాలో కూడా గోంగూరని ‘ఆంధ్ర శాకం’ అన్నారే కానీ తెలుగు పచ్చడి అనలేదు. ప్రపంచంలోనే సుసంపన్న దేశంగా వెలిగిన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు హఠాత్తుగా ఆంధ్రులకు సోదరులై పోయారు. ఈ ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే వారి వాదనకు కారణం భాషా సారూప్యం కాదు, భావసమైక్యత అంతకంటే కాదు. శతాబ్దాల తరబడి చరిత్రలో వైవిధ్యం, సంస్కృతిలో వైరుధ్యం ఉన్నా, ఆంధ్రం, తెలుగు ఒకటే భాష అనీ, తాము సోదరులమనీ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశం గురించి తెలియని నెహ్రూను మభ్యపెట్టి, నమ్మించి ఒకే రాష్ట్రంగా ఏర్పరచగలిగారు. కానీ, దురదృష్టమేమంటే తమ సహజ పెత్తందారీతత్వం, దోపిడి గుణం మానుకోలేకపోయారు. ఇక్కడ అప్పటిదాకా కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, మలయాళీల వంటి దక్షిణదేశ ప్రజలే కాక, ఉత్తర భారతం నుంచి వచ్చిన మార్వాడీ, పంజాబీ, గుజరాతీ మొదలైన భాషల వారు కూడా నిజాం రాష్ట్రంలో కనీసం రెండు శతాబ్దాల నుంచీ నివసించారు. అయితే వారు తెలంగాణ సంస్కృతిలో భాగమయ్యారే కానీ, ఈ ప్రాంతీయులను వ్యతిరేకభావంతో చూడలేదు. అంతేకాదు, నిజాం రాష్ట్రంలో జీతాలు ఎక్కువగా ఉండటం, నిజాం సైన్యంలో పరదేశీయులు కూడా ఉండేవారు. ఇరాన్, ఇరాక్, ఆఫ్రికన్, మధ్య తూర్పు దేశాల నుంచి వచ్చినవారు కూడా ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకొని సంతోషంగా తెలంగాణ ప్రాంతీయులైపోయారు.